రాజ్యాంగ ప్రవేశిక - రాజ్యాంగ లక్షణాలు

భారత రాజ్యాంగానికి క్లుప్తమైన ప్రవేశికగా భారత రాజ్యాంగ పీఠికను రూపొందించారు. దీనినే రాజ్యాంగ ప్రవేశిక, ప్రస్తావన, మూలతత్వం, ఉపోద్ఘాతం, పరిచయం, ముందుమాట అని కూడా అంటారు.

చారిత్రక నేపథ్యం:

జవహర్‌లాల్ నెహ్రూ 1946 డిసెంబర్ 13న రాజ్యాంగ పరిషత్‌లో ప్రవేశపెట్టిన ఆశయాల తీర్మానమే ప్రవేశికకు మూలం.
పీఠిక అసలు స్వరూపంలో సర్వసత్తాక ప్రజాస్వామ్య గణతంత్ర దేశంగా భారతదేశాన్ని గుర్తిస్తే, ఆ వాక్యానికి లౌకికవాద, సామ్యవాద పదాలను 42వ రాజ్యాంగ సవరణ ద్వారా చేర్చబడ్డాయి.
పీఠిక పుటను, మిగతా రాజ్యాంగంతో సహా, ప్రసిద్ధ చిత్రకారుడు బెవహర్ రామ్మనోహర్ సింహా రూపొందించారు.

రాజ్యాంగ పీఠిక పాఠ్యం:

భారత ప్రజలమైన మేము, భారతదేశాన్ని సర్వసత్తాక సామ్యవాద లౌకిక ప్రజాస్వామ్య గణతంత్ర రాజ్యంగా నిర్మించుకోవడానికి, పౌరులందరికీ:
సాంఘిక, ఆర్థిక, రాజకీయ న్యాయాన్ని;
ఆలోచన, భావప్రకటన, విశ్వాసం, ధర్మం, ఆరాధనల స్వాతంత్ర్యాన్ని ;
అంతస్తుల్లోనూ, అవకాశాల్లోనూ, సమానత్వాన్ని చేకూర్చడానికి;, వారందరిలో
వ్యక్తిత్వ గౌరవాన్ని, జాతీయ సమైక్యతను సంరక్షిస్తూ సౌభ్రాతృత్వాన్ని పెంపొందించడానికి;
మన ఈ రాజ్యాంగ పరిషత్ లో 1949, నవంబర్ 26వ తేదీన ఎంపిక చేసుకొని, శాసనంగా రూపొందించుకున్న ఈ రాజ్యాంగాన్ని మాకు మేము సమర్పించుకుంటున్నాము.

ప్రవేశిక ప్రధానంగా 4 అంశాల గురించి తెలుపుతుంది..
1.అధికారానికి మూలం
2. రాజకీయ స్వభావం
3. రాజ్యాంగ ఆశయాలు
4. రాజ్యాంగం అమల్లోకి వచ్చిన తేది

భారత ప్రజలమైన మేము
ప్రవేశికలోని ‘భారత ప్రజలమైన మేము’ అనే పదం రాజ్యాంగానికి ప్రజలే ఆధారమని తెలుపుతుంది. ‘శాసనం చేసుకొని మాకు మేము సమర్పించుకుంటున్నాం’ అనే భావన రాజ్యాంగ పరిషత్తు ప్రజలకు ప్రాతినిధ్యం వహిస్తుందని వివరిస్తుంది.

సర్వసత్తాక
భారతదేశం ఒక సర్వసత్తాక దేశం అనగా దేశంలోని అన్ని వ్యవహారాలు దేశమే సలుపగలదు, బయటివారెవరూ దేశ వ్యవహారాలను నిర్దేశించలేరు. దేశంలోని అన్ని వ్యవహారాలు అనగా కేంద్ర ప్రభుత్వం లేదా భారత రాజ్యాంగం దేశాన్ని నడిపిస్తుంది అని, అందుకు రాష్ట్ర ప్రభుత్వాలు, క్షేత్ర ప్రభుత్వాలు, క్షేత్ర స్థాయి న్యాయస్థానాలు, రాష్ట్ర స్థాయి న్యాయస్థానాలు సహకరిస్తాయని అర్ధం. అలానే బయటివారు నిర్దేశించరు అనగా వేరే దేశాల సత్తా మనపై లేదని.

