వాతావరణ మార్పులపై చట్టానికి కట్టుబడి చేసుకున్న అంతర్జాతీయ ఒప్పందమే పారిస్ ఒప్పందం. పారిశ్రామికీకరణకు ముందున్న భూమి ఉపరితల ఉష్ణోగ్రతలు మరింత పెరగకుండా చూడాలని ఐక్యరాజ్యసమితి శీతోష్ణస్థితి మార్పు ఒప్పందం (యునైటైడ్ నేషనల్ ఫ్రేమ్ వర్క్ కన్వెన్షన్ ఆన్ ైక్లెమైట్ చేంజ్, UNFCCC)ను సభ్యదేశాలు నిర్ణయించాయి. 2015, డిసెంబర్ 12న పారిస్‌లో జరిగిన కాప్-21 సదస్సులో 196 సభ్యదేశాలు దీన్ని ఆమోదించాయి. 2016 నవంబర్ 4న ఇది అమల్లోకి వచ్చింది. ఈ ఒప్పందం లక్ష్యం విశ్వతాపాన్ని (గ్లోబల్ వార్మింగ్) పరిశ్రమపూర్వ స్థితికంటే 2 డిగ్రీల సెంటీగ్రేడ్‌లోపు తగ్గించాలని, ఇంకా వీలైతే 1.5 డిగ్రీల సెల్సియస్‌కు పరిమితం చేయాలని. ఈ దీర్ఘకాల ఉష్ణోగ్రత లక్ష్యాన్ని సాధించడానికి సాధ్యమైనంత నష్టకారక ఉద్గారాలను నియంత్రిస్తే ఈ శతాబ్ద్దం మధ్యనాటికి తటస్థ వాతావరణంవైపు పయనించవచ్చని సభ్య దేశాలన్నీ నిర్ణయించాయి. అభివృద్ధి చెందిన, చెందుతున్న దేశాలు తాము తగ్గించనున్న ఉద్గారాలపై స్పష్టతతో పాటు అవలంబించే మార్గాలను ప్రకటించుకున్నాయి.
వాతావరణ మార్పు ప్రక్రియలో పారిస్ ఒప్పందం చరిత్రాత్మకమైనది. ప్రపంచ దేశాలన్నీ ఒకే తాటిపైకి వచ్చి వాతావరణ మార్పుపై పోరాటానికి, దాని ఫలితాలకు సిద్ధమవడానికి ఉమ్మడి ప్రయోజనం లక్ష్యంగా కట్టుబాటును నిర్దేశించుకునేలా ఒప్పందం చేసుకున్నాయి. ఇందులోంచి వైదొలగాలనుకునే దేశం మూడేండ్లు ముందుగా నోటీసు ఇవ్వాలి. నోటీసు కాలం తర్వాత మరో ఏడాది గడిచాక ఒప్పందం నుంచి వైదొలిగినట్లు అవుతుంది.
దీర్ఘకాలిక వ్యూహాలు
దీర్ఘకాల లక్ష్యాల సాధన కోసం చేయాల్సిన కృషికోసం నిర్దిష్టమైన చట్రాన్ని రూపొందించే క్రమంలో వివిధ దేశాలు తాము చేపట్టబోయే ఉద్గారాల తగ్గింపు వ్యూహాలను 2020 నాటికి సమర్పించాలని పారిస్ ఒప్పందం సూచించింది. ఈ ఉద్గారాల తగ్గింపు వ్యూహాలు జాతీయ నిర్ణాయక పాత్రకు దీర్ఘకాల అవకాశాలు కల్పిస్తాయి. జాతీయ నిర్ణాయక పాత్రను ఆ దేశాల దీర్ఘకాల ప్రణాళికలో అభివృద్ధి ప్రాధ్యమాల్లో సందర్భోచితంగా భాగం చేసి, దిశానిర్దేశం చేస్తాయి.
పురోగతి కోసం అంతర్జాతీయ సమీక్ష
పారిస్ ఒప్పందంతో దేశాలు మెరుగైన పారదర్శక చట్రాన్ని ఏర్పరుచుకున్నాయి. ఈ చట్రం కింద 2024 మొదలుకొని ఆయా దేశాలు వాతావరణ మార్పు నియంత్రణ దిశలో సాధించిన పురోగతిని, అనుసరించిన విధానాలను, అందించిన, అందుకున్న సహాయాన్ని పారదర్శకంగా నివేదిస్తాయి. ఈ నివేదికలను సమీక్షించడానికి అంతర్జాతీయ విధానాలకు కూడా అవకాశమిస్తాయి. సేకరించిన సమాచారాన్ని అంతర్జాతీయంగా పరిశీలించి దీర్ఘకాల వాతావరణ లక్ష్యాల దిశలో జరుగుతున్న ఉమ్మడి కృషిని అంచనా వేస్తారు. దేశాలు మరింత ఆశావహ ప్రణాళికలు రూపొందించుకునేలా సిఫారసులు చేయడానికి ఇది ఉపయోగపడుతుంది.
