రాజ్యాంగ సవరణ

           రాజ్యాంగం అనేది మారుతూ, సజీవంగా ఉండే పత్రం. ఏ దేశ రాజ్యాంగం పవిత్రమైనది, స్థిరమైనది, మార్చడానికి వీలులేనిదిగా ఉండదు. సమాజంలో మార్పులకు, ప్రజాప్రయోజనాలకు అనుగుణంగా సవరణలకు వీలుగా ఉంటుంది. సాధారణంగా రాజ్యాంగాలను సాధారణ మెజారిటీతో లేదా ప్రత్యేక మెజారిటీతో సవరిస్తారు.

          సవరణ అంటే కొత్త ప్రకరణలను చేర్చడం, ప్రకరణ తొలగించడం, పూర్తిగా తొలగించడం. ఒక ప్రకరణలోని అంశం స్థానంలో మౌలిక అంశాన్ని చేర్చడం (Substitute) మొదలైనవి. అంశాలన్నింటిని సవరణలు (Amendment)గానే పరిగణిస్తారు.

పద్ధతులు

368వ ఆర్టికల్‌ రాజ్యాంగ సవరణ పద్ధతిని వివరిస్తుంది. రాజ్యాంగాన్ని 3 పద్ధతుల్లో సవరించే వీలుంది.

 1. పార్లమెంటు సాధారణ మెజారిటీ ద్వారా జరిగే సవరణ పద్ధతి

 2. పార్లమెంటు ప్రత్యేక మెజారిటీ ద్వారా జరిగే సవరణ పద్ధతి

 3. పార్లమెంటు ప్రత్యేక మెజారిటీ, సగానికి కంటే ఎక్కువ రాష్ట్ర శాసనసభల ఆమోదం ద్వారా జరిగే సవరణ పద్ధతి.

నోట్‌: రాజ్యాంగాన్ని సవరించే అధికారం పార్లమెంటుకు ఉంటుంది.

రాజ్యాంగంలోని 368లో 5 క్లాజులు ఉన్నాయి.

 1. పార్లమెంటుకు రాజ్యాంగాన్ని, రాజ్యాంగ సవరణ ప్రక్రియను సవరించే అధికారం ఉంది.

 2. ప్రత్యేక మెజారిటీతో సవరించే అంశాలు

 3. రాజ్యాంగ సవరణ చట్టం న్యాయసమీక్ష పరిధిలోకి రాదు

 4. పార్లమెంటు చేసిన రాజ్యాంగ సవరణను రాజ్యాంగ విరుద్ధమంటూ న్యాయస్థానంలో ప్రశ్నించడానికి వీలులేదు.

 5. సవరణ అధికారాల్లో మార్పులు, కూర్పులు, రద్దు చేసే అంశంలో పార్లమెంటుకు ఏ విధమైన ఆంక్షలు వర్తించవు.

నోట్‌: 368వ ఆర్టికల్‌ను ఇప్పటివరకు రెండుసార్లు సవరించారు. 1971లో 24వ రాజ్యాంగ సవరణ, 1976లో 42వ రాజ్యాంగ సవరణ. 24వ రాజ్యాంగ సవరణ ద్వారా 1, 3 క్లాజులు, 42వ రాజ్యాంగ సవరణ ద్వారా 4, 5 క్లాజులు చేర్చారు. సుప్రీంకోర్టు 1980లో మినర్వామిల్స్‌ కేసులో 4, 5 క్లాజులు రాజ్యాంగ విరుద్ధమని, మౌలికస్వరూపానికి విఘాతం కలిగిస్తాయని తీర్పుచెప్పింది.

ముఖ్యాంశాలు

  • రాజ్యాంగ సవరణకు సంబంధించిన బిల్లును పార్లమెంటులో ఏ సభలోనైనా ప్రవేశపెట్టవచ్చు.
  • రాజ్యాంగ సవరణ బిల్లును మంత్రివర్గ సభ్యుడు కాని (పబ్లిక్‌ బిల్లుగా) లేదా ప్రైవేటు సభ్యుడు కాని (ప్రైవేటు బిల్లుగా) ప్రవేశపెట్టవచ్చు. రాష్ట్రపతి ముందస్తు అనుమతి అవసరం లేదు.
  • ఈ బిల్లు పార్లమెంటు ఉభయసభలు వేర్వేరుగా ప్రత్యేక మెజారిటీతో (2/3 వంతు సభ్యులు) ఆమోదించాలి.
  • పార్లమెంటు ఉభయసభల మధ్య బిల్లుపై ప్రతిష్టంభన ఏర్పడినప్పటికీ బిల్లు వీగిపోతుంది. అంతేకాని సంయుక్తసమావేశానికి అవకాశం లేదు.
  • రాజ్యాంగంలోని సమాఖ్యపరమైన అంశాలకు చెందిన బిల్లు ఏదైనా ఉంటే దానిని సగం కంటే తక్కువ కాని రాష్ట్రశాసనసభలు కూడా సాధారణ మెజారిటీతో ఆమోదించాలి.
  • పార్లమెంటులోని రెండు సభలు యథాతథంగా ఆమోదించిన తర్వాత, అవసరమైన సందర్భంలో రాష్ట్రశాసనసభల ఆమోదం అనంతరం ఆ బిల్లును రాష్ట్రపతి ఆమోదానికి పంపించాలి.
  • రాష్ట్రపతి రాజ్యాంగ సవరణ బిల్లును ఆమోదించాలి. దీనిని రాష్ట్రపతి నిలిపివేయడం కాని, పునఃపరిశీలించమని పార్లమెంటుకు తిరిగి పంపించడం చేయరాదు.
  • రాష్ట్రపతి ఆమోదించిన తర్వాత రాజ్యాంగ సవరణ బిల్లు చట్టంగా మారుతుంది.

అంశాలు

  • పార్లమెంటు సాధారణ మెజారిటీ ద్వారా రాజ్యాంగంలోని అనేక అంశాలను పార్లమెంటు ఉభయసభల్లో సాధారణ మెజారిటీ ద్వారా సవరిస్తుంది. ఇవి 368వ ఆర్టికల్‌ పరిధిలోకి రావు. ఈ అంశాలు..
  • నూతన రాష్ర్టాల ఏర్పాటు, సరిహద్దుల మార్పులు, పేర్లు మార్చడం
  • రాష్ట్ర శాసనమండలి రద్దు లేదా ఏర్పాటు
  • రాజ్యాంగ ఉన్నతపదవుల జీతభత్యాలు
  • పార్లమెంటు సభ్యుల ప్రత్యేక హక్కులు, జీతభత్యాలు
  • పార్లమెంటు సమావేశానికి కోరమ్‌
  • పార్లమెంటులో ఉపయోగించే భాష
  • సుప్రీంకోర్టు న్యాయమూర్తుల సంఖ్య
  • సుప్రీంకోర్టుకు ఎక్కువ అధికార పరిధిని సంక్రమింపజేయడం
  • అధికార భాష వాడుక
  • పౌరసత్వం అంశాలు
  • నియోజకవర్గాల పునర్‌వ్యవస్థీకరణ
  • కేంద్రపాలిత ప్రాంతాల్లో శాసనసభ ఏర్పాటు
  • 5, 6వ షెడ్యూళ్లలో పేర్కొన్న అంశాలు

పార్లమెంటు ప్రత్యేక మెజార్టీ ద్వారా రాజ్యాంగంలోని పలు అంశాలు పార్లమెంటు ప్రత్యేక మెజారిటీ ద్వారా సవరిస్తారు. ప్రత్యేక మెజారిటీ అంటే పార్లమెంటులో ప్రతిసభలోనూ మొత్తం సభ్యుల సంఖ్యలో మెజారిటీ సభ్యులు (50శాతం కంటే ఎక్కువ) హాజరై ఓటువేసే సభ్యుల్లో మూడింట రెండు వంతులకు తక్కువకాని మెజారిటీ సభ్యులు.

సవరించే అంశాలు

ప్రాథమిక హక్కులు (12-35 వరకు ఆర్టికల్స్‌)

ఆదేశిక సూత్రాలు (36-51 వరకు ఆర్టికల్స్‌)

మొదటి, మూడో పద్ధతిలో పేర్కొన్న ఇతర అన్ని అంశాలు.

పార్లమెంటు ప్రత్యేక మెజారిటీ రాష్ర్టాల ఆమోదం: సమాఖ్య వ్యవస్థకు సంబంధించిన అంశాలను పార్లమెంటు తన ప్రత్యేక మెజారిటీ ద్వారా సగం రాష్ట్ర శాసనసభల ఆమోదంతో సవరిస్తుంది. మిగిలిన రాష్ర్టాల్లో ఏ ఒక్క రాష్ట్రం కాని, కొన్ని రాష్ర్టాలు కాని, అన్ని రాష్ర్టాలు ఈ బిల్లుపై చర్య తీసుకోలేకపోయినా పరవాలేదు. సగం రాష్ర్టాలు ఆమోదించడంతో ఈ లాంఛనం పూర్తవుతుంది. ఈ బిల్లుపై రాష్ర్టాలు తమ ఆమోదం ఇవ్వడానికి ఎటువంటి కాలపరిమితి లేదు.

