కుతుబ్ షాహీ కాలం నాటి కవులు

కాకునూరి అప్పకవి (క్రీ.శ. 1600-1660): 

      నన్నయ రచించిన ఆంధ్రశబ్ద చింతామణికి భాష్యం వంటి ప్రసిద్ధమైన అప్పకవీయంను రాశాడు. ఇతని తాత సోమన కాకునూరును అగ్రహారంగా పొందాడు. అప్పకవి నివాస గ్రామం తొమ్మిదిరేకుల. దీన్ని సంస్కృతీకరించి నవదళపురి అన్నాడు. ఇతడు తెలంగాణవాడైనప్పటికీ కొంతమంది సాహిత్యకారులు గుంటూరు జిల్లాకు చెందినవాడిగానే భావిస్తున్నారు.
ఇతర రచనలు: 1. సాధ్వీజనధర్మం 2. అనంత వ్రతకల్పం 3. శ్రీశైల మల్లికార్జునుని మీద శతకం 4. అంబికావాదం (యక్షగానం) 5. కవికల్పకం (లక్షణగ్రంథం). అప్పకవీయం తప్ప మిగిలినవన్నీ అలభ్యాలు.

 

పొనుగోటి జగన్నాథాచార్యులు (1650 ప్రాంతం):  

      ఇతడు దేవరకొండ దుర్గం పాలకుడు, కవి. అబ్దుల్లా కుతుబ్‌షా నుంచి ఛత్రచామదాది లాంఛనాలను పొందాడు. ఇతడు రచించిన కావ్యం కుముదవల్లీ విలాసం. ఇందులోని ఇతివృత్తం భక్తరామదాసు జీవితానికి దగ్గరగా ఉంటుంది. ఇది భక్తిరస ప్రధానమైన కావ్యం.

 

కంచర్ల గోపన్న (రామదాసు క్రీ.శ. 1640-1700): 

     కుతుబ్‌షాహీ వంశం చివరి రాజులైన అబ్దుల్లా కుతుబ్‌షా, అబ్దుల్ హసన్ తానీషాల వద్ద అధికారులుగా ఉన్న అక్కన్న, మాదన్నల మేనల్లుడు. ఇతడు భక్త రామదాసుగా పేరుపొందాడు. తొలి సంకీర్తనాచార్యుల్లో ఒకడిగా ప్రసిద్ధిగాంచాడు. ఈయన రచించిన కీర్తనలు రామదాసు కీర్తనలుగా ప్రసిద్ది చెందాయి. ఇతడు రచించిన దాశరథి శతకం సుప్రసిద్ధం.

 

తెనాలి రామలింగకవి (17వ శతాబ్ధం): 

     ఇతను అష్టదిగ్గజాల్లో ఒకడైన తెనాలి రామలింగడు (కృష్ణుడు) కాకుం డా అదే పేరుతో ప్రసిద్ధిగాంచిన మరొక కవి. ఇతడు విశ్వబ్రాహ్మణుడు. తన కులానికి జరిగిన అన్యాయాన్ని ఇతివృత్తంగా తీసుకొని ధీరజన మనో విరాజితం అనే కావ్యాన్ని రాశాడు. దీనికి గల మరో పేరు పరిమళ చోళ చరిత్ర. అమరుని వల్ల, గోపరాజు రామ ప్రధాని వల్ల విశ్వబ్రాహ్మణులకు జరిగిన రెండు అన్యాయాలు ఈ ప్రబంధంలోని కథ. పూర్వం విశ్వబ్రాహ్మణులకున్న కరణీకం బ్రాహ్మణులకు రావడంతో విశ్వబ్రాహ్మణులకు జరిగిన అన్యాయాన్ని ఈ కావ్యం తెలుపుతుంది.

 

క్షేత్రయ్య: 

     ఇతని అసలు పేరు వరదయ్య. తిరుపతి, కంచి, శ్రీరంగం మొదలైన క్షేత్రాలెన్నింటినో దర్శించడంతో ఇతనికి క్షేత్రయ్య అనే పేరు వచ్చింది. కృష్ణా జిల్లాలోని మొవ్వ ఇతని స్వగ్రామం. మొవ్వ గోపాలస్వామి భక్తుడు. ఆ దేవున్ని నాయకుడిగా చేసి మువ్వ పదాలు రాశాడు. క్షేత్రయ్య తంజావూరును దర్శించి రఘునాథనాయకుని చేత సన్మానాలు అందుకున్నాడు. అబ్దుల్లా కుతుబ్‌షా ఆస్థానాన్ని సందర్శించి అతనిచే సన్మానింపబడ్డాడు. అబ్దుల్లాపై వేయి పదాలు చెప్పాడంటారు. రసమంజరి అనే నాయికా నాయక భేదాలను చెప్పే లక్షణ గ్రంథం కూడా రాశాడు.

