తెలంగాణాలో వెట్టి, భగీల వ్యవస్థ

 

వెట్టి విధానం

  • ఒక వ్యక్తి లేదా ఒక సంఘాన్ని శారీరక నిర్బంధానికి గురిచేసి, వారితో చాకిరీ చేయించుకుని ప్రతిఫలాన్ని ఇవ్వకపోగా, వారి నుండే వసూళ్లను (ధన రూపం/స్తు రూపం) బలవంతంగా రాబట్టుకుని వారి శ్రమను వారి జీవితాలను దోచుకునే విధానమే వెట్టి విధానం

 

దళితులు

  • ప్రతి దళిత  కుటుంబం వెట్టిచాకిరీ చేయటానికి కుటుంబంలోని ఒక్కరిని కేటాయించవలసి ఉండేది. చిన్న పల్లెలో ప్రతి ఇంటి నుండి ఒక మనిషిని పంపడం జరిగింది. పటేల్ పట్వారి, మాలి పటేల్ లేదా దేశ్ ముఖ్  ఇండ్లలో  గృహ సంబంధమైన పనులు చేయటం, పోలీస్ స్టేషన్ లకు, తాలూకాపీసులకు రిపోర్టులను మోసుకెళ్ళడం, గ్రామ చావిడికి, బందిలిదొడ్డికి కాపలా కాయడం రోజువారి పని లో భాగమే. ఇదికాక గ్రామ చావిడికి ఎవరైనా అధికారి వచ్చినప్పుడు వాళ్లకు మరింత ఎక్కువ పని ఉండేది. చిలుకూరు గ్రామంలో ప్రతి రోజు 16 మంది హరిజనులు వెట్టిచాకిరీ చేస్తుండేవారు. అడవుల నుండి కట్టెలు కొట్టి తెచ్చేవారు. టపా మోసుకెళ్లే వారు. టపా గాని, ఇతర సరఫరాలను మోసికెళ్ళినందుకు వారికి రెండున్నర మైళ్లకు ఒక అణా చొప్పున ఇవ్వబడుతునట్లు కాగితాల మీద ఉండేది. అయితే ఆచరణలో అది కూడా ఇచ్చేవారు కారు.  ఈ విధానాన్ని ‘కోసుకు వీసం’ అనేవారు

 

చర్మకారులు

  • చర్మకారుల గా పనిచేసే దళితులు తోళ్లను  పదును చేసి చెప్పులు కుట్టినందుకు, వ్యవసాయ పనులకు, బావుల నుండి నీరు తొడడానికి, అవసరమైన తోలు పరికరాలు తయారు చేసినందుకు, అరకలకు పట్టీలు తయారు చేసినందుకు భూస్వాములు ఏమీ చెల్లించేవారు కాదు. దళితులు భూస్వాములకు వాటిని ఉచితంగానే సరఫరా చేయవలసి వచ్చేది. మిగతా రైతాంగం మాత్రం ఆ దళితులకు ధాన్యరూపం లోనూ, ఇతర వ్యవసాయ పంటల రూపంలోనూ నిర్ణితమైన మేర చెల్లించేవారు

 

బోయలు, బెస్తలు, రజకులు

  • బోయలు, బెస్తలు, రజకుల వంటి మరికొన్ని ఇతర వెనుకబడిన కులాలవారు భూస్వామి కుటుంబాలకు చెందిన పురుషులను, స్త్రీలను పల్లకిలోనో, మేనాలోనో ఎక్కించుకొని తమ భుజాల మీద మోసుకు వెళ్ళవలసి వచ్చేది. తమ బంధువులను చూచి రావాలి అనుకున్నప్పుడు, తీర్థాలూ, తిరునాళ్లను సందర్శించవలసినప్పుడల్లా భూస్వాములు ఆ విధంగా వారిచే నిర్బంధంగా మోయించుకునేవారు. భూస్వామి కుటుంబాల వారు వేగంగా నడిచే ఎడ్లబండ్లలో ప్రయాణం చేసేటప్పుడు బండి ముందు దారి బాగుచేయడానికి, బండి వెనక కాపలాదారుగా వారు పరుగెత్తాల్సి వచ్చేది. వారు గుర్రాలపై స్వారీ చేసేటప్పుడు గుర్రాల వద్ద పనిచేసే వ్యక్తులు వాటి వెంట పరుగెత్తాల్సి ఉండేది .

 

కల్లు గీత కార్మికులు

  • కల్లుగీత కార్మికులు కల్లు గీత గీత గీస్తూ, భూస్వాముల కుటుంబాలకు ఉచితంగా సరఫరా చేయడం కోసం 5 నుండి 10 చెట్ల వరకు ప్రత్యేకంగా వారికోసం కేటాయించి ఉండాలి. వారికి రోజుకు ఐదు కుండల కల్లు సరఫరా చేయాలి. పండుగలు పబ్బాలప్పుడు మరింత ఎక్కువ కల్లు ఇచ్చిరావాలి.

 

చేనేత పని వారు

  • చేనేత పనివారు భూస్వాముల ఇళ్ళలో పనిచేసే నౌకర్లలకు బట్టలు సరఫరా చేయాలి. వడ్రంగులు, కమ్మరులు భూస్వాములకు వ్యవసాయ పరికరాలన్నీ ఉచితంగా సరఫరా చేయాలి. మరమ్మతులను ఈ విధంగానే చేయాలి.

