రాష్ట్రపతి వీటో అధికారం

 

       పార్లమెంట్ ఉభయసభలచే ఆమోదించిన బిల్లులు చట్టాలుగా మారాలంటే వాటిపై రాష్ట్రపతి ఆమోదముద్ర అవసరం. ఏదైనా బిల్లును పార్లమెంట్ ఉభయసభలు ఆమోదించి రాష్ట్రపతికి ఆమోదం కొరకు పంపితే రాష్ట్రపతికి క్రింది మూడు మార్గాలు ఉంటాయి. (111వ అధికరణ ప్రకారం)

  • ఆ బిల్లును ఆమోదింవచవచ్చు; లేదా
  • ఆ బిల్లును తన దగ్గరే ఉంచుకోవచ్చు; లేదా
  • ఆర్థిక బిల్లులు కాని బిల్లులను పార్లమెంట్ కు తిరిగి పంపవచ్చు.

అలా పంపిన బిల్లులు పార్లమెంట్ సవరణలు చేసి లేదా చేయకుండా ఆమోదించి రాష్ట్రపతికి తిరిగి పంపితే తప్పనిసరిగా రాష్ట్రపతి ఆమోదముద్ర వేయాలి.

అబ్స‌ల్యూట్ వీటో

అప్పల్యూట్ వీటో అంటే పార్లమెంట్ లో ఆమోదం పొంది రాష్ట్రపతికి పంపిన బిల్లులను రాష్ట్రపతి తిరస్కరించడం, అలాంటి సందర్భంలో ఆ బిల్లు చట్టంగా మారకుండానే రద్దువుతుంది. ఈ వీటోను క్రింది రెండు సందర్భాలలో వినియోగంచుకోవచ్చు.

  • ప్రయివేటు సభ్యుల బిల్లు (మంత్రులు కాని పార్లమెంట్ సభ్యులు ప్రవేశపెట్టిన బిల్లులు) బిల్లులు; మరియు
  • పాత కేబినెట్ రాజీనామా చేయక ముందు పార్లమెంట్ ఆమోదించబడిన బిల్లులను కొత్తగా ఏర్పడిన కేబినెట్ రాష్ట్రపతికి ఆమోదించవద్దని సలహా ఇచ్చినప్పుడు

సస్పెన్సివ్ వీటో

ఏదైనా బిల్లును రాష్ట్రపతి పున: పరిశీలన నిమిత్తం పార్లమెంట్ కు పంపిన సందర్భంలో ఆ సస్పెన్సివ్ వీటోను వినియోగించడం జరుగుతుంది. కాని, అలా పార్లమెంట్ కు చేరిన బిల్లును సవరించి లేదా సవరణలు చేయకుండా ఆమోదించి రాష్ట్రపతి అనుమతి కొరకు పంపినట్లయితే రాష్ట్రపతి తప్పనిసరిగా ఆమోదించాలి. అంటే రాష్ట్రపతికి గల సస్పెన్సివ్ వీటోను పార్లమెంట్ సాధారణ మెజారిటీతో ఎదుర్కో గలదు.

ఈ వీటోను ద్రవ్య బిల్లుల విషయంలో వినియోగించడానికి వీలులేదు. అంటే భారత రాష్ట్రపతి ద్రవ్య బిల్లులను ఆమోదించవచ్చు లేదా తిరస్కరించ వచ్చు. కాని పున:పరిశీలన నిమిత్తం పార్లమెంట్ కు పంపరాదు. సాధారణంగా ద్రవ్య బిల్లులను పార్లమెంట్ లో ప్రవేశపెట్టడానికి ముందే రాష్ట్రపతి ఆమోద ముద్ర పాందుతాయి.

