ఇందులో మొదట ఒక ప్రకటన, దాని కింద రెండు ఊహలు ఇస్తారు. ఆ ఊహల ఆధారంగా అభ్యర్థులు సరైన సమాధానాన్ని గుర్తించాల్సి ఉంటుంది. మొదటగా ఇచ్చిన ప్రకటనను అర్థం చేసుకుని, ప్రకటనలో ప్రస్తావించిన విషయాన్ని జాగ్రత్తగా పరిశీలించి జవాబు గుర్తించాలి. ఈ విధానం అభ్యర్థి ఆలోచనా సరళిపై ఆధారపడి ఉంటుంది. మన నిత్య జీవితంలో జరిగే సాంఘిక, ఆర్థిక, రాజకీయ, సామాజిక సంఘటనల ఆధారంగా ఈ ప్రశ్నలను రూపొందిస్తారు.
ఈ విభాగంలో ప్రకటనను, మొదటి ఊహ మాత్రమే సంతృప్తిపరిస్తే సమాధానం
(1)గా, రెండో ఊహ మాత్రమే సంతృప్తిపరిస్తే సమాధానం
(2)గా, రెండూ సంతృప్తిపరిస్తే సమాధానం
(3)గా, రెండూ సంతృప్తిపరచకపోతే సమాధానం
(4)గా గుర్తించాలి. అయితే కొన్నిసార్లు ఛాయిస్‌లను
మార్చవచ్చు. ప్రశ్నపత్రంలో ఇచ్చినదానికి అనుగుణంగా అభ్యర్థులు జవాబులను
గుర్తించాల్సి ఉంటుంది.
1. ప్రకటన: ఆత్మవిశ్వాసం అనేది విజయానికి మూలస్తంభం లాంటిది.
ఊహలు:
1) విజయానికి ఆత్మవిశ్వాసం తప్ప ఇంకేమీ అవసరం లేదు.
2) ఆత్మవిశ్వాసం ఉన్న వ్యక్తి సొంతంగా నిర్ణయాలు తీసుకుంటాడు.
సమాధానం: (4)
వివరణ: ప్రకటనను 1, 2 (రెండూ) ఊహలు సంతృప్తిపరచలేవు.
ఎందుకంటే విజయానికి ఆత్మవిశ్వాసం తప్ప ఇంకేమీ అవసరం లేదనేది తప్పుభావన.
ఆత్మవిశ్వాసం ఉన్న వ్యక్తులందరూ సొంత నిర్ణయాలు తీసుకుంటారనేది తప్పు.
కొందరు తీసుకోవచ్చు. మరికొందరు తీసుకోకపోవచ్చు. కాబట్టి సరైన సమాధానం-4
అవుతుంది.
2. ప్రకటన: దేశంలోని 18 సంవత్సరాల వయసు పైబడిన నిరుద్యోగులందరికీ నిరుద్యోగ భృతి ఇవ్వాలి.
ఊహలు:
1) భారతదేశంలోని చాలామంది నిరుద్యోగులు పేదవారే. వారికి ఆర్థిక సహాయం చేయాల్సిన అవసరం ఉంది.
2) నిరుద్యోగ యువతకు ఖర్చు పెట్టడానికి ప్రభుత్వం దగ్గర సరిపోయేంత నిధులు ఉన్నాయి.
సమాధానం: (1)
వివరణ: ఇచ్చిన ప్రకటనను మొదటి ఊహ మాత్రమే
సంతృప్తిపరుస్తుంది. నిరుద్యోగులకు నిరుద్యోగ భృతి ఇవ్వడం వల్ల వారిని
కొంతవరకు ఆదుకున్నట్లు అవుతుంది. ప్రభుత్వం దగ్గర నిధులున్నాయనే ఊహ ఇచ్చిన
ప్రకటనను సంతృప్తిపరచడం లేదు. కాబట్టి సరైన సమాధానం-1 అవుతుంది.
3. ప్రకటన: ప్రభుత్వం ఇంధనం ధర పెంచినప్పటికీ ప్రైవేటు టాక్సీలవారు మీటరు రేటు పెంచలేదు.
ఊహలు:
1) ప్రైవేటు టాక్సీల మీటరు రేటు ఇంధనం రేటుపై ఆధారపడి ఉంటుంది.
2) ప్రైవేటు టాక్సీల మీటరు ధర పెంచడం ప్రభుత్వం చేతుల్లో ఉంటుంది.
సమాధానం: (3)
వివరణ: ఇచ్చిన ప్రకటనను, రెండు ఊహలు సంతృప్తిపరుస్తాయి.