 

రెడ్రెడ్డి మల్లారెడ్డి: 

    ఈయన పెదతాత మల్లారెడ్డి కుతుబ్‌షా రాజు నుంచి బూర్గుల గ్రామాన్ని దానంగా పొందాడు. గంగాపురంలోని చెన్నకేశవస్వామి మహిమలను వర్ణిస్తూ గంగాపుర మహాత్మ్యం అనే స్థల పురాణం రాశాడు. సురవరం ప్రతాపరెడ్డి ఈ కావ్యాన్ని పరిష్కరించి సమగ్రమైన పీఠికతో విజ్ఞాన వర్ధినీ పరిషత్తు ఐదో ప్రచురణగా 1946లో ప్రచురించారు.

 

బిజ్జల తిమ్మభూపాలుడు (క్రీ.శ. 1675-1725): 

    సంస్కృతంలో మురారి రచించిన ప్రసిద్ధ నాటకం అనర్ఘరాఘవంను కావ్యంగా రాశాడు. ఆలంపూరు రాజధానిగా ప్రాగటూరు ప్రాంతాన్ని పరిపాలించాడు. కేశవపంతుల నరసింహశాస్త్రి విపుల పీఠికతో 1977లో ఏపీ సాహిత్య అకాడమీ ఈ కావ్యాన్ని ప్రచురించింది.

 

పెదసోమ భూపాలుడు (క్రీ.శ. 1663-1712): 

     ఇతడు గద్వాల కోటను నిర్మించి రాజధానిని పూడూరు నుంచి గద్వాలకు మార్చాడు. జయదేవుడు రచించిన అష్టపదులకు సంస్కృతాంధ్రభాషల్లో వ్యాఖ్యానం రాసినట్లు తెలుస్తుంది. జానపదులు ఇతన్ని నల్లసోమనాద్రిగా పాటలు కట్టి ఇతని శౌర్యాన్ని కీర్తిస్తూ పాడుతారు.

 

కాణాదం పెద్దన సోమయాజి (క్రీ.శ. 1752-1793):  

     ఇతడు గద్వాల చిన సోమభూపాలుని ఆస్థాన కవి. అభినవ అల్లసానిగా కీర్తింపబడ్డాడు. ఇతని రచనలు మత్స్యపురాణం (అనువాదం), రామాయణం (సంస్కృత టీక), బాలకాండ తాత్పర్యం, ఆధ్యాత్మ రామాయణం, ముకుంద విలాసం.

 

చిన సోమభూపాలుడు (1762-1793):  

     గద్వాల సంస్థాన చరిత్రలో చిన సోమభూపాలుని పాలనా కా లాన్ని స్వర్ణయుంగా భావిస్తారు. ఇతడు కవి పండిత పోషకుడేగాక స్వయంగా కవి. సంస్కృతంలో హరిభట్టు రచించిన రత్నశాస్ర్తాన్ని తెలుగులోనికి అనువదించాడు. జయదేవుని అష్టపదులను యక్షగానంగా రాశాడు.

 

రామడుగు శివరామ దీక్షితులు (17వ శతాబ్దం): 

     నల్లగొండ జిల్లా సంస్థాన్ నారాయణపురానికి చెందిన గొప్ప ఆధ్యాత్మికవేత్త, రచయిత. పండరీపురానికి చెందిన శ్రీధరస్వామి శిష్యుడు. తెలంగాణ మాండలికంలో వీరు రచించిన వేదాంత గ్రంథం శివరామదీక్షితీయం. దీనికి గల మరోపేరు బృహద్వాసిష్ఠం. వేదాల్లో నిగూఢంగా ఉన్న వేదాంత విషయాలను అచ్చమైన తెలంగాణ భాషలో రాసి సామాన్య జనులకు సైతం అర్థమయ్యేలా చెప్పారు. వీరి శిష్య ప్రశిష్యుల్లో చాలామంది వేదాంత సంబంధమైన రచనలు చేశారు.