దీని ద్వారా కింది అంశాలు సవరిస్తారు

  • రాష్ర్టాల్లో ఎన్నిక విధానం
  • రాష్ట్రపతి ఎన్నిక విధానం
  • కేంద్ర, రాష్ట్ర కార్యనిర్వాహక అధికార విస్తృతి
  • సుప్రీంకోర్టు, హైకోర్టుకు సంబంధించిన నిబంధనలు
  • ఏడో షెడ్యూల్‌లో పేర్కొన్న జాబితాలోని అంశాలు
  • రాష్ర్టాలకు పార్లమెంటులో ప్రాతినిథ్యం
  • రాజ్యాంగ సవరణ పద్ధతి

ముఖ్యమైన సవరణలు

మొదటి రాజ్యాంగ సవరణ చట్టం (1951)

రాజ్యాంగసభనే తాత్కాలిక పార్లమెంటుగా సవరణ చేసింది. ఈ సవరణ ద్వారా 31(A), 31(B) ఆర్టికల్స్‌ కొత్తగా చేర్చారు. 9వ షెడ్యూల్‌ రాజ్యాంగంలో చేర్చారు.

ముఖ్యాంశాలు

  • స్వేచ్ఛాహక్కు, సమానత్వపుహక్కు, ఆస్తిహక్కుపై ప్రజాప్రయోజనాల దృష్ట్యా నియంత్రణలు విధించారు.
  • భూసంస్కరణలకు సంబంధించిన సంస్కరణలను 9వ షెడ్యూల్‌లో చేర్చారు.
  • 9వ షెడ్యూల్‌లో చేర్చిన అంశాలు కోర్టుల న్యాయసమీక్ష పరిధిలోకి రావు.
  • అసెంబ్లీలకు సంబంధించిన సమావేశ కాలాలు, న్యాయాధికారుల నియామకాలు
  • ప్రభుత్వ విద్యాసంస్థల్లో ఎస్సీ, ఎస్టీ వర్గాలకు రిజర్వేషన్లు


7వ రాజ్యాంగ సవరణ చట్టం (1956)

ఈ సవరణ ద్వారా అనేక ప్రకరణలను సవరించారు. రాష్ర్టాల పునర్‌వ్యవస్ధీకరణకు సంబంధించిన రాజ్యాంగ సవరణగా పేరుగాంచింది.

ముఖ్యాంశాలు

  • రాష్ర్టాల పునర్విభజన ద్వారా 14 రాష్ర్టాలు, కేంద్రపాలితప్రాంతాలు ఏర్పాటు చేశారు.
  • రాజ్యాంగం నుంచి 7, 9 భాగాలను తొలగించారు.
  • లోక్‌సభ, రాజ్యసభ, రాష్ట్ర శాసనసభల స్థానాలపై మార్పులు
  • హైకోర్టులో తాత్కాలిక, అదనపు న్యాయమూర్తుల నియామకానికి అవకాశం కల్పించారు.
  • కేంద్రపాలిత ప్రాంతాలకు సంబంధించిన అంశాలపై మార్పులు జరిగాయి.
  • ఆంధ్రప్రదేశ్‌, పంజాబ్‌, బాంబే రాష్ర్టాలకు సంబంధించి కొన్ని ప్రత్యేక అంశాలను చేర్చారు.


9వ రాజ్యాంగ సవరణ చట్టం (1960)

సుప్రీంకోర్టు సలహా ద్వారా రాజ్యాంగ సవరణ చేశారు. భారత్‌, పాక్‌ మధ్య సరిహద్దు వివాద పరిష్కారం చేయడానికి చేసిన సవరణ ఇది. సవరణకు సంబంధించిన ముఖ్యాంశం బేరుబారి ప్రాంతాన్ని రెండుభాగాలుగా చేసి కొంత ప్రాంతాన్ని పాకిస్థాన్‌లో విలీనం చేశారు.


10వ రాజ్యాంగ సవరణ చట్టం (1961)

దాద్రానగర్‌ హవేలీని కేంద్రపాలిత ప్రాంతంగా భారతదేశంలో విలీనం చేశారు.


12వ రాజ్యాగ సవరణ చట్టం (1962)

గోవా, డామన్‌-డయ్యూలను భారత్‌లో విలీనం చేశారు.


14వ రాజ్యాంగ సవరణ చట్టం (1962)

పాండిచ్చేరి ప్రాంతాన్ని కేంద్రపాలిత ప్రాంతంగా భారత్‌లో చేర్చారు. దీంతోపాటు పాండిచ్చేరికి ప్రత్యేకశాసనసభ, మంత్రివర్గాన్ని ఏర్పాటు చేశారు.


15వ రాజ్యాంగ సవరణ చట్టం (1963)

హైకోర్టు న్యాయమూర్తుల పదవీ విరమణ వయస్సును 60 నుంచి 62 ఏండ్లకు పెంచారు. హైకోర్టులో పదవీ విరమణ చేసిన న్యాయమూర్తులను తాత్కాలిక న్యాయమూర్తులుగా నియమించే అవకాశం కల్పించారు. హైకోర్టు అధికార పరిధిని విస్తరించారు.


21వ రాజ్యాంగ సవరణ చట్టం (1967)

సింధీ భాషను అధికార భాషగా 8వ షెడ్యూల్‌లో చేర్చారు. 15వ అధికార భాషగా సింధీ కొనసాగుతుంది.


24వ రాజ్యాంగ సవరణ చట్టం (1971)

పార్లమెంటుకు ప్రాథమిక హక్కులతో సహా రాజ్యాంగంలోని ఏ భాగాన్నైనా సవరించే అధికారం కల్పించారు. 13(4) ఆర్టికల్‌ను చేరుస్తూ రాజ్యాంగ సవరణ చట్టం ఏదైనా న్యాయసమీక్ష పరిధిలోకి రాదు.


25వ రాజ్యాంగ సవరణ చట్టం (1971) 

31(C) ఆర్టికల్‌ను రాజ్యాంగంలో చేర్చారు. దీని ప్రకారం ఆదేశిక సూత్రాల్లోని  39(b), 39(c) అమలుకు చట్టాలు చేస్తే న్యాయస్థానం ప్రశ్నించరాదు. ఈ చట్టాలు ప్రాథమిక హక్కులకు మినహాయింపు.


26వ రాజ్యాంగ సవరణ చట్టం (1971)

291 ఆర్టికల్‌ ప్రకారం భరణాలను సంస్థానాధీశులకు చెల్లించేవారు. ఈ ఆర్టికల్‌ను రాజ్యాంగం నుంచి తొలగించారు.


39వ రాజ్యాంగ సవరణ (1975)

రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి, ప్రధానమంత్రి, లోక్‌సభ స్పీకర్‌ ఎన్నికకు సంబంధించిన అంశాలు న్యాయసమీక్ష పరిధి కిందకు రావు.


42వ రాజ్యాంగ సవరణ చట్టం (1976) 

  • రాజ్యాంగ సవరణ చట్టాల్లో ఇది పెద్దది. ఈ సవరణ ద్వారా అత్యధిక అంశాలను రాజ్యాంగంలో చేర్చారు. దీనిని మినీ రాజ్యాంగం అంటారు.
  • ఈ సవరణ ద్వారా చేర్చిన ఆర్టికల్స్‌- 31(డి), 32(ఎ), 39(ఎ), 48(ఎ), 51(ఎ), 131(ఎ), 139, 144 (ఎ), 226 (ఎ), 257 (ఎ), 323(ఎ), IV (ఎ), XIV (ఎ) భాగాలను చేర్చారు.
  • రాజ్యాంగ పీఠికలో సామ్యవాద, లౌకిక, సమగ్రత పదాలను చేర్చారు.
  • 368(4) ప్రకారం రాజ్యాంగ సవరణ చట్టాలను న్యాయస్థానాల్లో ప్రశ్నించరాదు.
  • ఆదేశిక సూత్రాల పరిధిని పెంచారు.
  • ప్రాథమిక హక్కుల కంటే ఆదేశిక సూత్రాలకు ఎక్కువ ప్రాధాన్యం ఇచ్చారు.
  • ప్రాథమిక విధులను రాజ్యాంగంలో చేర్చారు.
  • కోర్టులకు గల న్యాయసమీక్షాధికార పరిధిని నియంత్రించారు.
  • లోక్‌సభ, రాష్ట్రశాసనసభల పదవీకాలాన్ని 5 నుంచి 6 ఏండ్లకు పెంచారు.
  • ప్రాథమిక హక్కులపై నిర్బంధాలు విధించే అధికారాలను పెంచారు.
  • పారిశ్రామిక యాజమాన్యంలో కార్మికులకు భాగస్వామ్యం కల్పించడం
  • రాష్ట్రపతి కేంద్ర మంత్రివర్గసభ్యుల సలహా ప్రకారం వ్యవహరించాలి
  • జాతీయ అత్యవసర పరిస్థితిని దేశంలో ఒకప్రాంతంలో అమలు చేయడానికి అవకాశం కల్పించారు.
  • ప్రభుత్వ ఉద్యోగుల కోసం అడ్మినిస్ట్రేటివ్‌ ట్రిబ్యునల్స్‌ను ఏర్పాటు చేశారు.