సామ్యవాద
ఈ పదం 42వ రాజ్యాంగ సవరణలో చేర్చినప్పటికీ, రాజ్యాంగంలోని కొన్ని ఆదేశిక సూత్రాల ద్వారా మొదటి నుంచి మన దేశం సామ్యవాద దేశమేనని తెలుస్తున్నది. సామ్యవాదమంటే రాజ్యాంగం ప్రకారం ప్రజాస్వామ్య సామ్యవాదమని అర్ధం. అనగా సామ్యవాద లక్ష్యాలను ప్రజాస్వామ్య పద్ధతిలో, సహజ పరిణామగతిలో, అహింసాపరంగా సాధించాలి. సామ్యవాద దేశంలో సంపాదనను, సంపదను సమానంగా ప్రజలకు పంచాలి. అతికొద్ది మంది చేతుల్లో డబ్బు, పరపతి, సంపద ఉండిపోకూడదు. భూమి, పరిశ్రమల, పెట్టుబడుల పై ప్రభుత్వం నియంత్రణ చేస్తూ అందరికీ సమాన హక్కు ఉండేలా చూడాలి.

లౌకిక
లౌకిక దేశమనగా ప్రజలకు, ప్రభుత్వానికి గల అనుసంధానం కేవలం రాజ్యాంగం, చట్టం న్యాయం ద్వారా ఉండాలి. 42వ రాజ్యాంగ సవరణ ద్వారా ఈ పదం పీఠికలోకి చేర్చబడింది. ప్రజల మతాల ఆధారంగా ఎక్కువ తక్కువలు ఉండవు. అన్ని మతాలు సమానంగా గౌరవించబడతాయి, దేశానికి అధికార మతమంటూ ఏదీ లేదు. పౌరులందరూ వారికి ఇష్టమున్న మతాన్ని నమ్మి, ఆచరించి, పెంపొందించుకోవచ్చు.

ప్రజాస్వామ్య
భారతదేశంలో ప్రజలే ప్రభువులు (దేశానికి స్వాములు), అందువలన భారతదేశం ఒక ప్రజాస్వామ్య దేశం. ప్రజల నుండే పాలకులు ఎన్నికల విధానం ద్వారా ఎన్నుకోబడతారు. ఒక వ్యక్తి - ఒక వోటు అనే సిద్ధాంతం పై భారత ప్రజాస్వామ్యం ఆధారపడి ఉంది. భారతదేశ పౌరుడై, 18 ఏళ్ళు నిండిన ప్రతి వ్యక్తి, చట్టం ద్వారా నిలుపుదల లేని సందర్భంలో, వోటు వేసే హక్కును పొందుతాడు. ప్రజాస్వామ్యం కేవలం రాజకీయ పరంగానే కాకుండా సామాజిక, ఆర్ధిక పరంగా కూడా అన్వయించుకోవాలి.

గణతంత్రం
గణతంత్ర ప్రభుత్వంలో, దేశాధినేతను ప్రజలే ఎన్నుకుంటారు, వారసత్వ రాచరికంగానో, నియంత నియంత్రణలోనో ఉండదు. ఈ పదం చెప్పేదేమిటంటే ప్రభుత్వం ఏ ఒక్కరి సొత్తు కాదు. ఒక పరిమిత కాలం వరకు ప్రజల ద్వారా నేరుగా గానీ, పరోక్షంగా గానీ, దేశాధినేత ఎన్నుకోబడతాడు.

