పశ్చిమ కనుమలు

పశ్చిమ కనుమలు

వీటిని సహ్యాద్రి పర్వతాలుగా కూడా పిలుస్తారు. ఇవి.. రెండు రకాలు.

  1. ఉత్తర సహ్యాద్రి శ్రేణులు (Northern)

  2. దక్షిణ సహ్యాద్రి శ్రేణులు (Southern Sahyadri)

1) ఉత్తర సహ్యాద్రి శ్రేణులు (Northern)

-ఇవి తపతి నదికి దక్షిణంగా మహారాష్ట్ర, గోవా రాష్ట్రాల్లో విస్తరించాయి.

-వీటి సగటు ఎత్తు 1200 మీ., ఇవి దక్కన్‌ నాపలు లేదా లావా శిలలతో ఏర్పడ్డాయి.

– సహ్యాద్రి కనుమలు కొంకణ్‌ తీరాన్ని (మహారాష్ట్ర, గోవా), మహారాష్ట్రలోని దక్కన్‌ పీఠభూమి ప్రాంతాన్ని వేరుపరుస్తాయి.

-వీటిలో ఉన్న శిఖరాలు

1) కల్సూబాయి (1646 మీ.) ఇది మహారాష్ట్రలో ఎత్తయిన శిఖరం

2) సాల్వేర్‌ (1567 మీ.)

3) ధోడప్‌ (1451 మీ.)

4) మహాబలేశ్వర్‌ (1438 మీ.)

5) హరిశ్చంద్రగఢ్‌ (1424 మీ.)

– వీటిలో ఉన్న వేసవి విడుదులు- మహాబలేశ్వర్‌, లోనావాలా ఖండాలా, మాథరన్‌, అంబోలి.

2) దక్షిణ సహ్యాద్రి శ్రేణులు (Southern Sahyadri)

-ఇవి కర్ణాటక, కేరళ, తమిళనాడు రాష్ట్రాల్లో ఉన్నాయి.

ఎ) నీలగిరి కొండలు (Blue Mountain)

– ఇవి తమిళనాడు, కర్ణాటక, కేరళ ట్రైజంక్షన్‌ వద్ద ప్రధానంగా తమిళనాడు రాష్ట్రంలో విస్తరించిన పశ్చిమ కనుమలు. ఇవి ‘షోల’ అడవులకు ప్రసిద్ధి.

– వీటిలో ఎత్తయిన శిఖరం దొడబెట్ట (2637 మీ.). ఈ శిఖరం పాదాల చెంతన వేసవి విడిది అయిన ‘ఊటీ (ఉదక మండలం)’ ఉంది.
– మాకుర్తి శిఖరం (2,554 మీ.) దీనిలోనే ఉంది.

— తూర్పు కనుమలు, పశ్చిమ కనుమలు కలిసే ప్రాంతం నీలగిరి కొండల్లోని ‘గుడలూరు’. వీటిలో నివసించే తెగలు కోట, తోడ, ఇరుల, కురుంబ.

– దేశంలో మొట్టమొదటి బయోస్పియర్‌ రిజర్వ్ ను 1986లో నీలగిరి కొండల్లోనే ప్రారంభించారు.

– సైలెంట్‌ వ్యాలీ, ముదుమలై, మాకుర్తి, నాగర్‌హూల్‌, బందీపూర్‌ నేషనల్‌ పార్క్​‍లు, వైనాడ్‌, సత్యమంగళం వన్యప్రాణి సంరక్షణ కేంద్రాలు ఈ నీలగిరుల్లోనే ఉన్నాయి.

– నీలగిరి కొండలకు తూర్పునగల సత్యమంగళం వైల్డ్​‍లైఫ్‌ శాంక్చువరీ పశ్చమ, తూర్పు కనుమల జీవ ఆవాసాలకు అనుసంధానంగా ఉంది.

-ఈ నీలగిరి కొండల దిగువనే కోయంబత్తూర్‌ పట్టణం ఉంది.

బి) అన్నామలై కొండలు

– అన్నామలై అంటే ఏనుగుల కొండలు అని అర్థం.

-ఇవి కేరళ, తమిళనాడు రాష్ట్రాల్లో విస్తరించిన శ్రేణులు.

– దీనిలో ఎత్తయిన శిఖరం అనైముడి (2,695 మీ.).

– అత్యధిక వర్షపాతం పొందే పశ్చిమ కనుమల్లోని భాగం.

– ఇరవికులం నేషనల్‌ పార్క్​‍, పరాంబికులం వన్యప్రాణి సంరక్షణ కేంద్రం ఈ పర్వతాల్లో ఉంది.

సి) పళని కొండలు

– అన్నామలై కొండలకు తూర్పు వైపునగల పర్వతాలు, ఇవి కేరళ, తమిళనాడు రాష్ట్రాల్లో ఉన్నాయి.

– వీటిలో ఎత్తయిన శిఖరం వందరావు శిఖరం (2,533 మీ.).

-ఇక్కడ ఉన్న వేసవి విడిది ‘కొడైకెనాల్‌’.