44వ రాజ్యాంగ సవరణ చట్టం-1978

42వ రాజ్యాంగ సవరణ చట్టం తర్వాత అతిపెద్ద సవరణగా పేరుగాంచింది.

మొరార్జీదేశాయ్‌ ప్రభుత్వం రాజ్యాంగంలో సమగ్రమైన మార్పుల కోసం 44వ రాజ్యాంగ సవరణ చేసింది.

ఈ సవరణ అమలు తేదీ- 1979 జూన్‌ 20, 1979 ఆగస్ట్‌ 1, 1979 సెప్టెంబర్‌ 6

ముఖ్యాంశాలు

  • ఆస్తిహక్కును ప్రాథమిక హక్కుల జాబితా నుంచి తొలగించారు.
  • ఆస్తిహక్కును చట్టబద్ధమైన హక్కు (300(ఎ)) ఆర్టికల్‌గా మార్చారు.
  • లోక్‌సభ, శాసనసభల పదవీకాలాన్ని ఆరేండ్ల నుంచి తిరిగి ఐదేండ్లకు తగ్గించారు.
  • ఎమర్జెన్సీ పరిస్థితుల్లో లోక్‌సభ, శాసనసభ పదవీకాలాన్ని ఏడాదికి పెంచే అవకాశం కల్పించారు.
  • రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి ఎన్నికల వివాదాలను విచారించే అధికారం పార్లమెంట్‌ నుంచి సుప్రీంకోర్టుకు తిరిగి కల్పించారు.
  • జాతీయ అత్యవసర పరిస్థితిని క్యాబినెట్‌ లిఖితపూర్వకమైన సిఫారసు లేకుండా విధించరాదు.
  • లోక్‌సభలోని 1/10వ వంతు సభ్యులు ఒక తీర్మానం చేస్తూ జాతీయ అత్యవసర పరిస్థితిని రద్దు చేయడానికి రాష్ట్రపతి/లోక్‌సభ స్పీకర్‌కు నోటీస్‌ ఇవ్వడంస్వేచ్ఛాహక్కు, పత్రికాస్వేచ్ఛను పునరుద్ధరించడం
  • పార్లమెంట్‌, శాసనసభ సభ్యుల ఎన్నికకు సంబంధించిన విషయాలపై హైకోర్టు నిర్ణయం తీసుకుంటుంది.
  • రాజ్యాంగ యంత్రాంగం విఫలమైతే రాష్ట్రపతి పాలన ఆరునెలల కంటే ఎక్కువ అమలు చేయరాదు. 356కు ఒక కొత్త క్లాజును చేర్చడం ద్వారా కింది పరిస్థితుల్లో పొడిగించడానికి వీలు కల్పించారు.
  • జాతీయ అత్యవసర పరిస్థితి కొనసాగుతున్నప్పుడు ఏడాదిపైనా ప్రతిసారి పొడిగించవచ్చు.
  • ఎన్నికల కమిషన్‌ ఎన్నికల నిర్వహణకు వీలుకాదని ధృవీకరించినప్పుడు
  • ఆర్టికల్‌ 22ను సవరించడం ద్వారా నివారక నిర్బంధానికి సంబంధించి కొన్ని రక్షణలు కల్పించారు. 
    • అవి 1) సలహాసంఘం అనుమతి లేకుండా నివారక నిర్బంధం ఉంచిన వ్యక్తి అత్యధిక నిర్బంధ కాలం 3 నెలల నుంచి 2 నెలలకు తగ్గించారు.

 2) సలహాసంఘంలో ఒక అధ్యక్షుడు, ఇద్దరు సభ్యులు ఉండాలి.

 3) పార్లమెంట్‌ చేసిన చట్టంలో పేర్కొన్న కాలం కంటే ఏ వ్యక్తినీ ఎక్కువ కాలం నిర్బంధంలో ఉంచకూడదు.

 4) 2 నెలలు దాటిన నివారక నిర్బంధానికి సలహాసంఘం అనుమతి తప్పక ఉండాలి.

  • కేంద్ర మంత్రిమండలి పంపిన సిఫారసులను రాష్ట్రపతి ఒకసారి పునఃపరిశీలనకు తిరిగి పంపే అవకాశం.
  • ఈ సవరణ ద్వారా 352ను సవరించారు. 

ముఖ్యాంశాలు: 1) అంతర్గత అశాంతి అనే పదాన్ని తొలగించి సాయుధ తిరుగుబాటు అనే పదాన్ని చేర్చారు.

 2) జాతీయ అత్యవసర పరిస్థితి ప్రకటనను పార్లమెంట్‌ నెలలోపు (30 రోజులు) ఆమోదించాలి. ఈ సవరణ కంటే ముందు 2 నెలలుగా ఉండేది.

 3) అత్యవసర పరిస్థితి ప్రకటనను ఒకసారి ప్రకటించాక తిరిగి రద్దుచేసేంతవరకు నిరవధికంగా కొనసాగేది. కానీ ఈ సవరణ అత్యవసర పరిస్థితిని ప్రకటించిన మొదటి 6 నెలల తర్వాత ప్రతి 6 నెలల పొడిగింపునకు పార్లమెంట్‌ అనుమతి తప్పక ఉండాలి.


52వ రాజ్యాంగ సవరణ చట్టం-1985

రాజీవ్‌గాంధీ ప్రభుత్వం పార్టీ ఫిరాయింపులను అరికట్టడానికి ఈ సవరణ చేశారు.

అమలు తేదీ 1985, మార్చి 1

సవరణకు గురైన ఆర్టికల్స్‌ 101, 102, 190, 191

పార్టీ ఫిరాయింపుల నిరోధక చట్టాన్ని నూతనంగా చేర్చిన Xవ షెడ్యూల్‌లో చేర్చారు.


61వ రాజ్యాంగ సవరణ చట్టం-1989

326వ ఆర్టికల్‌ను సవరించారు.

అమలు తేదీ 1989, మార్చి 28

ముఖ్యాంశం: ఓటుహక్కు కనీస వయో పరిమితిని 21 ఏండ్ల నుంచి 18 ఏండ్లకు తగ్గించారు.


69వ రాజ్యాంగ సవరణ చట్టం-1991

239(ఎఎ), 239(ఎబి) ఆర్టికల్స్‌ను చేర్చారు.

ఈ సవరణ 1992, ఫిబ్రవరి 1 నుంచి అమలులోకి వచ్చింది.

ముఖ్యాంశం: 239(ఎఎ) ఆర్టికల్‌ ప్రకారం కేంద్రపాలిత ప్రాంతాన్ని ‘జాతీయ రాజధాని ప్రాంతం’గా పరిగణిస్తారు. దాని పరిపాలకుడిని లెఫ్టినెంట్‌ గవర్నర్‌ అని పిలుస్తారు. ఢిల్లీ జాతీయ రాజధాని ప్రాంతానికి ఒక శాసనసభ ఉటుంది.

239(ఎబి) ఆర్టికల్‌ ప్రకారం జాతీయ రాజధాని ప్రాంతంలో రాజ్యాంగ యంత్రాంగం విఫలమైనప్పుడు తీసుకోవాల్సిన చర్యల గురించి తెలుపుతుంది.


70వ రాజ్యాంగ సవరణ చట్టం-1992

ఆర్టికల్‌ 54, 239(ఎఎ)లను సవరించారు.

1992, డిసెంబర్‌ 21 నుంచి అమలులోకి వచ్చింది.

ముఖ్యాంశం: ఢిల్లీ, పాండిచ్చేరి అసెంబ్లీ సభ్యులకు, రాష్ట్రపతి ఎన్నికలకు సంబంధించి ఎన్నికల గణంలో భాగస్వామ్యం కల్పించారు.


73వ రాజ్యాంగ సవరణ చట్టం- 1992

ఆర్టికల్‌ 280ను సవరించి 280 (3)(బిబి)ను చేర్చారు.

243, 243(ఎ) నుంచి 243(ఓ) వరకు మొత్తం 16 ఆర్టికల్స్‌ను రాజ్యాంగంలో చేర్చారు.

IXవ భాగాన్ని తిరిగి చేరుస్తూ ‘ది పంచాయత్స్‌' అని పొందుపర్చారు.