ఎందుకంటే ప్రైవేటు టాక్సీ మీటరు రేటు దానికి అవసరమయ్యే ఇంధనం రేటుపై
ఆధారపడి ఉంటుంది. టాక్సీ మీటరు రేటుపై ప్రభుత్వం నిర్ణయం తీసుకోవాలి.
టాక్సీవారు సొంతంగా పెంచుకోకూడదు. కాబట్టి సరైన సమాధానం-3 అవుతుంది.
4. ప్రకటన: చాలావరకు చిన్నతరహా పరిశ్రమలన్నీ వాటి ఉత్పత్తులను విదేశాలకు ఎగుమతి చేయడానికి ప్రయత్నిస్తున్నాయి.
ఊహలు:
1) ఎగుమతి వ్యాపారం చాలా లాభదాయకంగా ఉంటుంది.
2) వాటి ఉత్పత్తులకు భారతదేశంలో అంతగా మార్కెట్ లేదు.
సమాధానం: (1)
వివరణ: ఇచ్చిన ప్రకటనను మొదటి ఊహ మాత్రమే
సంతృప్తిపరుస్తుంది. ఎందుకంటే ఈ మధ్యకాలంలో ఎగుమతి వ్యాపారం లాభదాయకంగా
ఉండటం వల్ల చిన్నతరహా పరిశ్రమలన్నీ ఎగుమతిపైనే దృష్టి సారిస్తున్నాయి.
భారతదేశంలో వాటి ఉత్పత్తులకు అంతగా మార్కెట్ లేకపోవడమన్నది అసత్యం. కాబట్టి
సరైన సమాధానం-1 అవుతుంది.
5. ప్రకటన: రాత్రివేళల్లో మనం చెట్ల కింద నిద్రించకూడదు.
ఊహలు:
1) చెట్ల నుంచి రాలే ఆకులు మన దుస్తులను పాడుచేస్తాయి.
2) రాత్రివేళలో చెట్లు దివీ2ను విడుదల చేయడం వల్ల అది మన ఆరోగ్యానికి హానికరం.
సమాధానం: (2)
వివరణ: ఇచ్చిన ప్రకటనను రెండో ఊహ మాత్రమే
సంతృప్తిపరుస్తుంది. ఎందుకంటే రాత్రివేళలో చెట్లు CO2ను విడుదల చేయడం వల్ల
చెట్ల కింద నిద్రించడం ఆరోగ్యానికి హానికరం. చెట్ల నుంచి రాలే ఆకులు మన
దుస్తులను పాడు చేస్తాయి అన్నది అసత్యం. కాబట్టి సరైన సమాధానం-2 అవుతుంది.
6. ప్రకటన: ఒక కార్యాలయం నోటీస్ బోర్డులో కిందివిధంగా రాశారు. మధ్యాహ్నం 1.30 కల్లా మధ్యాహ్న భోజనం చేయాలి.
ఊహలు:
1) కార్యాలయంలో ఆ సూచనను అనుసరించకపోవడం.
2) కార్యాలయంలో వ్యక్తులు ఆ సూచనను చదివి అర్థం చేసుకుంటారని.
సమాధానం: (3)
వివరణ: ఇచ్చిన ప్రకటనలోని సూచనను రెండు ఊహలు
సంతృప్తిపరుస్తాయి. ఎందుకంటే కార్యాలయంలో వ్యక్తులు మధ్యాహ్న భోజనం 1.30
కల్లా పూర్తిచేయకపోవడం వల్ల, ఆ సూచనను చదివి, అర్థం చేసుకుని అనుసరిస్తారని
కాబట్టి సరైన సమాధానం-3 అవుతుంది.
7. ప్రకటన: మానవుడు పుట్టుకతోనే స్వేచ్ఛాజీవి.
ఊహలు:
1) స్వేచ్ఛ అనేది మానవుడి జన్మహక్కు.
2) ప్రతి మానవుడికి మానవ హక్కులుంటాయి.
సమాధానం: (1)
వివరణ: ఇచ్చిన ప్రకటనను మొదటి ఊహ మాత్రమే సంతృప్తిపరుస్తుంది. రెండో ఊహ ఇచ్చిన ప్రకటనకు సంబంధించింది కాదు. కాబట్టి సరైన సమాధానం-1.
8. ప్రకటన: ఈ రోజుల్లో అయిదుగురు ఆడపిల్లలున్న తండ్రి జీవితం నరకం లాంటిది.
ఊహలు:
1) ఆడపిల్లలను పెంచడం కష్టం.
2) ఆడప్లిలలకు వివాహాలు చేయడం చాలా ఖర్చుతో కూడిన పని.
సమాధానం: (3)
వివరణ: ఇచ్చిన ప్రకటనను రెండు ఊహలూ సంతృప్తి పరుస్తాయి.
