అంతర్జాతీయ మహిళా దినోత్సవం - మార్చి 8

 లక్ష్యం:

  • ఈ రోజున మహిళలంతా జెండర్‌‌ ఈక్వాలిటీ ప్రచారమే మహిళా దినోత్సవం లక్ష్యంగా చేసుకుని ప్రచారాన్ని కొనసాగిస్తుంటారు.
  • ప్రపంచ వ్యాప్తంగా మహిళలు అన్ని రంగాల్లో సత్తా చాటుతున్నారు. పురుషులతో సమానంగా రాణిస్తున్నారు. విద్యా, ఉద్యోగ, సామాజిక, రాజకీయ రంగాల్లో మహిళల ప్రాతినిధ్యం గణనీయంగా పెరుగుతోంది. ఆడవారి కష్టానికి గుర్తింపుగా మార్చి 8 న అంతర్జాతీయ మహిళా దినోత్సవం (International Women's Day) గా జరుపుకుంటారు.



ఎప్పటి నుంచి?

  • అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని జరుపుకోవాలని ఐక్యరాజ్య సమితి 1975 లో ప్రకటన చేసింది.
  • 1977 నుంచి ప్రతీ సంవత్సరం మార్చి 8 న అంతర్జాతీయ మహిళా దినోత్సవం (International Women's Day) ను జరుపుకుంటారు.

మార్చి 8 నే ఎందుకు?
మొదటి ప్రపంచ యుద్ధ సమయంలో, అంటే 1917  లో రష్యా మహిళలు ఆహారం-శాంతి  (Bread and Peace) అన్న నినాదాలతో పాటు తమకూ ఓటు హక్కు ఇవ్వాల్సిందేనని పట్టుబడుతూ నాలుగు రోజుల పాటు సమ్మె చేశారు. దానికి ఎంత మద్దతు వచ్చిందంటే, ఆ దెబ్బకు అప్పటి రష్యా చక్రవర్తి గద్దె దిగాల్సి వచ్చింది. తర్వాత ఏర్పడిన ప్రభుత్వం, మహిళల డిమాండ్లను నెరవేరుస్తూ ఓటు హక్కును కల్పించింది. ఈ సమ్మె ప్రారంభించిన రోజు అప్పటి రష్యా జూలియన్ క్యాలెండర్ ప్రకారం ఫిబ్రవరి 23. అంటే మనం వాడే గ్రెగోరియన్ క్యాలెండర్ ప్రకారం మార్చి 8. ఈ విజయానికి గుర్తుగా ఆ రోజునే అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని జరుపుకోవాలని ఐక్యరాజ్య సమితి 1975 లో ప్రకటన చేసింది.