XIవ షెడ్యూల్‌ను నూతనంగా చేర్చారు.

సవరణ అమలు తేదీ 1993, ఏప్రిల్‌ 24

ముఖ్యాంశం: పంచాయతీ సంస్థలకు దేశమంతా ఒకే మౌలిక విధానాన్ని అమలుపరుస్తూ, వాటికి రాజ్యాంగబద్ధత కల్పించారు.

పంచాయతీ సంస్థలకు 29 అంశాలల్లో రాష్ట్రప్రభుత్వాలు అధికారాలు కల్పించాలి.


74వ రాజ్యాంగ సవరణ చట్టం-1992

ఆర్టికల్‌ 280ను సవరించి 280(3)(సి)ను చేర్చారు.

243(పి) నుంచి 243(2(జి)) ఆర్టికల్స్‌ చేర్చారు.

9(ఎ)వ భాగాన్ని చేరుస్తూ ‘ది పంచాయతీస్‌' అని పొందుపర్చారు.

XIIవ షెడ్యూల్‌ను నూతనంగా చేర్చారు.

1993, జూన్‌ 1 నుంచి అమలులోకి వచ్చింది.

ముఖ్యాంశం: నగరపాలక సంస్థలకు దేశమంతా ఒక మౌలిక విధానాన్ని అమలుపరుస్తూ వాటికి రాజ్యాంగబద్ధత కల్పించారు.

నోట్‌: రాష్ట్రప్రభుత్వాలు నగరపాలక సంస్థలను ఏర్పాటు చేసి మొత్తం 18 అంశాల్లో అధికారాలు కల్పించారు.


76వ రాజ్యాంగ సవరణ చట్టం-1994

IXవ షెడ్యూల్‌ను సవరించారు.

1994, ఆగస్ట్‌ 31 నుంచి అమలులోకి వచ్చింది.

ముఖ్యాంశం: న్యాయసమీక్ష పరిధి నుంచి బయటపడటానికి తమిళనాడు ప్రభుత్వం కొన్ని తరగతులకు కల్పించిన రిజర్వేషన్‌ (విద్య, ఉద్యోగాల్లో రిజర్వేషన్లను 69 శాతం పెంచుతున్న) చట్టాన్ని IXవ షెడ్యూల్‌లో చేర్చారు.


77వ రాజ్యాంగ సవరణ చట్టం-1995

ఈ సవరణ ద్వారా 16వ క్లాజ్‌ ఆర్టికల్‌కు క్లాజ్‌ (4ఎ)ను చేర్చారు.

1995, జూన్‌ 17 నుంచి అమలులోకి వచ్చింది.

ముఖ్యాంశం: షెడ్యూల్డ్‌ కులాలు, తెగలకు ప్రమోషన్స్‌లో (ప్రభుత్వ ఉద్యోగాల) రిజర్వేషన్‌ కల్పించడం.


78వ రాజ్యాంగ సవరణ చట్టం-1995

ఈ సవరణ ద్వారా IXవ షెడ్యూల్‌ను సవరించారు.

1995, ఆగస్ట్‌ 30 నుంచి అమలులోకి వచ్చింది.

ముఖ్యాంశం: ఈ సవరణ ద్వారా బీహార్‌, కర్నాటక, కేరళ, ఒరిస్సా, రాజస్థాన్‌, తమిళనాడు, పశ్చిమబెంగాల్‌ రాష్ర్టాలకు సంబంధించి 27 భూసంస్కరణ చట్టాలను IXవ షెడ్యూల్‌లో చేర్చారు. దీంతో ప్రస్తుతం ఈ షెడ్యూల్‌లో చట్టాల సంఖ్య 284కు పెరిగింది. 


81వ రాజ్యాంగ సవరణ చట్టం- 2000

ఈ సవరణ ద్వారా 16వ ఆర్టికల్‌కు క్లాజ్‌ 4బి ని చేర్చారు.

2000, జూన్‌ 9 నుంచి అమలులోకి వచ్చింది.

ముఖ్యాంశం: 335 ఆర్టికల్‌లో పేర్కొన్న విధంగా ఎస్సీ, ఎస్టీలకు చెందిన రిజర్వేషన్ల కోటా ఆ ఏడాదిలో భర్తీకాకపోవచ్చు. అలా భర్తీకాని ఖాళీలు ఈ సవరణ ద్వారా తర్వాత ఏడాది గాని, ఆపై ఏడాదులకు సంబంధించిన రిజర్వేషన్ల కోటాలో కలపాలి. ఒక ఏడాదిలో రిజర్వేషన్ల శాతం 50 శాతం మించింది లేదా అన్న విషయాన్ని నిర్ధారించడంలో ఆ ఏడాది రిజర్వేషన్‌ కోటాలో కలిసి ఉన్న గతేడాది ఖాళీల సంఖ్యను పరిగణనలోకి తీసుకోరాదు.


83వ రాజ్యాంగ సవరణ చట్టం- 2000

ఈ సవరణ ద్వారా 243(ఎం) ఆర్టికల్‌ను సవరించారు.

2000, సెప్టెంబర్‌ 8 నుంచి అమలులోకి వచ్చింది.

ముఖ్యాంశం: అరుణాచల్‌ ప్రదేశ్‌లో పూర్తిగా గిరిజనులే నివసిస్తున్న కారణంగా అక్కడ ఎస్సీల కోసం పంచాయతీల్లో రిజర్వేషన్స్‌ కల్పించాల్సిన అవసరంలేదని ఈ సవరణ పేర్కొంటుంది.


85వ రాజ్యాంగ సవరణ చట్టం-2002

దీని ద్వారా 16(4ఎ) ఆర్టికల్‌ను సవరించారు.

2002, జనవరి 4 నుంచి అమలులోకి వచ్చింది.

ముఖ్యాంశం: ప్రభుత్వ ఉద్యోగాల్లో ఎస్సీ, ఎస్టీల పదోన్నతిలో ఏదైనా తరగతికి చెందిన ‘పదోన్నతి విషయాల్లో’ అనే పదాల స్థానంలో ‘పదోన్నతికి చెందిన విషయాల్లో ఏదైనా తరగతికి చెందిన పర్యవసాన (తత్ఫలిత) సీనియారిటీతో కూడిన’ అనే పదాలు చేర్చారు. పదోన్నతుల్లో రిజర్వేషన్లు కల్పించేందుకు ఈ సవరణ చేశారు.


86వ రాజ్యాంగ సవరణ చట్టం-2002

51(ఎ), 45 ఆర్టికల్స్‌ను సవరించారు.

21(ఎ) ఆర్టికల్‌ను నూతనంగా చేర్చారు.

2002, డిసెంబర్‌ 12 నుంచి అమలులోకి వచ్చింది.

ముఖ్యాంశం: 6-14 ఏండ్ల మధ్య వయస్సుగల పిల్లలందరికి విద్యాహక్కును ప్రాథమిక హక్కుగా చేసింది. అదేవిధంగా 45వ ఆర్టికల్‌లో ఆరేండ్లలోపు పూర్వ ప్రాథమిక విద్యాహక్కును చేర్చారు.


89వ రాజ్యాంగ సవరణ చట్టం- 2003

ఈ సవరణ ద్వారా 338(ఎ) ఆర్టికల్‌ను చేర్చారు.

2003, సెప్టెంబర్‌ 28 నుంచి అమలులోకి వచ్చింది.

ముఖ్యాంశం: ఈ సవరణ ద్వారా జాతీయ ఎస్సీ, ఎస్టీ కమిషన్లను రాజ్యాంగం ప్రకారం వేరుచేశారు. అంటే జాతీయ ఎస్సీ కమిషన్‌, జాతీయ ఎస్టీ కమిషన్‌లుగా ఏర్పాటు చేశారు.

338 ఆర్టికల్‌: జాతీయ ఎస్సీ కమిషన్‌ నిర్మాణం

338(ఎ) ఆర్టికల్‌: జాతీయ ఎస్టీ కమిషన్‌ నిర్మాణం


91వ రాజ్యాంగ సవరణ చట్టం- 2003

75, 164 ఆర్టికల్స్‌ను సవరించారు. 361(బి) ఆర్టికల్‌ను చేర్చారు.

Xవ షెడ్యూల్‌ను కూడా సవరించారు.

ముఖ్యాంశం: మంత్రివర్గంలోని మంత్రుల సంఖ్య చట్టసభలోని సభ్యుల సంఖ్యలో 15 శాతానికి పరిమితం చేసేందుకు ఉద్దేశించింది. చిన్న రాష్ర్టాల్లో ఈ సంఖ్య 12కు తగ్గరాదు.

75(1ఎ), 75(1బి), 164(1ఎ), 164(1బి) ఆర్టికల్స్‌ను చేర్చారు.

Xవ షెడ్యూల్‌ కింద సభ్యత్వం కోల్పోయినప్పుడు వారిని కేంద్రమంత్రిగా లేదా రాష్ట్రమంత్రిగా నియమించరాదు.