పాకెట్ వీటో

ఈ సందర్భంలో రాష్ట్రపతి తన దగ్గరకు వచ్చిన బిల్లులను ఆమోదించకుండా లేదా తిరస్కరించకుండా తన దగ్గరే ఉం చుకుంటాడు. ఈ విధంగా బిల్లులపై ఎలాంటి చర్యలు తీసుకోకుండా అలాగే ఉంచుకోవడాన్ని పాకెట్ వీటో అంటారు. రాష్ట్రపతి ఆమోదం కోసం పంపిన బిల్లులను ఎంతకాలం లోపు ఆమోదించాలన్న అంశం రాజ్యాంగంలో ఎక్కడ కూడా పేర్కొన బడలేదు. కాబట్టి ఈ పాకెట్ వీటోను రాష్ట్రపతి ఎటువంటి కాల పరిమితి లేకుండా వినియోగించుకుంటాడు.

రాజ్యాంగ సవరణ బిల్లుల విషయంలో రాష్ట్రపతికి వీటో అధికారం ఉండదు. 24వ రాజ్యాంగ సవరణ చట్టం, 1971 ద్వారా రాజ్యాంగ సవరణ బిల్లులను రాష్ట్రపతి తప్పనిసరిగా ఆమోదించాలని రాజ్యాంగంలో పేర్కొనడం జరిగింది.

రాష్ట్ర శాసనాలపై రాష్ట్రపతి వీటో అధికారం

రాష్ట్ర శాసనాలకు సంబంధించిన విషయాలలో కూడా రాష్ట్రపతికి వీటో అధికారం ఉంటుంది. రాష్ట్ర శాసనసభ ఆమోదించిన బిల్లులు చట్టాలుగా మారాలంటే తప్పనిసరిగా ఆ బిల్లులు గవర్నర్ లేదా రాష్ట్రపతి (ఒక వేళ బిల్లును రాష్ట్రపతి పరిశీలనకు పంపినపుడు) ఆమోద ముద్ర పొందాలి.

రాష్ట్ర శాస‌న‌స‌భ ఆమోదించిన బిల్లును గ‌వ‌ర్న‌ర్ ఆమోదం కోసం పంపిన‌ప్పుడు గవర్నర్ కు 4 మార్గాలుంటాయి. (200వ అధికరణ ప్రకారం)

  • ఆ బిల్లును గవర్నర్ ఆమోదించవచ్చు; లేదా
  • ఆ బిల్లును ఆమోదించకుండా తిరస్కరించవచ్చు, లేదా
  • రాష్ట్ర శాసన సభకు పున:పరిశీలన నిమిత్తం తిరిగి పంపవచ్చు (ద్రవ్య బిల్లులు కానివి), లేదా
  • రాష్ట్రపతి పరిశీలన కోసం బిల్లును రిజర్వు చేయడం.

రాష్ట్ర శాసన సభలచే ఆమోదం పొందిన బిల్లులను గవర్నర్ రాష్ట్రపతి పరిశీలన నిమిత్తం రిజర్వు చేసినప్పుడు, రాష్ట్రపతికి మూడు మార్గాలుంటాయి. (201వ అధికరణ ప్రకారం)

  • ఆ బిల్లును ఆమోదించవచ్చు. లేదా
  • ఆ బిల్లును ఆమోదించకుండా తిరస్కరించవచ్చు: లేదా
  • రాష్ట్ర శాసన సభకు పున:పరిశీలన నిమిత్తం తిరిగి పంపమని గవర్నర్ కోరవచ్చు.

అలా పంపిన బిల్లును రాష్ట్ర శాసన సభ సవరణలతో సవరణలు లేకుండా ఆమోదించి తిరిగి పంపితే రాష్ట్రపతి తప్పనిసరిగా ఆమోదించాల్సినవసరం లేదు. అంతేగాక అలాంటి బిల్లులు రాష్ట్రపతి ఎంతకాలం తమ దగ్గర ఉంచుకోవాలో కాలపరిమితిని రాజ్యాంగంలో ఎక్కడా పేర్కొనలేదు. అంటే ఈ బిల్లుల విషయంలో రాష్ట్రపతి పాకెట్ వీటోను వినియోగించకునే అవకాశం గలదు.