చరిత్ర:
  • 1908: అమెరికా దేశంలోని న్యూయార్క్ నగరంలో ఉన్న బట్టల మిల్లుల్లో వేల సంఖ్యలో మహిళా కార్మికులు పనిచేసేవాళ్లు. వారికోసం పనిచేసేచోట కనీస సౌకర్యాలు, నిర్దిష్టమైన పనిగంటలూ లేవు, పైగా వేతనాల్లో విపరీతమైన వ్యత్యాసం. 15 వేల మందికి పైగా మహిళలు తక్కువ పనిగంటలు, సరైన వేతనాలతో పాటు తమకూ ఓటు హక్కు కల్పించాలంటు రోడ్డెక్కారు. ఆ మార్చ్ కు అప్పట్లో మంచి స్పందన వచ్చింది.
  • 1909: ఈ మహిళల డిమాండ్లను దృష్టిలో పెట్టుకుని  అక్కడి సోషలిస్టు పార్టీ ఫిబ్రవరి 28 ను జాతీయ మహిళా దినోత్సవంగా ప్రకటించింది.
  • 1910: ఆగస్ట్ లో కోపెన్‌హాగన్‌లో రెండవ అంతర్జాతీయ మహిళా ఉద్యోగినుల సమావేశం (Second International Conference of Working Women) జరిగింది. ఈ సదస్సుకు 17 దేశాలకు చెందిన 100 మంది మహిళా ప్రతినిధులు హాజరయ్యారు. జర్మనీకి చెందిన అప్పటి మహిళా హక్కుల ఉద్యమకారిణి క్లారా జెట్కిన్ (Clara Zetkin) మహిళా దినోత్సవాన్ని ప్రపంచ వ్యాప్తంగా జరుపుకోవాలన్న తన ఆలోచనను అక్కడ ప్రతిపాదించారు.
  • 1911: మార్చి 19 న అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని తొలిసారిగా ఆస్ట్రియా, డెన్మార్క్, జర్మనీ, స్విట్జర్లాండ్‌ దేశాల్లో నిర్వహించారు.  స్త్రీలకు చట్టసభల్లో చోటు, ఉద్యోగాల్లో వివక్షను నిర్మూలించడం, అన్ని రంగాల్లో సమానావకాశాలతో పాటు ఓటు హక్కు కల్పించాలంటూ నినదించారు.
  • 1914: మన దేశంలో అనసూయా సారాభాయ్ నేతృత్వంలో మహిళా కార్మికుల హక్కుల కోసం పోరాటాలు ప్రారంభమయ్యాయి. అహ్మదాబాద్ లో ఈమె టెక్స్‌టైల్‌ లేబర్‌ అసోసియేషన్‌ అనే పేరుతో కార్మిక సంఘం ప్రారంభించింది.
  • అయితే, ఈ ఉద్యమాలకు బలమైన పునాది పడింది మాత్రం రష్యాలోనే.
  • 1917: మొదటి ప్రపంచ యుద్ధ సమయంలో, అంటే  1917 లో రష్యా మహిళలు ఆహారం-శాంతి  (Bread and Peace) అన్న నినాదాలతో పాటు తమకూ ఓటు హక్కు ఇవ్వాల్సిందేనని పట్టుబడుతూ నాలుగు రోజుల పాటు సమ్మె చేశారు. దానికి ఎంత మద్దతు వచ్చిందంటే, ఆ దెబ్బకు అప్పటి రష్యా చక్రవర్తి గద్దె దిగాల్సి వచ్చింది. తర్వాత ఏర్పడిన ప్రభుత్వం, మహిళల డిమాండ్లను నెరవేరుస్తూ ఓటు హక్కును కల్పించింది. ఈ సమ్మె ప్రారంభించిన రోజు అప్పటి రష్యా జూలియన్ క్యాలెండర్ ప్రకారం ఫిబ్రవరి 23. అంటే మనం వాడే గ్రెగోరియన్ క్యాలెండర్ ప్రకారం మార్చి 8.
  • 1975: ఈ విజయానికి గుర్తుగా ఆ రోజునే అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని జరుపుకోవాలని ఐక్యరాజ్య సమితి ప్రకటన చేసింది.

థీమ్ (Theme):
  • 2020: నాది సమానత్వాన్ని కోరుకునే తరం: మహిళల హక్కులు తెల్సుకుంటాం (I am Generation Equality: Realizing Women’s Rights)
  • 2019: Think Equal, Build Smart, Innovate for Change
  • 1996: గతమును గుర్తించుట, భవిష్యత్తుకు ప్రణాళిక రచించుట (Celebrating the Past, Planning for the Future)

మరికొన్ని అంశాలు:
  • ఐక్యరాజ్య సమితి 1975 వ సంవత్సరాన్ని అంతర్జాతీయ మహిళా సంవత్సరం (International Women's Year) గా ప్రకటించింది.
  • మహిళలకు ఓటు హక్కు కల్పించిన తొలి దేశం న్యూజిలాండ్. ఈ దేశం 1893 లో మహిళలకు ఈ అధికారం కల్పించింది.
  • ప్రపంచంలో అన్ని దేశాలకంటే ఆలస్యంగా మహిళలకు ఓటు హక్కు కల్పించిన దేశం సౌదీ అరేబియా. 2015 లో మహిళలకు ఈ అధికారం లభించింది.
  • ప్రపంచవ్యాప్తంగా పురుషుల కంటే మహిళలు 23% తక్కువ సంపాదిస్తారు.
  • ప్రపంచవ్యాప్తంగా పార్లమెంటరీ స్థానాల్లో మహిళలు 24% మాత్రమే ఉన్నారు.