93వ రాజ్యాంగ సవరణ చట్టం-2005

ఈ సవరణ ద్వారా 15 ఆర్టికల్‌కు 5వ క్లాజ్‌ను చేర్చారు.

2006, జనవరి 20 నుంచి అమలులోకి వచ్చింది.

ముఖ్యాంశాలు: సామాజికంగా, విద్యాపరంగా వెనుకబడిన తరగతులవారు లేదా ఎస్సీ, ఎస్టీ వర్గాలు, ఓబీసీలకు ప్రభుత్వ, ప్రైవేట్‌ ఉన్నత విద్యాసంస్థల్లో రిజర్వేషన్స్‌ ప్రభుత్వం కల్పించవచ్చు.

నోట్‌: 30(1) ఆర్టికల్‌ ప్రకారం మైనారిటీ విద్యాసంస్థల్లో మాత్రం ఈ రిజర్వేషన్స్‌ వర్తించవు.

94వ రాజ్యాంగ సవరణ చట్టం- 2006

ఈ సవరణ ద్వారా ఆర్టికల్‌ 164(1)ను సవరించారు.

2006, జూన్‌ 12 నుంచి అమలులోకి వచ్చింది.

ముఖ్యాంశం: బీహార్‌ మంత్రిమండలిలో షెడ్యూల్డ్‌ తెగల సంక్షేమానికి ప్రత్యేక మంత్రిత్వ శాఖను ఏర్పాటు చేయడాన్ని తొలగిస్తూ దాని స్థానంలో జార్ఖండ్‌, ఛత్తీస్‌గఢ్‌, మధ్యప్రదేశ్‌, ఒరిస్సా రాష్ర్టాల గవర్నర్లు తప్పనిసరిగా ఆయా రాష్ర్టాల్లో గిరిజన మంత్రిత్వ శాఖల ఏర్పాటు చేయాలని సవరించారు.


96వ రాజ్యాంగ సవరణ చట్టం-2011

VIIIవ షెడ్యూల్‌ను సవరించారు.

2011, సెప్టెంబర్‌ 23 నుంచి అమలులోకి వచ్చింది.

ముఖ్యాంశం: VIIIవ షెడ్యూల్‌లో 15వ ఎంట్రీ అయిన ‘ఒరియా’ పదం స్థానంలో ‘ఒడియా’ అనే పదాన్ని చేర్చారు.

 

97వ రాజ్యాంగ సవరణ చట్టం-2011

ఈ సవరణ ద్వారా 19(సి) ఆర్టికల్‌ను సవరించారు. నూతనంగా చేర్చిన ప్రకరణలు 43 (బి), 243 (జడ్‌ హెచ్‌) 243 (జడ్‌ టీ) వరకు. రాజ్యాంగంలో 9 (బి) భాగాన్ని చేర్చారు.

సవరణ అమలు తేదీ- 2012 జనవరి 12

ముఖ్యాంశాలు

ఆర్టికల్‌ 19(సి)లో కో-ఆపరేటివ్‌ సొసైటీలు (సహకార సంఘాలు) అనే పదాన్ని చేర్చారు. దీని ద్వారా సహకార సంఘాలకు రాజ్యాంగబద్ధత కల్పించారు. 43 (బి) ఆర్టికల్‌ ప్రకారం సహకార సంఘాల ఏర్పాటు, వాటి అభివృద్ధికి ప్రభుత్వం కృషిచేయాలి.

9 (బి) భాగాన్ని రాజ్యాంగంలో చేరుస్తూ సహకార సంఘాల గురించి 243 (ZCH) నుంచి 243 (Z (T)) వరకు ఆర్టికల్స్‌ను చేర్చారు.

 

98వ రాజ్యాంగ సవరణ చట్టం-2012

ఈ సవరణ ద్వారా రాజ్యాంగంలో 371 (J) ఆర్టికల్‌ను చేర్చారు.

సవరణ అమలు తేదీ- 2013 జనవరి 1

ముఖ్యాంశాలు

కర్ణాటక రాష్ట్రంలోని 6 జిల్లాలకు సంబంధించి నూతనంగా ఆర్టికల్‌ 371 (J)ని చేర్చారు. హైదరాబాద్‌, కర్ణాటక ప్రాంతంలో నిజాం పాలనలో ఉండి తర్వాత కర్ణాటక రాష్ట్రంలో చేర్చిన జిల్లాలు ఆరు. అవి..

 గుల్బర్గా, బీదర్‌, రాయ్‌చూర్‌, కొప్పల్‌, యాద్గిర్‌, బళ్లారి

ఈ జిల్లాలకు సంబంధించి ప్రత్యేక నిబంధనలు ఈ ప్రకరణలో ఉన్నాయి. వీటికి ఒక ప్రత్యేక అభివృద్ధి బోర్డును ఏర్పాటు చేయడం, గవర్నర్‌కు ప్రత్యేక బాధ్యతలు, నిధుల కేటాయింపు, ప్రత్యేక విద్య, ఉద్యోగ అవకాశాల్లో రిజర్వేషన్లు వంటి అంశాలు ప్రకరణ 371 (J)లో ఉన్నాయి.

 

99వ రాజ్యాంగ సవరణ చట్టం-2014

ఈ సవరణ ద్వారా రాజ్యాంగంలో 3 ప్రకరణలు చేర్చారు. అవి.. 124(ఎ), 124 (బి),  124 (సి ). ఆర్టికల్స్‌ 124, 127, 128, 217, 222, 224(ఎ) 231లను సవరించారు.

సవరణ అమలు తేదీ- 2015 ఏప్రిల్‌ 13

ముఖ్యాంశాలు

సుప్రీంకోర్టు, హైకోర్టుల న్యాయమూర్తుల నియామకం, బదిలీలపై సిఫారసు చేసేందుకు జాతీయన్యాయ నియామకాల కమిషన్‌, దీనికి అనుగుణంగా న్యాయనియామకాల కమిషన్‌ ఏర్పాటయ్యాయి. వీటికి అనుగుణంగా నూతన ప్రకరణలు చేర్చారు. 

121వ రాజ్యాంగ సవరణ బిల్లు-2014ను లోక్‌సభ 2014 ఆగస్టు 13న, రాజ్యసభ 2014 ఆగస్టు 14న ఆమోదించాయి. 17 రాష్ర్టాలు, రాష్ట్రపతి ఆమోదించినది 2014 డిసెంబర్‌ 31న.

121వ రాజ్యాంగ సవరణ బిల్లు రాష్ట్రపతి ఆమోదంతో 99వ రాజ్యాంగ సవరణ చట్టం 2014లో  గెజిట్‌గా ప్రచరించారు.

సుప్రీంకోర్టు, హైకోర్టు న్యాయమూర్తులను కొలీజియం సిఫారసు మేరకు రాష్ట్రపతి నియమించడాన్ని తొలగిస్తూ జాతీయ న్యాయమూర్తుల నియామకాల కమిషన్‌ను తీసుకురావడడానికి 99వ రాజ్యాంగ సవరణ చట్టం-2014ను  చేశారు.

సుప్రీంకోర్టు అడ్వకేట్స్‌ రికార్డ్‌ అసోసియేషన్‌ Vs యూనియన్‌ ఆఫ్‌ ఇండియా (2015) కేసులో 99వ రాజ్యంగ సవరణ చట్టాన్ని కొట్టివేసింది.

నోట్‌: జస్టిస్‌ జేఎస్‌ ఖేహర్‌ నేతృత్వంలో సుప్రీంకోర్టు 5గురు జడ్జిల బెంచ్‌ (4:1) 2015 అక్టోబర్‌ 16న NJAC/99వ రాజ్యాంగ సవరణ చట్టం-2014ను కొట్టివేస్తూ జడ్జిమెంట్‌ ఇచ్చింది.

 

100 వ రాజ్యాంగ సవరణ చట్టం-2015

ఈ సవరణ ద్వారా భారత్‌, బంగ్లాదేశ్‌ మధ్య సరిహద్దులను సవరిస్తూ 1వ షెడ్యూల్‌ను సవరించారు.

సవరణ అమలు తేదీ- 2015 జూలై 31

ముఖ్యాంశాలు

అస్సాం రాష్ట్రంలోని భూభాగాన్ని బంగ్లాదేశ్‌కు, బంగ్లాదేశ్‌కు చెందిన కొంత భూభాగాన్ని భారతదేశానికి ఈ చట్టం ద్వారా బదిలీచేశారు.

ఈ చట్టం వల్ల భారతదేశం బంగ్లాదేశ్‌ నుంచి 7110 ఎకరాల ప్రాంతాన్ని (51 గ్రామాలు) పొందింది. బంగ్లాదేశ్‌ భారత్‌ నుంచి 17,160 ఎకరాలు (111 గ్రామాలు) పొందింది.