 

రజకులు, దేశ్ ముఖ్ లు

  • రజకులు, దేశ్ ముఖ్ లు గ్రామ అధికారుల ఇళ్లల్లో బట్టలు ఉతకాలి, అంట్లు తోమాలి, గ్రామ చావిడిలో మకాం వేసిన అధికారుల కొరకు మంచాలు, పరుపులు మోసుకెళ్లాలి. వంట చేయడానికి అవసరమైన అన్నీ చేరవేయాలి. వారే అధికారుల ఇళ్లల్లో పసుపు కారం కొట్టాలి.

 

కుమ్మరులు 

  • కుమ్మరులు అధికారులకు భూస్వాములకు అవసరమైన కుండలివ్వాలి. జాగిర్ద్రార్ గానీ, దేశ్ ముఖ్ గాని హైదరాబాదులో నివాసముంటున్నా, అంత దూరము నడిచి వెళ్లి అవసరమైన కుండలన్నీ ఇచ్చిరావాలి. గ్రామ చావడి లో మకాం వేసిన అధికారికి అవసరమైన కుండలిచ్చిరావాలి. వంట కూడా చేసి పెట్టాలి. మంగలి వారు ప్రతిరోజు దేశ్ ముఖ్ ఇండ్లలో సేవ చేసి రావాలి. రాత్రివేళ భూస్వామి పాదాలను అతని ఒళ్ళు మర్ధనా చేయాలి.

 

గొల్లవారు 

  • భూస్వాముల ఇండ్లలో ఏదైనా వేడుక జరుపుకున్న ప్రతిసారి గ్రామానికంతటికీ పండగ, పబ్బాలు వచ్చినప్పుడు గొల్లవారు ప్రతి మందనుంచి ఒక గొర్రెనిచ్చి తీరాలి. ఏదో ఒక సాకుతో నైనా భూస్వాములు ఎప్పుడు పడితే అప్పుడు కోరితే గొఱ్ఱె ఇచ్చి తీరాలి.

 

వ్యాపారులు 

  • గ్రామాలలో వ్యాపారం చేసే వారు పోలీస్ పటేల్ నుండి చీటీ అందగానే గ్రామంలోకి వచ్చిన ఏ అధికారి కైనా మంచి నెయ్యి తో సహా అవసరమైన సరుకులనీ వంతులవారీగా సరఫరా చేయవలసి ఉండేది. వాళ్ళ వద్ద ఏదైనా సరుకు లేకపోయినా ఏదైనా సరుకు ఇవ్వకపోయినా ఇవ్వటానికి వ్యతిరేకించినా నానావిధాలైన చిత్రహింసలకు, అవమానాలకు గురి చేయబడ్డారు

 

గ్రామ ప్రజలు 

  • గ్రామ ప్రజలు ప్రత్యేకించి సరఫరా చేయడానికి ఏ ఇతర వస్తువులు లేని పేద ప్రజలు ఉచితంగా కోడిపెట్టలు సరఫరా చేయవలసి వచ్చేది. ఈ వెట్టినుండి రైతులను కూడా వదిలి పెట్టేవారు కాదు. ఎవరైనా అధికారి వచ్చినప్పుడల్లా రైతులు వారిని ఉచితంగానే తమ బండ్లలో ఎక్కించుకెళ్ళాలి. ఏ వేళ పడితే ఆ వేళప్పుడు ఎడ్లకు మేత వేయడం కూడా ఆపి వారిని వారి గమ్యస్థానాలకు చేర్చాలి. తమ స్వంత పొలాల్లో పని ప్రారంభించటానికి ముందే గ్రామ అధికారుల, భూస్వాముల పొలాలు దున్ని పెట్టాలి. భూస్వాముల భూములు తడిసే అంతవరకూ రైతుల పొలాలకు నీళ్లు అందనిచ్చేవారు కాదు. అధికారులు, భూస్వాముల పొలాల్లో వ్యవసాయ కార్మికులు ఎలాంటి ప్రతిఫలం ఆశించకుండా పని చేయాలి. ఆ తర్వాత గాని వారు తమ జీవనభృతి కోసం మిగతా రైతులు పనులలోకి వెళ్ళటానికి వీలు లేదు.

 

ఉద్యోగులు 

  • వివిధ రూపాలలో సాగిన ఈ నిర్బంధ చాకిరి చేయించుకున్నది, వసూళ్లు సాగించింది భూస్వాములు మాత్రమే కాదు. చిన్న ఉద్యోగులు, పెద్ద ఉద్యోగులు, గ్రామాలలో నివసిస్తున్న వారు లేదా పర్యటన కోసమో, ప్రత్యేక తనిఖీల కోసమో గ్రామాలకు వచ్చిన వారందరూ ఈ విధమైన చాకిరీ చేయించుకోవడం, వసూళ్లు సాగించడం జరిగేది

 

బాలికలు 

  • ఈ ఫ్యూడల్ దోపిడీలలో కెల్లా దారుణమైనది భూస్వాముల ఇళ్ళలో బానిసలుగా బాలికలను పంపించే పద్ధతి . భూస్వాములు తమ కుమార్తెల పెళ్లిళ్లు చేసినప్పుడు బానిసలుగా బాలికలను బహూకరించి, పెండ్లి జరిగిన తమ కుమార్తెలతో పాటే, వారి అత్తవారింట్లో పనిచేయడానికి పంపేవారు. భూస్వాములు ఈ బానిస యువతులను ఉంపుడుగత్తెలుగా కూడా ఉపయోగించుకునేవారు.