 

ఉర్దూ సాహిత్యం
      కుతుబ్‌షాల కీర్తి కిరీటంలో ఉర్దూ భాషకు ప్రాపకం కల్పించటం ఓ కలికితురాయి వంటిదని ఎ.ఎం.సిద్దిఖీ భావించాడు. మొఘలు చక్రవర్తులు పార్శీ భాషకు ప్రాధాన్యమిస్తే, దక్కన్ సుల్తాన్‌లు పార్శీ, దక్కనీ ఉర్దూ రెండింటికీ ప్రాధాన్యమిచ్చారు. కుతుబ్‌షాలు తెలుగు కవులతోపాటు ఉర్దూ, అరబ్బీ, పార్శీ కవులను కూడా ఎంతో ఆదరించారు. సుల్తాన్ కులీ కుతుబ్‌షా, జంషీద్ కుతుబ్‌షాలు సాహిత్యాన్ని పోషించకపోయినా వారి తర్వాత వచ్చిన పాలకులు ఇబ్రహీం కుతుబ్‌షా, మహమ్మద్ కులీ కుతుబ్‌షా, అబ్దుల్లా కుతుబ్‌షా, అబుల్ హసన్ కుతుబ్‌షాలు సాహిత్యాన్ని ఎంతో పోషించారు.

ఫిరోజ్: ఇతడు ఇబ్రహీం కుతుబ్‌షా కాలానికి చెందిన కవి. హజరత్ షేక్ అబ్దుల్ ఖదీర్ జిలానీ, మఖ్దూమ్ జీషా మహమ్మద్ ఇబ్రహీంలను గురించి ఎనిమిది పేజీల స్తుతి కావ్యం రాశాడు.

మహమ్మద్ కులీ కుతుబ్‌షా: ఇతని కాలం దక్కనీ (ఉర్దూ) భాష ఎదుగుదలలో ఒక మైలురాయి వంటిది. ఇతడు స్వయంగా కవి. మహమ్మద్ కులీ కుతుబ్‌షా చేపట్టని విషయమే లేదు. స్పృశించని అంశమే లేదు. మత ప్రస్తావనల నుంచి శృంగార కలాపం దాకా ఇతడు చెప్పకుండా విడువలేదు. సంబోధన కావ్యాలు, శోక కావ్యాలు, చతుష్పదులు, మథ్నవీలు, గజల్స్ రాశాడు. పార్శీలో హఫీజ్ రాసిన ఎన్నో గజల్స్‌ను ఇతడు ఉర్దూలోకి అనువదించాడు. దక్కనీ ఉర్దూలో అంత గొప్పగా రాసిన మొదటి కవి మహమ్మద్ కులీ కుతుబ్‌షా. ఇతని కవినామ ముద్ర మాని. ఇతడు రచించిన కవితలు జోర్ కుల్లియాత్, మహమ్మద్ కులీకుతుబ్‌షా పేరున సంకలనంగా వెలువడ్డాయి.

వజిహి: మహమ్మద్ కులీ కుతుబ్‌షా కాలంలో చెప్పుకోదగ్గ కవి. ఇతడు వఝిహి, వఝీ అనే పేర్లతో పిలువబడ్డాడు. ఇతని రచనలు కుతుబ్ ముస్తరీ (కవిత్వం), సుబ్రాస్ (వచనం). కుతుబ్ ముస్తరీ గ్రంథంలో ఇబ్రహీం కుతుబ్‌షా ప్రశంస కూడా ఉంది. ఇందులోని ప్రధాన కథ ఒక రాజు బెంగాల్ రాకుమారి ముస్తరీని ప్రేమించడం. క్రీ.శ. 1635లో అబ్దుల్లా కుతుబ్‌షా ఆదేశానుసారం సుబ్రాస్ అనే గొప్ప వచన కావ్యాన్ని రాశాడు.

గవాసి: ఇతడు క్రీ.శ. 1535-36 ప్రాంతంలో బీజాపూరుకు కుతుబ్‌షా రాయబారిగా నియమింపబడ్డాడు. అబ్దుల్లా కుతుబ్‌షా ఇతన్ని మలికుష్-షువారా అని పిలిచేవాడు. ఇతని రచనలు 1. సైపుల్ ముల్క్‌వ బదీ ఉల్-జమాల్ 2. తోతినామా 3. మైనా సత్వంతీ. ఇందులో మొదటి గ్రంథం అరేబియన్ నైట్స్‌కు అనువాదం. రెండోదైన తోతినామా సంస్కృతంలో రాయబడిన శుకసప్తతి పార్శీ అనువాదానికి ఉర్దూ అనువాదం.