నోట్‌: భారత్‌-బంగ్లాదేశ్‌ ఒప్పందం- 1974 ప్రకారం ఇరుదేశాల మధ్య సరిహద్దుల మార్పుకోసం అంగీకారం కుదిరింది. దీనికి రాజ్యాంగ సవరణ అమలుకాలేదు.

100వ రాజ్యాంగ సవరణ చట్టం ద్వారా మొదటి షెడ్యూల్‌ను సవరించడంతో అమల్లోకి వచ్చింది.

నోట్‌: భారత్‌ తన పొరుగువారితో పంచుకునే అంతర్జాతీయ సరిహద్దుల్లో బంగ్లాదేశ్‌ సరిహద్దు అతిపెద్దది (మొత్తం 4096 కి.మీ).

ముఖ్యాంశాలు

 1. న్యాయమూర్తుల నియామకాల్లో ప్రభుత్వ జోక్యం న్యాయవ్యవస్థ స్వతంత్ర ప్రతిపత్తిని హరించివేస్తుంది.

 2. కార్యనిర్వాహకశాఖ నుంచి న్యాయవ్యవస్థను వేరుచేయాలని రాజ్యాంగం పేర్కొంటుంది.

 3. ‘న్యాయవ్యవస్థ స్వతంత్ర ప్రతిపత్తి’ అనేది  రాజ్యాంగ మౌలిక స్వరూపం.

 4. ‘జాతీయ న్యాయనియామకాల కమిషన్‌' నిర్మాణం విరుద్ధం.

 5. కొలీజియం రాజ్యాంగబద్ధమైనది. కొనసాగుతుంది.

నోట్‌: ప్రస్తుతం న్యాయమూర్తుల నియామకంలో కొలీజియం సిఫారసును రాష్ట్రపతి ఆమోదించాలి. రాష్ట్రపతి కొలీజియం సిఫారసును ఒకసారి పునఃపరిశీలనకు పంపవచ్చు. చివరికి కొలీజియం సిఫారసు మేరకే రాష్ట్రపతి సుప్రీంకోర్టు, హైకోర్టు న్యాయమూర్తులను నియమించాలి.

కొలీజియం

దీనిలో సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తితో పాటు నలుగురు సుప్రీంకోర్టు సీనియర్‌ జడ్జిలు ఉంటారు.

చైర్మన్‌- సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి   

జాతీయ న్యాయ నియామకాల కమిషన్‌

(ఎన్‌జీఏసీ)

సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి, ఇద్దరు సుప్రీంకోర్టు సీనియర్‌ జడ్జిలు, కేంద్ర న్యాయశాఖ మంత్రి, రాష్ట్రపతి నామినేట్‌  చేసిన ఇద్దరు న్యాయనిపుణులతో కలిసి మొత్తం 6గురు సభ్యులు ఉంటారు.

చైర్మన్‌- సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి

 

101 వ రాజ్యాంగ సవరణ చట్టం-2016

ఈ సవరణ ద్వారా భారత్‌ ఒకే దేశం, ఒకే పన్ను, ఒకే మార్కెట్‌గా మారింది. జీఎస్టీ అమలు కోసం ఈ సవరణ చేశారు.

ఈ సవరణ ద్వారా రాజ్యాంగంలో చేర్చిన ప్రకరణలు- 246(ఎ), 269(ఎ), 279(ఎ)

ఈ సవరణ 248, 249, 250, 268, 269, 270, 271, 286, 366, 368 ప్రకరణలను మార్పుచేసింది.

ఈ సవరణ ద్వారా VI & VII  షెడ్యూళ్లను సవరించింది.

VIIవ షెడ్యూల్‌లోని కేంద్ర, రాష్ట్ర జాబితాలో సవరణ చేశారు.

కేంద్రజాబితా- 84వ ఎంట్రీలో ఉన్న అంశాలను తొలగించి, కొత్త అంశాలను చేర్చారు. అదేవిధంగా ఈ జాబితాలోని 92, 92సి ఎంట్రీలను రద్దు చేశారు.

రాష్ట్ర జాబితా 52, 55 ఎంట్రీలు రద్దయ్యాయి.

54, 62 ఎంట్రీల్లో ఉన్న అంశాలను తొలగించి, కొత్త అంశాలను చేర్చారు.

ఈ సవరణ ద్వారా 268(ఎ) ఆర్టికల్‌ను తొలగించారు.

నోట్‌: సవరణ అమలు తేదీ 2017 జూలై 1. అయితే జీఎస్టీ 2012 సెప్టెంబర్‌ 1 నాటికే పూర్తిస్థాయిలో అమల్లోకి వచ్చింది.

కాంగ్రెస్‌ ప్రభుత్వ కాలం (మన్మోహన్‌సింగ్‌)లో పార్లమెంట్‌లో 115వ రాజ్యాంగ సవరణ బిల్లుగా ప్రవేశపెట్టారు (2011). కానీ లోక్‌సభ రద్దుకావడంతో వీగిపోయింది.  తరువాత మోదీ నేతృత్వంలో ఎన్డీయే ప్రభుత్వం జీఎస్టీకి సంబంధించి 122వ రాజ్యాంగ సవరణ బిల్లును 2014 డిసెంబర్‌ 19న లోక్‌సభలో ప్రవేశపెట్టారు. 2015 మే 6న లోక్‌సభ, 2016 ఆగస్టు 3న రాజ్యసభ ఆమోదించాయి.

2016 ఆగస్టు 12న అసోం రాష్ట్రం మొదటిసారిగా జీఎస్టీని ఆమోదించింది.

2016 సెప్టెంబర్‌ 8 నాటికి 20 రాష్ర్టాలు, కేంద్రపాలిత ప్రాంతాలు, అదే రోజున రాష్ట్రపతి ఆమోదం తెలిపారు.

122వ రాజ్యాంగ సవరణ బిల్లు 101వ రాజ్యాంగ సవరణ చట్టంగా మారింది.

నోట్‌: 246(ఎ) ఆర్టికల్‌- వస్తువులు, సేవలపై విధించే పన్నులకు సంబంధించిన ప్రత్యేక నిబంధనలు.

269(ఎ) ఆర్టికల్‌: అంతర్‌రాష్ట్ర వ్యాపార, వాణిజ్యాలకు సంబంధించి వస్తువులు, సేవలపై పన్ను విధింపు, పన్ను వసూలు గురించి తెలుపుతుంది.

279(ఎ) ఆర్టికల్‌- జీఎస్టీ మండలి.

 

102వ రాజ్యాంగ సవరణ చట్టం-2018

ఈ సవరణ ద్వారా జాతీయ బీసీ కమిషన్‌ను రాజ్యాంగబద్ధ సంస్థగా మార్చారు.

సవరణ అమలు తేదీ 2018 ఆగస్టు 11

123వ  రాజ్యాంగ సవరణ బిల్లుగా 2017 పార్లమెంటులో ప్రవేశపెట్టారు.

ఈ బిల్లును లోక్‌సభ 2018 ఆగస్టు 2న, రాజ్యసభ 2018 ఆగస్టు 8న ఆమోదించాయి.

ఈ రాజ్యాంగ సవరణ ద్వారా రాజ్యాంగంలో చేర్చిన ఆర్టికల్స్‌ 338(బి), 342(ఎ), 366(26).

338(బి) ఆర్టికల్‌- జాతీయ వెనుకబడిన తరగతుల కమిషన్‌ నిర్మాణం, అధికారాలు, విధుల గురించి తెలియజేస్తుంది.

342(ఎ) ఆర్టికల్‌- ఏదైనా ఒక తరగతిని సామాజికంగా, విద్యాపరంగా వెనుకబడినదిగా (SEBC) తెలియజేయడానికి రాష్ట్రపతికి ఉన్న శక్తి గురించి వివరిస్తుంది.

SEBC జాబితాను మార్చడానికి పార్లమెంటుకు మాత్రమే అధికారం ఉంది.

నోట్‌: ఏదైనా రాష్ట్రం ఒక వర్గాన్ని SEBC గా మార్చాలని భావిస్తే గవర్నర్‌ సిఫారసు మేరకు దానిని SEBCగా మార్చే అధికారం రాష్ట్రపతికి ఉంటుంది. 

366 (26): సామాజికంగా, విద్యాపరంగా వెనుకబడిన తరగతులను నిర్వచించడానికి, ఉపసంహరణల చట్టం కింద ప్రస్తుతం కొనసాగుతున్న NCBC చట్టాన్ని ఉపసంహరించుకుని వెనుకబడిన తరగతుల జాతీయ కమిషన్‌ ఏర్పాటవుతుంది. 

ఈ ఆర్టికల్‌ ప్రకారం SEBC జాబితా (OBC)ను కేంద్రం సవరిస్తుంది.

1993లో జాతీయ బీసీ కమిషన్‌ను చట్టబద్ధ సంస్థగా ఏర్పాటు చేశారు.