సాధించిన అంశాలు
వాతావరణ మార్పు చర్యలు బాగా పెంచాల్సి ఉన్నప్పటికీ, ఇది అమల్లోకి వచ్చిన ఆరంభంలోనే తక్కువ కర్బనం విడుదల చేసే పరిష్కారమార్గాలు మార్కెట్లోకి వచ్చేశాయి. మరిన్ని దేశాలు, ప్రాంతాలు, నగరాలు, కంపెనీలు కార్బన్ తటస్థ లక్ష్యాలను చేరుతున్నాయి. అయితే సంపూర్ణ కర్బన రహిత పరిష్కార మార్గాలు దాదాపు 25 శాతం ఉద్గారాలకు దారితీసే వివిధ ఆర్థిక రంగాల్లో పోటాపోటీగా అందుబాటులోకి వస్తున్నాయి. ఈ ధోరణి ప్రధానంగా విద్యుత్, రవాణా రంగాల్లో ఎక్కువగా కనిపిస్తూ ముందుగా వచ్చినవారికి అనేక వ్యాపార అవకాశాలు కల్పించింది. ప్రపంచ వ్యాప్తంగా ఉద్గారాలకు కారణమవుతున్న 70 శాతం రంగాల్లో 2030 నాటికి సున్నా కర్బన విడుదల సాధ్యం కానుంది.
పారిస్ ఒప్పందం భారత్
- శీతోష్ణస్థితి మార్పు ద్వారా ఎక్కువగా ప్రభావితమవుతున్న దేశం భారత్. దీంతో భారత్ కూడా ఉద్గారాల నియంత్రణకు కట్టుబడి ఉండాలని నిర్ణయించింది. ఈ క్రమంలో పారిస్ ఒప్పందంపై 2016 అక్టోబర్ 2న సంతకం చేసింది. అమెరికా భారత్‌ను విమర్శిస్తూ పారిస్ ఒప్పందాన్ని వ్యతిరేకించడం హాస్యాస్పదం.
- 2015 అక్టోబర్ 2న భారత్ ఉద్గారాల తగ్గింపు ప్రణాళిక ప్రకటన. 2005 నాటి ఉద్గారాల్లో 33-35శాతం ఉద్గారాలను 2030 నాటికి తగ్గించాలని నిర్ణయించుకుంది.
- 2030 నాటికి 2.5-3 బిలియన్ టన్నుల కార్బన్ డై ఆక్సైడ్ సమాన ఉద్గారాలను తగ్గించే వీలుగా అటవీ చట్టాన్ని విస్తరించనున్నట్లు ప్రకటించింది భారత్.
- ఉద్గారాల తగ్గింపునకు దేశంలో సౌరశక్తి విస్తరణ, ఉత్పాదకత, శక్తిసామర్థ్యం పెంపు, సమర్థవంతమైన వ్యర్థవినియోగం, కాలుష్యరహిత రవాణా వ్యవస్థ లాంటి చర్యలు తీసుకోనుంది.
శీతోష్ణస్థితి మార్పు
మానవశక్తి వినియోగ చర్యల ద్వారా ‘కార్బన్ డై ఆక్సైడ్' అధిక మోతాదులో విడుదలై భూతాపానికి కారణమవుతుంది. భూమిపైకి చేరుతున్న సౌరపుటంలో అత్యధికం తిరిగి రోదసీలోకి పరావర్తనం చెందుతుంది. కార్బన్ డై ఆక్సైడ్ లాంటి వాయువులు ఈ సౌరశక్తిని కొద్దిగా గ్రహించి దీన్ని ఉష్ణంగా వాతావరణంలోకి విడుదల చేస్తున్నాయి. దీంతో కార్బన్ డై ఆక్సైడ్ వంటి వాయువులు భూమిపై వేడి పెరగడానికి కారణమవుతున్నాయి. 1750కు పూర్వం 6.5 లక్షల ఏండ్ల పాటు కార్బన్ డై ఆక్సైడ్ 120 ppm (Parts Per Million) మోతాదులో పెరిగింది. ఆ తర్వాత 2012 వరకు 262 ఏండ్లలో అత్యల్ప సమయంలో అదే మోతాదులో కార్బన్ డై ఆక్సైడ్ పెరగడం ద్వారా భూమి ఉపరితల ఉష్ణోగ్రతలు పెరిగి భూతాపం సంభవించింది.
కార్బన్ డై ఆక్సైడ్‌తో పాటు అనేక ఇతర ఉద్గారాలు (మీథేన్, నైట్రస్, హైడ్రో ఫ్లోరో కార్బన్) భూతాపానికి, దీంతో శీతోష్ణస్థితి మార్పుకు కారణమవుతున్నట్లు గుర్తించారు. ఇవన్నీ కూడా హరితవాయువు తెరలాగా సౌరశక్తిని గ్రహించి, తిరిగి దాని పరావర్తనాన్ని అడ్డుకుంటాయి. కాబట్టి వీటిని హరితవాయువు ఉద్గారాలుగా పిలుస్తారు. భూతాపం ద్వారానే శీతోష్ణస్థితి మార్పు సంభవిస్తుందని ఐపీసీసీ 1990లో విడుదల చేసిన మొదటి నివేదికలో పేర్కొంది.