ఇబ్న్ నిషాతీ: ఈ కాలంలో మరో ప్రసిద్ధమైన ఉర్దూ కవి. ఈయన క్రీ.శ. 1656లో రాసిన కావ్యం మథ్నవీ పూల్‌బన్. ఇది పార్శీలోని బసాతిన్‌కు అనుకరణ.

తబాయ్: అబ్దుల్లా కుతుబ్‌షా చివరికాలంలో క్రీ.శ. 1671లో తబాయ్ రాసిన కావ్యం మథ్నవీ బహ్రాంవ గులందామ్.

మాలిక్ ఖుష్‌నూద్: ఇతడు అబ్దుల్లా కుతుబ్‌షా కాలానికి చెందినవాడు. ఇతడు రచించిన కావ్యం మార్థియా. అంటే శోక కావ్యం.

గులాం అలీ: అబుల్ హసన్ (తానీషా) ఆస్థాన కవుల్లో ఒకడు. ఇతడు జాయసీ పద్మావత్‌ను క్రీ.శ.1680లో ఉర్దూలోకి అనువదించాడు. ఇతను రచించిన జంగ్‌నామా మహమ్మద్ హనీఫ్, యాజిద్‌ల మధ్య జరిగిన యుద్ధం గురించి తెలుపుతుంది.

అలీఖాన్ లతీఫ్: ఇతడు అబ్దుల్లా, అబుల్ హసన్ కుతుబ్‌షాల దర్బారులో ఉన్న తురుష్క అమీరు. ఈయన రచించిన సుప్రసిద్ధ గ్రంథం జఫర్‌నామా. ఇందులో 5500 పాఠాలు ఉన్నాయి.

ముల్లా హసన్ తిబ్లీసీ: ఈయన రచించిన గ్రంథం మర్ఘూబుల్-కులూబ్. ఇది అలభ్యం. దీంతోపాటు వేటను గురించిన విషయాలను క్రీ.శ. 1575-76 కాలంలో సైయదియా అన్న గ్రంథాన్ని ఇబ్రహీం కోరిక మేరకు రాశాడు.

మీర్జా మహమ్మద్ అమీన్ షహ్రిస్తానీ: హైదరాబాద్‌కు వచ్చిన పార్శీ కవుల్లో సుప్రసిద్ధుడు. ఇతడు మీర్ మోమిన్ సలహాపై మహమ్మద్ కులీకుతుబ్‌షాచే 1602-1603లో మీర్ జుమ్లాగా నియమించబడ్డాడు. ఇతని రచనలు 1. ఖుస్రూషరీన్ 2. లైలా-మజ్నూన్ 3. మత్ మహుల్- అంజార్ 4. ఫలకుల్ బురూజ్.

మహమ్మద్ కుతుబ్‌షా: ఇతడు పార్శీ భాషలో మంచి కవి. ఇతడు నాలుగు కలాల పేర్లతో రచనలు చేశాడు. అవి 1.జిలుల్లాహ్ 2. జిల్లె ఇల్లాహ్ 3. జిల్లీ- ఇల్లాహి 4. సుల్తాన్

మహమ్మద్ హుసేన్ బుర్హాన్క్: బురాహనె-కాతీ అను ప్రముఖ పార్శీ నిఘంటువును రూపొందించి అబ్దుల్లా కుతుబ్‌షాకు అంకితమిచ్చాడు.

మీర్జా నిజాముద్దీన్ అహ్మద్ సైదీ: అబ్దుల్లా కుతుబ్‌షా మొదటి పందొమ్మిది సంవత్సరాల పాలనను తెలియజేస్తూ హదికతుస్- సలాతిన్ అనే గ్రంథాన్ని రాశాడు.


అలీబిన్ తైపూర్ బుస్తామీ: ఇతడు అబుల్ హసన్ కుతుబ్‌షా కాలంనాటివాడు. ఈయన రచించిన గ్రంథం హదాయికస్- సలాతిన్ (నృపతుల ఉద్యానవనం).