పశ్చిమ కనుమల్లోని ముఖ్యమైన శిఖరాలు

1) అనైముడి శిఖరం (2,695 మీ.)– ఇది అన్నామలై పర్వత శ్రేణిలో, ఇడుక్కి (కేరళ)లో ఉంది. దక్షిణ భారత్‌లో, ద్వీపకల్ప పీఠభూమిలో, పశ్చిమ కనుమల్లో, అన్నామలై కొండల్లో, కేరళ రాష్ట్రంలో ఎత్తయిన శిఖరం. దీనిని దక్షిణ భారత్‌లో ఎవరెస్ట్ అంటారు. ఇది ఇరవికులం నేషనల్‌ పార్క్​‍లో ఉంది.

2) దొడబెట్ట శిఖరం (2,637 మీ.)- దక్షిణ భారత్‌లో, ద్వీపకల్ప పీఠభూమిలో, పశ్చిమ కనుమల్లో రెండో ఎత్తయిన శిఖరం. తమిళనాడులో, నీలగిరి కొండల్లో అత్యంత ఎత్తయిన శిఖరం.

3) వందరావు శిఖరం- ఇది తమిళనాడులోని పళని కొండల్లో ఎత్తయిన శిఖరం.

4) ముల్లయనగిరి శిఖరం (1930 మీ.)– ఇది కర్ణాటకలో ఎత్తయిన శిఖరం. బాబా బుడాన్‌ కొండల్లో ఉంది.

5) దేవరమల్లి శిఖరం (1922 మీ.)- ఇది కేరళలో కార్డమమ్‌ కొండల్లో ఎత్తయిన శిఖరం. పెరియార్‌ నది ఇక్కడి నుంచే ప్రారంభమయ్యింది.

6) కుద్రేముఖ్‌ శిఖరం (1892 మీ.)- ఇది కర్ణాటక రాష్ట్రంలో ఉంది.

7) కల్సూబాయి శిఖరం (1646 మీ.)- ఇది మహారాష్ట్ర లోని సహ్యాద్రి కొండల్లో ఉంది. ఇది మహారాష్ట్రలోనే ఎత్తయిన శిఖరం.

– దేశంలో ప్రసిద్ధమైన జలపాతం ‘జోగ్‌ జలపాతం (253 మీ.). ఇది కర్ణాటకలో ‘శరావతి నది’పై ఉంది.

 

పశ్చిమ కనుమల్లోని ప్రధాన కనుమలు

1) థాల్‌ఘాట్‌ (కాసర ఘాట్‌) కనుమ- ఇది మహారాష్ట్ర లోని ముంబై, నాసిక్‌లను కలుపుతుంది. ‘నేషనల్‌ హైవే 160’ని ఈ కనుమ గుండా నిర్మించారు.

2) నానేఘాట్‌ కనుమ- ఇది మహారాష్ట్రలోని ముంబై, జున్నార్‌లను కలుపుతుంది. దీని గుండా ‘నేషనల్‌ హైవే 61’ని నిర్మించారు.

3) భోర్‌ ఘాట్‌ కనుమ- ఇది మహారాష్ట్రలోని ముంబై, పుణెలను కలుపుతుంది. ‘నేషనల్‌ హైవే 48’ని ఈ కనుమ గుండా నిర్మించారు.

4) అంబెనాలి కనుమ- ఇది మహారాష్ట్రలోని రాయగఢ్‌, సతారాలను కలుపుతుంది. దీని గుండా ‘నేషనల్‌ హైవే 72’ను నిర్మించారు.

5) అంబఘాట్‌ కనుమ- ఇది మహారాష్ట్రలోని రత్నగిరి, కొల్హాపూర్‌లను కలుపుతుంది. ‘నేషనల్‌ హైవే 66’ను ఈ కనుమ గుండా నిర్మించారు.

6) పాల్‌ఘాట్‌ (పాలక్కాడ్‌ ఘాట్‌) కనుమ– ఇది కేరళలో పాలక్కాడ్‌ (కేరళ), కోయంబత్తూర్‌ (తమిళనాడు)లను కలుపుతుంది. ఇది ఉత్తరాన నీలగిరి పర్వతాలకు, దక్షిణాన అన్నామలై కొండలకు మధ్యలో ఉంది. ఈ కనుమ 24 నుంచి 30 కి.మీ. వెడల్పు ఉంది. భరత్‌పూజ నది ఈ కనుమ గుండా ప్రవహిస్తుంది. ‘నేషనల్‌ హైవే 544’ను ఈ కనుమ గుండా నిర్మించారు.

7) శెన్‌ కోట్టె ఘాట్‌ (శెంగోళైఘాట్‌) కనుమ- ఇది తమిళనాడులోని కొల్లమ్‌, మధురైలను కలుపుతుంది. పాల్‌ఘాట్‌ కనుమ తరువాత పశ్చిమ కనుమల్లో రెండో పెద్దది. దీనిని ‘దక్షిణ తమిళనాడు ముఖద్వారం’ అంటారు.