జాతీయ బీసీ కమిషన్‌ పేరును NESEBC (National Commission For Socially, Educationally Backword Clsasses)గా మార్చారు.

 

103వ రాజ్యాంగ సవరణ చట్టం

ఈ సవరణ ద్వారా 15(6), 16(6) ఆర్టికల్స్‌ను చేర్చారు.

ముఖ్యాంశాలు

అగ్రకులాల్లోని (రిజర్వ్‌ చేయని కేటగిరీ) ఆర్థికంగా బలహీనంగా ఉన్న వారికి ప్రభుత్వ ఉద్యోగాలు, విద్యాసంస్థల్లో 10 శాతం రిజర్వేషన్లు కల్పించవచ్చు.

ఆర్థిక వెనుకబాటుతనం ఆధారంగా రిజర్వేషన్లు కల్పించడానికి ఈ చట్టం ఆర్టికల్‌ 15, ఆర్టికల్‌ 16లకు క్లాజ్‌ 6ను చేర్చారు.

15(6) ఆర్టికల్‌: సమాజంలోని అగ్రకులాల్లోని ఆర్థికంగా బలహీనవర్గాలకు (EWS) ప్రభుత్వ, ప్రైవేటు ఉన్నత విద్యాసంస్థల్లో 10శాతం వరకు రిజర్వేషన్స్‌ కల్పించవచ్చు.

16(6) ఆర్టికల్‌: ప్రభుత్వ ఉద్యోగాల్లో ఈడబ్ల్యూఎస్‌ వర్గాలకు 10శాతం వరకు రిజర్వేషన్‌ కల్పించవచ్చు.

ఇందిరా సాహ్నీ కేసు-1992: సుప్రీంకోర్టు ఈ కేసులో SC, ST, BCలకు రిజర్వేషన్ల గురించి కింది విధంగా పేర్కొంది.

SC, ST, BC రిజర్వేషన్స్‌ కోటా 50 శాతానికి మించకూడదు.

ఆర్థిక వెనుకబాటుతనం ఆధారంగా రిజర్వేషన్స్‌ కల్పించరాదు.

అగ్రకులాలవారికి  (ఈబీసీ) రిజర్వేషన్స్‌ కల్పించడం రాజ్యాంగ విరుద్ధం.

అసాధారణ పరిస్థితుల్లో రిజర్వేషన్‌ కోటా 50 శాతం మించవచ్చు. 

సామాజిక, విద్యాపరంగా వెనుకబాటుతనం ఆధారంగానే రిజర్వేషన్‌ కల్పించాలి.

46వ ఆర్టికల్‌ ప్రకారం సమాజంలోని బలహీన వర్గాల విద్య, ఆర్థిక ప్రయోజనాలను ప్రోత్సహించాలని ప్రభుత్వాన్ని కోరుతుంది.

103వ రాజ్యాంగ సవరణ ప్రకారం ఈడబ్ల్యూఎస్‌ వర్గాలకు రిజర్వేషన్‌ కల్పించడానికి పరిమితులు

వార్షికాదాయం 8లక్షల కన్నా తక్కువ ఉండాలి.

5 ఎకరాల కంటే తక్కువ వ్యవసాయ భూమిని లేదా పట్టణంలో 1000 చదరపు అడుగుల కంటే తక్కువ ఇల్లు లేదా నోటిఫైడ్‌ మున్సిపల్‌ ప్రాంతాల్లో 100 చదరపు గజాలు ఉండాలి.

బీసీ కమిషన్‌ నిర్మాణం

  • ఒక చైర్‌పర్సన్‌- సుప్రీంకోర్టు లేదా హైకోర్టులో పనిచేస్తున్న న్యాయమూర్తిని చైర్‌పర్సన్‌గా నియమిస్తారు.
  • ముగ్గురు సభ్యులు ఉంటారు. వీరిలో వెనకబడిన వర్గాలపై పరిజ్ఞానం ఉండాలి (ఇద్దరు)
  • సభ్యుల్లో ఒకరు మహిళ ఉండాలి
  • ఒక మెంబర్‌ సెక్రటరి ఉంటారు
  • ఒక వైస్‌చైర్మన్‌ ఉంటారు.
  • కేంద్రప్రభుత్వం సూచన మేరకు రాష్ట్రపతి నియమిస్తారు.
  • ప్రస్తుతం NCSEBC చైర్మన్‌- భగవాన్‌లాల్‌ సాహ్ని
  • వైస్‌ చైర్మన్‌- డాక్టర్‌ లోకేష్‌కుమార్‌ ప్రజాపతి
  • సభ్యులు- కౌశలేంద్రసింగ్‌ పటేల్‌, సుధాయాదవ్‌(మహిళ సభ్యురాలు) ఆచార్య తల్లోజు (తెలంగాణ)
  • మెంబర్‌ సెక్రటరీ- ఆనంద్‌ కుమార్‌
 

104వ రాజ్యాంగ సవరణ చట్టం-2000

  • ఇది చట్టసభల్లో (లోక్‌సభ, రాజ్యసభ) ఎస్సీ, ఎస్టీల రిజర్వేషన్‌ కాలపరిమితిని మరో పదేండ్లపాటు కొనసాగడానికి/మరో పదేండ్లపాటు పెంచడానికి సవరణ చేశారు.
  • ఎస్సీ, ఎస్టీల రిజర్వేషన్‌ కాలపరితి 2020, జనవరి 25 నాటికి పూర్తికావాలి. అందుకే దీనిని 2030, జనవరి 25 వరకు (పదేండ్లు) పెంచడానికి 126వ రాజ్యాంగ సవరణ బిల్లును పార్లమెంట్‌లో ప్రవేశపెట్టారు. 
  • ఈ బిల్లును లోక్‌సభ 2019, డిసెంబర్‌ 10న, రాజ్యసభ డిసెంబర్‌ 12న ఆమోదించాయి. 
  • రాష్ట్రపతి 2020, జనవరి 21న ఆమోదించడంతో ఈ బిల్లు చట్టంగా మారింది. ఈ చట్టం అమలు తేదీ జనవరి 25.

ప్రాతినిథ్యం

  • గత 70 ఏండ్లుగా షెడ్యూల్డ్‌ కులాలు, తెగలు గణనీయ పురోగతి సాధించినప్పటికీ పైన పేర్కొన్న సీట్ల రిజర్వేషన్‌కు సంబంధించి నిబంధనలు చేయడంలో రాజ్యాంగ సభతో తూకం వేసిన కారణాలు ఇంకా ఉనికిలో లేవు. అందువల్ల రాజ్యాంగ నిర్మాతలు ఊహించినట్లుగా కలుపుకొని ఉన్న పాత్రను నిలుపుకోవాలనే ఉద్దేశంతో షెడ్యూల్డ్‌ కులాలు, తెగల సీట్ల రిజర్వేషన్లు మరో పదేండ్లపాటు కొనసాగించాలని ప్రతిపాదించారు.
  • ఈ సవరణ ఆంగ్లో-ఇండియన్‌ కమ్యూనిటీ కోసం కేటాయించిన రెండు లోక్‌సభ సీట్ల రిజర్వేషన్‌ వ్యవధిని పొడిగించదు. అందువల్ల ఈ సవరణ అమలు తేదీ నుంచి లోక్‌సభ, శాసనసభ (1 ఆంగ్లోఇండియన్‌ నామినేట్‌)ల్లో ఆంగ్లో ఇండియన్స్‌ను నామినేట్‌ చేసే విధానం రద్దయ్యింది.

 

రాజ్యాంగం-ఎస్సీ, ఎస్టీల రిజర్వేషన్స్‌ (చట్టసభలు)

  • 330వ ఆర్టికల్‌: లోక్‌సభలో ఎస్సీ, ఎస్టీ వర్గాలకు వారి జనాభా మేరకు కొన్ని స్థానాలు రిజర్వ్‌ చేస్తారు. ఈ ఏర్పాటు రాజ్యాంగంలో పదేండ్ల వరకే ఉండేది.
  • 331వ ఆర్టికల్‌: లోక్‌సభకు ఇద్దరు ఆంగ్లోఇండియన్స్‌ను రాష్ట్రపతి నామినేట్‌ చేస్తారు.
  • 332వ ఆర్టికల్‌: ప్రతి రాష్ట్ర శాసనసభలో వారి జనాభా ప్రకారం ఎస్సీ, ఎస్టీ వర్గాలకు కొన్ని స్థానాలు రిజర్వ్‌ చేస్తారు.
  • 333వ ఆర్టికల్‌: ప్రతి రాష్ట్ర శాసనసభకు ఒక ఆంగ్లో ఇండియన్‌ను ఆ రాష్ట్ర గవర్నర్‌ నామినేట్‌ చేస్తారు.
  • 334వ ఆర్టికల్‌: ఎస్సీ, ఎస్టీ, ఆంగ్లో ఇండియన్స్‌ రిజర్వేషన్స్‌ రాజ్యాంగం అమల్లోకి వచ్చిన తేదీ నుంచి పదేండ్లపాటు కొనసాగుతాయి.
  • నోట్‌: 334వ ఆర్టికల్‌ను ఇప్పటివరకు ఆరుసార్లు సవరించి పదేండ్ల చొప్పున 2020 వరకు పొడిగించారు. ప్రస్తుతం ఏడోసారి సవరించి (104వ సవరణ) మరో పదేండ్లపాటు (2030 జనవరి 25 వరకు) పొడిగించారు. 
  • ఈ సవరణ ఎస్సీ, ఎస్టీల రిజర్వేషన్‌ కాలపరిమితిని మాత్రమే పొడిగించినది. అంటే ఆంగ్లో ఇండియన్స్‌ ప్రాతినిథ్యాన్ని (331, 333 ఆర్టికల్స్‌) పూర్తిగా రద్దుచేశారు.

