దాశరథి కృష్ణమాచార్య

 

నాతెలంగాణ కోటి రతనాల వీణ..అంటూ నిజాంపాలన పై,తన కవితాశక్తితో అగ్ని ధార చేసిన దాశరథి కృష్ణమాచార్య వర్ధంతి నేడు.....
 

 

దాశరథి కృష్ణమాచార్య 1925 జూలై 22న వరంగల్ జిల్లా చిన్న గూడూరు గ్రామంలో జన్మించాడు. నిరంకుశ నిజాం పాలనను తన రచనల ద్వారా వెలిబుచ్చిన మహాకవి. 1987 నవంబర్ 5 న దాశరథి మరణించాడు.తెలంగాణ మహాకవి దాశరథి పసిప్రాయంలోనే బహుభాషల పండితుడై, కలం పట్టి, గళం విప్పి, తన తెలంగాణ ప్రజల బానిస బంధనాలను తెంచి, విముక్తి కలిగించడానికి స్వయంగా కదనరంగంలో అడుగు పెట్టి, నాటి పాలకుల గుండెల్లో వణుకు పుట్టించి, తిమిరంతో సమరం జరిపి స్వాతంత్య్ర సమరంలో ఎక్కడా రాజీపడని సాహసవంతుడు. తెలంగాణ ప్రజల కన్నీళ్లను 'అగ్నిధార'గా మలిచి నిజాం పాలన మీదికి ఎక్కుపెట్టిన మహాకవి దాశరథి కృష్ణమాచార్య. దాశరథి గా ఆయన సుప్రసిద్ధుడు. పద్యాన్ని పదునైన ఆయుధంగా చేసుకొని తెలంగాణ విముక్తి కోసం ఉద్యమించిన దాశరథి ప్రాతఃస్మరణీ యుడు. నా తెలంగాణ కోటి రతనాల వీణ అని గర్వంగా ప్రకటించి ఇప్పటి ఉద్యమానికీ ప్రేరణనందిస్తున్న కవి దాశరథి.

బాల్యం-విద్యాబ్యాసం

దాశరథి కృష్ణమాచార్య 1925 జూలై 22న వరంగల్ జిల్లా చిన్న గూడూరు గ్రామంలో జన్మించాడు. ప్రస్తుతం ఈ గ్రామం మహబుబా బాద్ జిల్లాలో ఉంది. బాల్యం ఖమ్మం జిల్లా మధిరలో గడిచింది. ఉర్దూలో మెట్రిక్యులేషను, భోపాల్ విశ్వవిద్యాలయం నుండి ఇంటర్మీడి యెట్, ఉస్మానియా విశ్వవిద్యాలయం నుండి ఇంగ్లీషు సాహిత్యంలో బియ్యే చదివాడు. సంస్కృతం, ఆంగ్లం, ఉర్దూ భాషల్లో మంచి పండితుడు. చిన్నతనంలోనే పద్యం అల్లటంలో ప్రావీణ్యం సంపాదించాడు.

ప్రారంభంలో కమ్యూనిస్టు పార్టీ సభ్యుడిగా ఉండి రెండో ప్రపంచయుద్ధం సమయంలో ఆ పార్టీ వైఖరి నచ్చక ఆ పార్టీ నుంచి బయటకు వచ్చి హైదరాబాదు సంస్థానంలో నిజాం అరాచక ప్రభుత్వానికి వ్యతిరేకంగా జరుగు తున్న ఉద్యమంలో పాలుపంచుకున్నాడు.

రచనా ప్రస్థానం..


ఉపాధ్యాయుడిగా,పంచాయితీ ఇన్స్పెక్టరు గా, ఆకాశవాణి ప్రయోక్తగా ఉద్యోగాలు చేసాడు. సాహిత్యంలో దాశరథి అనేక ప్రక్రియల్లో కృషి చేసాడు. కథలు, నాటికలు, సినిమా పాటలు, కవితలు రాసాడు.

 నిజాం పాలనలో రకరకాల హింసలను భవిస్తున్న తెలంగాణాను చూసి చలించిపోయాడు. పీడిత ప్రజల గొంతుగా మారి నినదించాడు.

“రైతుదే తెలంగాణము రైతుదే.ముసలి నక్కకు రాచరికంబు దక్కునే అని గర్జించాడు.

దగాకోరు బటాచోరు రజాకారు పోషకుడవు, దిగిపొమ్మని జగత్తంత నగారాలు కొడుతున్నది, దిగిపోవోయ్, తెగిపోవోయ్"

👉 ..అని నిజామును సూటిగా గద్దిస్తూ రచనలు చేసాడు.

 ఆంధ్రమహాసభలో చైతన్యవంత మైన పాత్ర నిర్వహించి నిజాం ప్రభుత్వం చేత జైలు శిక్ష అనుభవిం చాడు. నిజామాబాదు లోని ఇందూరు కోటలో ఆయన్ని మరో 150 మంది తో ఖైదు చేసిఉంచింది, నిజాము ప్రభుత్వం. ఆయనతోపాటు ఖైదులో వట్టికోట ఆళ్వారు స్వామి కూడా ఉన్నాడు. పళ్ళు తోముకోవడా నికిచ్చే బొగ్గుతో జైలు గోడల మీద పద్యాలు రాసి దెబ్బలు తిన్నాడు.