కీలకాంశాలు
ఈ ఒప్పందం చట్టం కాదు. అందువల్ల అన్ని దేశాలు కచ్చితంగా అమలుచేయాల్సిన అవసరం లేదు. ఉద్గారాల తగ్గింపునకు ఏ చర్యలు తీసుకున్నారో, ఎంత పురోగతి సాధించారో ఆయా దేశాలు ప్రకటించాలి. ఇతర దేశాలు తమ లక్ష్యాలను చేరుకునేలా అధిక కాలుష్యానికి కారణమైన అభివృద్ధి చెందిన దేశాలు, ఆర్థికంగా, సాంకేతికంగా సాయపడాలి. అన్ని దేశాలు భాగస్వాములుగా ఉన్న యునైటెడ్ నేషన్స్ గ్రీన్ ైక్లెమెట్ ఫండ్‌కు ప్రతి ఏటా రూ.6.5 లక్షల కోట్లు జమ చేయాలన్నది లక్ష్యం.
భూతాప పరిమితి 1.5 డిగ్రీల సెంటీగ్రేడుగా ఉండాలనేది నిర్ణయం. వాస్తవానికి మొదటినుంచి 2డిగ్రీల సెల్సియస్ గురించే ప్రపంచదేశాలన్నీ మాట్లాడాయి. కొపెన్‌హెగెన్ ఒప్పందం ప్రకారం 2 డిగ్రీలు ఉన్నది. కానీ కాప్-2, 1లో 1.5 డిగ్రీల పరిమితి ప్రచారంలోకి వచ్చింది. ఇందులో ఇండియా, చైనా వంటి దేశాలు మాత్రం 2 డిగ్రీల పరిమితి కోరాయి. కానీ చివరకు 2 డిగ్రీల కన్నా బాగా తక్కువగా ఉంచాలని, 1.5 డిగ్రీలకే పరిమితం చేయడానికి కృషిచేయాలని నిర్ణయించాయి.
కర్బన ఉద్గారాల తగ్గింపునకు ప్రతిజ్ఞ
కాప్-21 ప్రారంభానికి ముందే 180కి పైగా దేశాలు తాము ఏ మేరకు కర్బన ఉద్గారాలను తగ్గిస్తాయో తెలుపుతూ ప్రణాళికలు (ఇంటెండెడ్ నేషనల్లి డిఫైన్‌డ్ కంట్రిబ్యూషన్స్- ఐఎన్‌డీసీలు) సమర్పించాయి. ఈ ఒప్పందం కింద వాటికి ఆమోదం లభించింది. కానీ వాటికి చట్టబద్ధత ఉండదు.
ఐదేండ్లకోసారి సమీక్ష
2020 నుంచి 2030 లోపు కర్బన ఉద్గారాల విడుదల ఎలా తగ్గించుకుంటాయో దేశాలు తెలపాలి. ఐఎన్‌డీసీల రూపంలో ఆయా దేశాలు ఇప్పటికే రూపొందించుకున్న ప్రణాళిక భూతాపాన్ని 2 డిగ్రీల సెల్సియస్ కంటే తక్కువకు తగ్గించలేవు. కాబట్టి ఆయా ప్రణాళికలను ప్రతి ఐదేండ్లకోసారి నిశితంగా సమీక్షించుకోవాలి. ఒకవేళ.. తాము తీసుకుంటున్న చర్యలు సరిపోకపోతే, 2డిగ్రీల తక్కువ పరిమితికి తగ్గట్లుగా ప్రణాళికలను సవరించుకోవాలి.
ఒప్పంద కమిటీ
పారిస్ ఒప్పందం అమలుకోసం వాతావరణ మార్పుపై భారత పర్యావరణ, అటవీ మంత్రిత్వశాఖ ఒక ఉన్నతస్థాయి అంతర్ మంత్రిత్వశాఖల కమిటీని ఏర్పాటు చేసింది. 14 మంత్రిత్వశాఖలకు చెందిన సీనియర్ అధికారులు ఈ అపెక్స్ కమిటీలో సభ్యులుగా పనిచేస్తారు.
ఈ పారిస్ ఒప్పందం నుంచి నిష్క్రమించిన తొలి దేశం
అమెరికా. ఈ ఒప్పందం అమెరికాకు అనుకూలంగా లేదన్న కారణంతో తప్పుకొంటున్నట్లు
2017 జూన్‌లో అప్పటి ఆ దేశ అధ్యక్షుడు ట్రంప్ ప్రకటించారు. ఒప్పందం
నియమావళి ప్రకారం గతేడాదే దీనికి సంబంధించిన ప్రక్రియ పూర్తయ్యింది. దీంతో
నవంబర్ 4, 2020న అధికారికంగా ఈ ఒప్పందం నుంచి అమెరికా వైదొలిగింది.
ప్రస్తుతం ఆ దేశ అధ్యక్షుడిగా ఎన్నికైన బైడెన్ తిరిగి పారిస్ ఒప్పందంలో
భాగస్వాములవుతామని ప్రకటించారు.