బూర్గుల రామకృష్ణారావు సారథ్యంలో మంత్రివర్గం

     1950 జనవరి 26న ఆమోదించిన భారత రాజ్యాంగంలోని రాష్ర్టాల బి కేటగిరీ జాబితాలో హైదరాబాద్ రాష్ర్టాన్ని చేర్చారు. అదే రోజు ఆఖరి నిజాం మీర్ ఉస్మాన్ అలీఖాన్ హైదరాబాద్ రాజ్యప్రముఖ్‌గా ఆరోజు వరకు హైదరాబాద్ రాజ్య ప్రధానమంత్రిగా ఉన్న సివిల్ సర్వీస్ అధికారి వెల్లోడి ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించారు. 

హైదరాబాద్ రాజ్యంపై భారత ప్రభుత్వం 1948 సెప్టెంబర్ 17న సైనిక చర్య జరిపి, నిజాం కేబినెట్ రాజీనామాకు కారణమై రాజ్యాన్ని తమ నియంత్రణలోకి తెచ్చుకున్నా ఐక్యరాజ్యసమితి భద్రతామండలిలో నిజాం ప్రభుత్వం దాఖలు చేసిన పిటిషన్ కారణంగా మీర్ ఉస్మా న్ అలీఖాన్‌ని 1950 జనవరి 26వరకు హైదరాబాద్ రాజ్‌ప్రముఖ్‌గా కొనసాగనిచ్చింది. వెల్లోడి హైదరాబాద్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా 1952 మార్చి 6న ఎన్నికల ద్వారా బూర్గుల రామకృష్ణారావు ప్రభుత్వం ఏర్పడేవరకు కొనసాగారు.

 

హైదరాబాద్ రాష్ట్రంలో తొలి ఎన్నికలు

  • హైదరాబాద్ శాసనసభకు మొదటిసారి 1952లో జరిగిన ఎన్నికల్లో భారతజాతీయ కాంగ్రెస్ మొత్తం 175 స్థానాలకు గాను, 173 స్థానాల్లో అభ్యర్థులను నిలిపింది. 
  • తెలంగాణ ప్రాంతంలోని గ్రామీణ ప్రాంతాల్లో కమ్యూనిస్టుల ప్రభావం ఎక్కువగా ఉండటం వల్ల కాంగ్రెస్‌కు ప్రతికూల పరిస్థితి ఎదురైంది. కన్నడ, మరాఠీ భాషలు మాట్లాడే ప్రాంతాల్లో కాంగ్రెస్ ఎక్కువ స్థానాలను గెలుచుకుంది. 
  • పోటీచేసిన 173 స్థానాల్లో 93 గెలుచుకున్న కాంగ్రెస్ పూర్తి మెజారిటీ సాధించడంతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. 
  • 42 స్థానాల్లో కమ్యూనిస్టుల ఆధ్వర్యంలోని ప్రోగ్రెసివ్ డెమొక్రటిక్ ఫ్రంట్ ప్రతిపక్ష కూటమిగా నిలిచింది. 
  • పోలైన ఓట్లలో కాంగ్రెస్‌కు 41.86శాతం ఓట్లు రాగా పీడీఎఫ్‌కు 20.76శాతం ఓట్లు వచ్చాయి.
  • బూర్గుల ముఖ్యమంత్రిగా కొనసాగిన కాలమంతా రాజ్‌ప్రముఖ్‌గా మీర్ ఉస్మాన్ అలీఖాన్ ఆ బాధ్యతల్లో ఉన్నారు.

 

బూర్గుల సారథ్యంలో మంత్రివర్గం

       1952 మార్చి 6న బూర్గుల రామకృష్ణారావు ముఖ్యమంత్రిగా హైదరాబాద్‌లో తొలి ప్రజాప్రభుత్వం ఏర్పడింది. పూర్వపు వెల్లోడి ప్రభుత్వంలో వీరు రెవెన్యూ మంత్రిగా పని చేశారు. మహాబూబ్‌నగర్ జిల్లాలోని షాద్‌నగర్ శాసనసభ నియోజకవర్గం నుంచి బూర్గుల ఎన్నికయ్యారు. ముఖ్యమంత్రి బూర్గుల మరో 12 మంది మంత్రులు జూబ్లీహాల్‌లో ప్రమాణస్వీకారం చేశారు. వీరందరిని రాజ్‌ప్రముఖ్ నిజాం మీర్ ఉస్మాన్ అలీఖాన్ నియమించారు.

శాఖలు:

  • బూర్గుల రామకృష్ణారావు- ముఖ్యమంత్రి, సాధారణ పరిపాలన, ల్యాండ్ రెవెన్యూ
  • ఫూల్‌చంద్ గాంధీ- విద్య, ఆరోగ్యం
  • వినాయకరావు విద్యాలంకార్- వాణిజ్యం, పరిశ్రమలు
  • వీబీ రాజు- కార్మిక, పునరావాసం
  • దిగంబరరావు బిందూ- హోం
  • డీఎస్ మేల్కోటే- ఆర్థికశాఖ
  • చెన్నారెడ్డి- ఆహార, వ్యవసాయ శాఖలు
  • కేవీ రెడ్డి- కస్టమ్స్, ఆబ్కారీ, అడవులు
  • నవాజ్ మెషీ నవాజ్‌జంగ్ బహుదూర్- పబ్లిక్ వర్క్స్
  • అన్నారావు- స్థానిక స్వపరిపాలన
  • దేవీసింగ్ చౌహాన్- సాంఘిక సేవ
  • సుకర్ దేవ్- హరిజన అభ్యుదయ
  • జగన్నాథరావు- న్యాయశాఖ