ఎందుకంటే ఈ రోజుల్లో అయిదుగురు ఆడపిల్లలను పెంచడం కష్టం, వారి వివాహాలు
చాలా ఖర్చుతో కూడుకున్నవి. కాబట్టి సరైన సమాధానం-3 అవుతుంది.
9. ప్రకటన: చాలామంది ఉదయం లేవగానే దినపత్రిక చదువుతారు.
ఊహలు:
1) ప్రజలకు సాయంకాల సమయంలో పత్రిక చదివేందుకు సమయం ఉండదు.
2) ప్రజలు ప్రపంచంలో కొత్తగా ఏం జరుగుతున్నాయో తెలుసుకోవాలన్న ఉత్సాహంతో పత్రిక చూస్తారు.
సమాధానం: (2)
వివరణ: ఇచ్చిన ప్రకటనను రెండో ఊహ మాత్రమే
సంతృప్తిపరుస్తుంది. ఎందుకంటే ప్రపంచంలో కొత్తగా ఏం జరుగుతున్నాయో
తెలుసుకోవాలన్న ఉత్సాహంతో ప్రజలు పత్రిక చూస్తారు. వారికి సాయంకాల సమ యంలో
పత్రిక చదివేందుకు సమయం ఉండదు అనేది అసత్యం. కాబట్టి సరైన సమాధానం-2
అవుతుంది.
10. ప్రకటన: పిల్లలు ఐస్‌క్రీమ్‌లంటే చాలా ఇష్టపడతారు.
ఊహలు:
1) ఐస్‌క్రీమ్‌లన్నీ చాలా రుచికరంగా ఉంటాయి.
2) ఐస్‌క్రీమ్‌లన్నీ పాలతో తయారు చేస్తారు.
సమాధానం: (4)
వివరణ: ఇచ్చిన ప్రకటనను రెండు ఊహలు కూడా
సంతృప్తిపరచవు.ఎందుకంటే ఐస్‌క్రీమ్‌లన్నీ రుచికరంగా ఉంటాయని చెప్పడం కష్టం.
ఐస్‌క్రీమ్‌లన్నీ పాలతో తయారుచేసినంత మాత్రాన పిల్లలు ఇష్టపడతారని కూడా
చెప్పలేం. కాబట్టి సరైన సమాధానం-4 అవుతుంది.
11. ప్రకటన: ఒక కార్యాలయం నోటీస్ బోర్డులో కిందివిధంగా ఉంది.
''ఉద్యోగులందరూ సకాలంలో కార్యాలయానికి వచ్చి యాజమాన్యానికి సహకరించగలరు''
ఊహలు:
1) ఉద్యోగులు కార్యాలయానికి ఆలస్యంగా వస్తున్నారు.
2) ఉద్యోగులు ఈ నోటీస్ చూసి సకాలంలో రాగలరు.
సమాధానం: (3)
వివరణ: ఇచ్చిన ప్రకటనను రెండు ఊహలూ సంతృప్తిపరుస్తాయి.
ఎందుకంటే ఉద్యోగులందరూ కార్యాలయానికి ఆలస్యంగా వస్తున్నారు. దాంతో
యాజమాన్యం నోటీస్ బోర్డులో ప్రకటన పెట్టింది. అది చూసి ఉద్యోగులు సకాలంలో
కార్యాలయానికి హాజరవుతారు. కాబట్టి సరైన సమాధానం-3.
12. ప్రకటన: కార్యక్రమానికి అధిక డిమాండు ఉండటం వల్ల ఒక్కొక్కరికి 5 టిక్కెట్లు మాత్రమే ఇస్తున్నారు.
ఊహలు:
1) నిర్వాహకులు టిక్కెట్లు ఇవ్వడంలో పరిమితి పాటించడం లేదు.
2) 5 టిక్కెట్ల కంటే ఎక్కువ తీసుకోవడానికి ఎవరూ ఇష్టపడటం లేదు.
సమాధానం: (1)
వివరణ: ఇచ్చిన ప్రకటనను మొదటి ఊహ మాత్రమే
సంతృప్తిపరుస్తుంది. ఎందుకంటే నిర్వాహకులు టిక్కెట్లు ఇవ్వడంలో పరిమితి
పాటించకపోవడంతో కార్యక్రమానికి డిమాండు పెరిగింది. ఈ కారణంగా ఒక్కొక్కరికి 5
టిక్కెట్లకు మాత్రమే పరిమితి ఇచ్చారు. 5 టిక్కెట్ల కంటే ఎక్కువ
తీసుకోవడానికి ఎవరూ ఇష్టపడటంలేదు అన్నది అసత్యం. కాబట్టి సమాధానం-1
అవుతుంది.