న్యాయం
భారతదేశం తన పౌరులకు సామాజిక, ఆర్ధిక, రాజకీయ న్యాయాన్ని అందించేందుకు నిరంతరం పాటు పడుతుంది.
(i) సామాజిక న్యాయం:
సామాజిక న్యాయమనగా సమాజంలో ఎలాంటి పై తరగతి వర్గాలు ఉండకపోవటమే. కుల, సంప్రదాయ, మత, వర్ణ, లింగ, స్థాన భేదాల ఆధారంగా ఎవరినీ ఎక్కువ తక్కువ చేసి చూడకూడదు. సమాజంలోని అన్ని రకాల దోపిడీలను నిర్మూలించడమే భారతదేశ పంథా.
(ii) ఆర్ధిక న్యాయం:
ఆర్ధిక న్యాయమనగా జీతం, ఆస్తులు, ఆర్ధిక హోదా ఆధారంగా స్త్రీ పురుషుల మధ్య ఎలాంటి వ్యత్యాసాన్ని చూపకపోవడం. అందరికీ సమానంగా సంపద పంచుతూ, ఆర్ధిక సమానత్వం తెస్తూ, వస్తువుల తయారీ-పంపిణీలలో ఏకాధిపత్యాన్ని నిర్మూలిస్తూ, ఆర్ధిక వనరులను వికేంద్రీకరిస్తూ, అందరికీ ఆర్ధికంగా బాగుపడేందుకు సమాన అవకాశాలను అందివ్వడమే భారత ప్రభుత్వ లక్ష్యం. తద్వారా అందరికీ గౌరవంగా జీవనోపాధి సంపాదించుకునేందుకు అవకాశాలివ్వాలి.
(iii) రాజకీయ న్యాయం:
రాజకీయ న్యాయమనగా సమానంగా, స్వేచ్ఛగా, న్యాయంగా అవకాశాలు ప్రజలకు కల్పిస్తూ వారిని రాజకీయాలలో పాల్గొనేలా చేయడం. ఎలాంటి పక్షపాతం లేకుండా అందరికీ సమానంగా రాజకీయ హక్కులు ప్రదానం చేయటమే లక్ష్యం. భారత రాజ్యాంగం భారత పౌరులందరికీ రాజకీయాల్లో పాల్గొనే హక్కును, స్వేచ్ఛను అందించే ఉదార ప్రజాస్వామ్యాన్ని అందిస్తున్నది.

ప్రవేశికపై ప్రముఖుల అభిప్రాయాలు
రాజ్యాంగానికి ప్రవేశిక ఆత్మ లాంటిది - జస్టిస్ హిదయతుల్లా
ప్రవేశిక భారత ప్రజాస్వామ్య గణతంత్రానికి రాజకీయ జాతకం - కె.ఎం. మున్షీ
ప్రవేశిక మన కలలకు, ఆలోచనలకు రాజ్యాంగంలో వ్యక్తీకరించుకున్న అభిమతం. - అల్లాడి కృష్ణస్వామి అయ్యర్

పీఠిక రాజ్యాంగంలో అంతర్గత భాగము
బేరూబారీ కేసు తీర్పులో భారత అత్యున్నత న్యాయస్థానం పీఠికను రాజ్యాంగంలో అంతర్గత భాగంగా గుర్తించరాదని చెప్పింది. అదే న్యాయస్థానం 1973లో కేశవానంద భారతి కేసులో అంతకు ముందు చెప్పిన తీర్పులోని వ్యాఖ్యను వెనక్కి తీసుకుంటూ రాజ్యాంగంలోని అయోమయాన్ని కలిగించే భాగాలలో స్పష్టత కోసం పీఠికను ఆధారం చేసుకోవాలని తీర్పు చెప్పింది. 1995లో భారత ప్రభుత్వం-ఎల్ఐసీ మధ్య నడిచిన కేసు తీర్పులో మరొకసారి, పీఠిక రాజ్యాంగంలో అంతర్గత భాగమని తెలిపింది.