 

సవరణలు-గుర్తుంచుకునే పద్ధతి

  • రాజ్యాంగంలో ఒకే అంశానికి సంబంధించి అనేక సవరణలు చేశారు. వాటిని కింది విధంగా గుర్తుంచుకోవచ్చు.
  • ఎస్సీ, ఎస్టీ వర్గాలకు, ఆంగ్లో ఇండియన్లకు పార్లమెంట్‌, శాసనసభల్లో స్థానాల రిజర్వేషన్స్‌ కాలపరిమితి పొడిగింపునకు సంబంధించి కింది సవరణలు చేశారు.
  • 8వ రాజ్యాంగ సవరణ- 1960
  • 23వ రాజ్యాంగ సవరణ- 1969
  • 45వ రాజ్యాంగ సవరణ- 1980
  • 62వ రాజ్యాంగ సవరణ- 1989
  • 95వ రాజ్యాంగ సవరణ- 2009
  • 104వ రాజ్యాంగ సవరణ- 2020

 

రాజ్యాంగ సవరణలు (371 ఆర్టికల్‌) - ప్రత్యేక ప్రతిపత్తి రాష్ర్టాలు

  • 7వ రాజ్యాంగ సవరణ-1956 (371(1))- మహారాష్ట్ర, గుజరాత్‌
  • 13వ రాజ్యాంగ సవరణ-1962 (371(1ఎ))- నాగాలాండ్‌
  • 22వ రాజ్యాంగ సవరణ-1969 (371(1బి))- అస్సాం
  • 27వ రాజ్యాంగ సవరణ-1971 (371(1సి))- మణిపూర్‌
  • 32వ రాజ్యాంగ సవరణ-1973 (371(1డి), (1ఇ))- ఆంధ్ర, తెలంగాణ
  • 36వ రాజ్యాంగ సవరణ-1975 (371(1ఎఫ్‌))- సిక్కిం
  • 53వ రాజ్యాంగ సవరణ-1986 (371 (1జి))- మిజోరం
  • 55వ రాజ్యాంగ సవరణ-1987 (371(1హెచ్‌))- అరుణాచల్‌ప్రదేశ్‌
  • 56వ రాజ్యాంగ సవరణ-1987 (371(1ఐ))- గోవా
  • 97వ రాజ్యాంగ సవరణ-2011 (371(జె))- కర్ణాటక రాష్ట్రంలోని హైదరాబాద్‌-కర్ణాటక ప్రాంత ప్రత్యేక ప్రతిపత్తి

 

అధికార భాషలు సింధి, కొంకణి, మణిపురి, నేపాలీ, బోడో, డోగ్రీ, మైథిలి, సంతాలిలకు సంబంధించిన సవరణలు

  • 21వ రాజ్యాంగ సవరణ-1967
  • 71వ రాజ్యాంగ సవరణ-1992
  • 92వ రాజ్యాంగ సవరణ-2003
  • 15వ రాజ్యాంగ సవరణ: హైకోర్టు జడ్జిల పదవీవిరమణ వయస్సును 60-62కు పెంచడం.
  • 41వ రాజ్యాంగ సవరణ: రాష్ట్ర పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ సభ్యుల పదవీ విరమణ వయస్సు 60-62కు పెంచడం.
  • పంజాబ్‌లో రాష్ట్రపతి పాలన పొడిగింపు సవరణలు
  • 48వ రాజ్యాంగ సవరణ-1984
  • 59వ రాజ్యాంగ సవరణ-1988
  • 63వ రాజ్యాంగ సవరణ-1989
  • 64వ రాజ్యాంగ సవరణ-1990
  • 67వ రాజ్యాంగ సవరణ-1990
  • 68వ రాజ్యాంగ సవరణ-1991
  • భూ సంస్కరణల సవరణలు
  • 17వ రాజ్యాంగ సవరణ-1964
  • 25వ రాజ్యాంగ సవరణ-1971
  • 47వ రాజ్యాంగ సవరణ-1984
  • 66వ రాజ్యాంగ సవరణ-1990
  • 78వ రాజ్యాంగ సవరణ-1995
  • భూ సంస్కరణలకు సంబంధించిన అంశాలను 9వ షెడ్యూల్‌లోకి చేర్చడం. అలాగే నష్టపరిహారం అనే పదానికి బదులు కొంత మొత్తం అనే పదం చేర్చారు.

 

విదేశీ ప్రాంతాల విలీనం, స్థాపన (2వ ఆర్టికల్‌)

  • 9వ రాజ్యాంగ సవరణ-1960: బేరుబారి ప్రాంతాన్ని పాకిస్థాన్‌కు బదిలీ, పాక్‌ నుంచి కొన్ని గ్రామాలను కూచ్‌బీహార్‌ ఎన్‌క్లేవ్‌లో విలీనం.
  • 10వ రాజ్యాంగ సవరణ-1961: దాద్రానగర్‌ హవేలీని కేంద్రపాలిత ప్రాంతంగా భారత్‌లో విలీనం చేయడం
  • 12వ రాజ్యాంగ సవరణ-1962: గోవా, డామన్‌-డయ్యూలను భారత్‌లో విలీనం
  • 14వ రాజ్యాంగ సవరణ-1962: పాండిచ్చేరి భారత్‌లో విలీనం
  • 35వ రాజ్యాంగ సవరణ-1975: సిక్కింకు సహరాష్ట్ర హోదా కల్పిస్తూ భారత్‌లో విలీనం
  •  36వ రాజ్యాంగ సవరణ-1975: సిక్కింకు పూర్తి రాష్ట్ర హోదా
  • 100వ రాజ్యాంగ సవరణ-2015: భారత్‌-బంగ్లాదేశ్‌ సరిహద్దుల మార్పు. భారత్‌లోని 111 గ్రామాలు బంగ్లాదేశ్‌లో విలీనం, బంగ్లాదేశ్‌లోని 51 గ్రామాలు భారత్‌లో విలీనం.
  • పార్టీ ఫిరాయింపుల నిషేధ సవరణలు
  • 52వ రాజ్యాంగ సవరణ-1985, 91వ రాజ్యాంగ సవరణ-2003: రాజ్యాంగంలో పదో షెడ్యూల్‌లో చేర్చడం, 102(2), 191(2), 75(1బి), 164(1బి) ఆర్టికల్స్‌ చేర్చడం.
  • ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఈడబ్ల్యూఎస్‌ రిజర్వేషన్లు
  • 1వ రాజ్యాంగ సవరణ-1951: ఎస్సీ, ఎస్టీలకు విద్యాసంస్థల్లో రిజర్వేషన్‌ (15(4))
  • 77వ రాజ్యాంగ సవరణ-1995: ఎస్సీ, ఎస్టీలకు ప్రభుత్వ ఉద్యోగాల్లో ప్రమోషన్లో రిజర్వేషన్‌ (16(4ఎ))
  • 81వ రాజ్యాంగ సవరణ-2000: ఎస్సీ, ఎస్టీల బ్యాక్‌లాగ్‌ పోస్టుల భర్తీలో క్యారీఫార్వర్డ్‌ అమలుకు 50 శాతం రిజర్వేషన్‌ మినహాయింపు
  • 85వ రాజ్యాంగ సవరణ-2002: ఎస్సీ, ఎస్టీల ప్రభుత్వ ఉద్యోగాల ప్రమోషన్లలో సీనియారిటీ నిబంధన సడలింపు (16(4-ఎ))
  • 93వ రాజ్యాంగ సవరణ-2003: మైనారిటీయేతర ప్రైవేట్‌ ఉన్నత విద్యాసంస్థల్లో ఓబీసీలకు రిజర్వేషన్లు (15(5))
  • 103వ రాజ్యాంగ సవరణ-2019: అగ్రకులాల్లోని బలహీనవర్గాలకు (ఈడబ్ల్యూఎస్‌) విద్య, ప్రభుత్వ ఉద్యోగాల్లో 10 శాతం వరకు రిజర్వేషన్‌ (15(6), 16(6))