 మంచి ఉపన్యాసకుడు. భావప్రేరిత ప్రసంగాలతో ఊరూరా సాంస్కృతిక చైతన్యం రగిలించాడు. ఆంధ్ర సారస్వత పరిషత్తు నిర్మాతల్లో ఒకడు.  

 1953లో తెలంగాణ రచయితల సంఘాన్ని స్థాపించి అధ్యక్షుడుగా జిల్లాల్లో సాహితీ చైతన్యాన్ని నిర్మించాడు.

ఆంధ్రప్రదేశ్ ఆస్థాన కవిగా  1977 ఆగష్టు15  నుండి  1983 వరకు పనిచేసాడు. రాష్ట్ర, కేంద్ర సాహిత్య అకాడమీ బహుమతు లు గెల్చు కున్నాడు. అనేక సినిమాలకు గీతాలు రచించి అభిమానుల్ని సంపాదించు కున్నాడు.

 మీర్జాగాలిబ్ ఉర్దూ గజళ్ళను తెలుగులోకి గాలిబ్ గీతాలు పేర అనువదించాడు. తల్లి మీద, తల్లి తెలంగాణ మీద ఆయన రచించిన పద్యాలు ఇప్పటికీ ఎందరికో ఉత్తేజాన్ని కలిగిస్తున్నాయి.

రచనలు..  కవితా సంపుటాలు


అగ్నిధార(రాచరిక వ్యవస్థ అరాచకత్వం ఆయన గుండెకు కల్గించిన గాయాల నుంచి వెలువడిన మొదటి కావ్యం అగ్నిధార గీతాల సంకలనం),మహాంధ్రోదయం,రుద్రవీణ,మార్పు నా తీర్పు,ఆలోచనాలోచనాలు,ధ్వజమెత్తిన ప్రజ..కవితా పుష్పకం: ఆంధ్ర ప్రదేశ్ సాహిత్య అకాడమీ పురస్కార గ్రహీత , తిమిరంతో సమరం: కేంద్ర సాహిత్య అకాడమీ పురస్కార గ్రహీత.

  ఓ జనతా, నతాంజలి పుటోజ్వల, దివ్య కవోష్ణ రక్త ధారాజలసిక్త, పాదకమల ద్వయ శోభ మనోజ్ఞ దేహ రేఖా జయభారతీ.., యుగ యుగమ్ముల పున్నెపు పంట వీవు, నీ పూజకు తెచ్చినాడనిదె పొంగిన గుండియ నిండు పద్ద్దెముల్.. ఇవి దాశరథి గుండె నుంచి పొంగివచ్చిన కమనీయ కవితా ధారల మచ్చుతునకలు.

తెలుగుజాతి ఆత్మకథ లాగా ఉంటుంది కింది పద్యం..
ఎవరు కాకతి! ఎవరు రుద్రమ!
ఎవరు రాయలు! ఎవరు సింగన!
అంతా నేనే! అన్నీ నేనే!
అలుగు నేనే! పులుగు నేనే!
వెలుగు నేనే! తెలుగు నేనే!

ఆ చల్లని సముద్ర గర్భం...
ఆ చల్లని సముద్ర గర్భం దాచిన బడబానలమెంతో
ఆ నల్లని ఆకాశంలో కానరాని భాస్కరులెందరో ||ఆ చల్లని||

నిరంకుశ నిజాము పాలన గురించి..
ఓ నిజాము పిశాచమా, కానరాడు
నిన్ను బోలిన రాజు మాకెన్నడేని
తీగలను తెంపి అగ్నిలో దింపినావు
నా తెలంగాణ కోటి రతనాల వీణ

ఎముకల్ మసిచేసి పొలాలు దున్ని
భోషాణములన్ నవాబునకు
స్వర్ణము నింపిన రైతుదే
తెలంగాణము రైతుదే

అలాగే..1961లో ఇద్దరు మిత్రులు సినిమాతో ప్రారంభ మై, కొన్ని వందల పాటలను రచించి తెలుగు సినీ సాహిత్యానికి సేవచేశారు.

రాచరిక పాలనను అంతంచేసి తన జన్మభూమి తెలంగాణ ప్రజలకు విముక్తి కలిగించడానికి మహాకవి దాశరథి సాయుధ పోరాటానికి నాడు అండగా నిలిచినా ఆయన అచ్చమైన గాం ధేయవాది, భారతజాతీయతా భావం మూర్తీభవించిన అకళంక దేశభక్తుడు.

అనారోగ్యం పీడించి 1987 నవంబర్ 5న హైదరాబాద్‌లో అస్తమించారు.గత పాలకుల హయాంలో అవమానానికి గురైన మహాకవి దాశరథిని తెలంగాణ ప్రభుత్వం ఘనంగా సత్కరిస్తున్నది.

(జూలై 22,1925 - నవంబర్ 5, 1987)