బడ్జెట్ పదజాలం

  • భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 202 ప్రకారం బడ్జెట్ అంటే వార్షిక సంవత్సరానికి సంబంధించిన ఆదాయ, వ్యయాల పట్టిక. 
  • ఒక ఆర్థిక సంవత్సరంలో ప్రభుత్వానికి వచ్చే ఆదాయం- ప్రభుత్వం ఖర్చుపెట్టే మొత్తాలు ఇందులో పొందుపరుస్తారు. 
  • ఆర్థిక సంవత్సరం మన దేశానికి ఏప్రిల్ నుంచి వరుసగా 12 నెలలు అంటే ఆ తదుపరి సంవత్సరం మార్చి వరకూ కొనసాగుతుంది. 
  • కొన్ని దేశాలు క్యాలెండర్ ఇయర్‌నే ఆర్థిక సంవత్సరంగా పరిగణిస్తాయి. 
  • ‘క్రితం ఆర్థిక సంవత్సరం ఆదాయం-వ్యయం-మిగులు, ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ఆదాయం-వ్యయం-మిగులు, వచ్చే ఆర్థిక సంవత్సరం ఆదాయం-వ్యయం-మిగులు’ అన్న అంశం ప్రాతిపదికన పలు అంచనాలు, సవరణలతో ఈ బడ్జెట్ రూపొందుతుంది.
  •  బడ్జెట్ అనే మాట ‘బొగెట్టీ’ అనే ఫ్రెంచి పదం నుంచి ఆవిర్భవించింది. 
  • బొగెట్టీ అంటే తోలుసంచి అని అర్థం. పూర్వం ఆదాయ వ్యయాలకు సంబంధించిన లెక్కల పత్రాల్ని సభకు తోలు సంచిలో తీసుకువచ్చేవారు కాబట్టే ఈ మాట వాడుకలోకి వచ్చింది.

 

మూలధన బడ్జెట్
        
మూలధన ఆదాయ, వ్యయ పట్టికగా చెప్పుకోవచ్చు. వార్షిక బడ్జెట్‌లో మూలధన బడ్జెట్‌తోపాటు రెవెన్యూ బడ్జెట్ కూడా ఉంటుంది. మూలధన ఖాతాలో వసూలయ్యే ఆదాయం, ఖర్చులు మూలధన బడ్జెట్‌లో ఉంటాయి. రెవెన్యూ వసూళ్లు, ఖర్చులకు సంబంధించిన వివరాలు రెవెన్యూ బడ్జెట్‌లో ఉంటాయి.

 

మూలధన వ్యయం
        ఆస్తులు సమకూర్చుకునేందుకు, వాటాలు కొనుగోలు చేసేందుకు ప్రభుత్వం చేసే ఖర్చు ఇది.

 

బడ్జెట్ ఫండ్స్
          బడ్జెట్ కన్సాలిడేటెడ్ ఫండ్, కంటింజెన్సీ ఫండ్, పబ్లిక్ అకౌంట్.. ఇలా మూడు భాగాలుగా ఉంటుంది.
వసూళ్లు-వ్యయాలు అంటూ రెండు విభాగాలుగా ఈ మూడూ భాగాలూ రూపొందుతాయి. కన్సాలిడేటెడ్ ఫండ్, కంటెజెన్సీ ఫండ్ నుంచి వ్యయాలకు పార్లమెంటు ఆమోదం తప్పనిసరి.

కన్సాలిడేటెడ్ ఫండ్: ప్రభుత్వానికి ఇది ఒక రకంగా ప్రాణం వంటిది. అన్ని రకాల ఆదాయాలు, ప్రభుత్వం తీసుకున్న రుణాలు, ప్రభుత్వం ఇచ్చిన రుణాలపై వచ్చే వడ్డీలు ఈ అకౌంట్‌లో చేరిపోతాయి. అలాగే ప్రభుత్వం చేసే అన్ని రకాల ఖర్చులూ ఈ ఫండ్ నుంచే వెచ్చించాలి.

కంటింజెన్సీ ఫండ్: ఇది రూ.500 కోట్లతో ఏర్పాటైన నిధి. ఉన్నట్లుండి అనుకోకుండా ఏర్పడే ఖర్చులకు వినియోగించడానికి ఈ నిధిలోని ధనాన్ని రాష్ట్రపతి సంతకం ద్వారా ప్రభుత్వం వినియోగిస్తుంది. ఈ నిధి నుంచి డబ్బును తిరిగి కన్సాలిడేటెడ్ ఫండ్ నుంచి భర్తీ చేయాల్సి ఉంటుంది.

పబ్లిక్ అకౌంట్: ఈ అకౌంట్‌కు సంబంధించి ప్రభుత్వం ఒక రకంగా బ్యాంకర్‌లాగా పనిచేస్తుంది. పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్ వంటి నిధుల వసూళ్లు ఈ అకౌంట్ కిందకు వస్తాయి.

రెవెన్యూ అకౌంట్, క్యాపిటల్ అకౌంట్
ప్రభుత్వానికి వచ్చే ఆదాయాలు, చేసే వ్యయాలు రెండింటినీ బడ్జెట్‌లో రెండు పద్దులుగా విభజిస్తారు. అందులో ఒకటి రెవెన్యూ అకౌంట్. రెండు క్యాపిటల్ అకౌంట్. అంటే కన్సాలిడేటెడ్ ఫండ్‌లోకి వచ్చీ, పోయే నిధులను రెవెన్యూ బడ్జెట్ (రెవెన్యూ అకౌంట్) క్యాపిటల్ బడ్జెట్ (క్యాపిటల్ అకౌంట్)గా పరిగణించడం జరుగుతుంది.

       రెవెన్యూ విభాగంలోకి వచ్చే ఆదాయాలు, చేసే వ్యయాలు: పన్నుల వంటి అన్ని రకాలు ఆదాయాలు ఇక వేతనాలు, సబ్సిడీలు, వడ్డీ చెల్లింపులు వంటి అన్ని రకాల వ్యయాలు అన్నీ ఈ అకౌంట్‌లోకి చేరతాయి.

      క్యాపిటల్ విభాగంలోకి వచ్చే ఆదాయాలు, చేసే వ్యయాలు: ప్రభుత్వ కంపెనీల్లో వాటాల విక్రయం వంటి అంశాల ద్వారా వచ్చే ఆదాయాలు, వడ్డీల ద్వారా ఆదాయాలు తెచ్చుకోడానికి ఉద్దేశించి ఇచ్చే రుణ వ్యయాలు అన్నీ ఈ అకౌంట్‌లో చేరతాయి.

 

పబ్లిక్ డెట్
         ప్రభుత్వం వివిధ కార్యక్రమాల కోసం అప్పులు చేస్తుంది. అది నేరుగా ప్రజలపై భారంగానే భావిస్తారు. మొత్తం ప్రభుత్వ అప్పులను దేశ జనాభాతో భాగించగా వచ్చేదాన్ని దేశ ప్రజల తలసరి అప్పుగా అంటే ఒకొక్కరి తలమీద ఎంత అప్పు భారం ఉందన్న విషయం తెలుస్తుంది. ప్రభుత్వం దేశీయంగా, విదేశాల నుంచి కూడా అప్పులను స్వీకరిస్తుంది. ఈ మొత్తాన్ని పబ్లిక్ డెట్‌గా వ్యవహరిస్తారు.

 

ద్రవ్య లోటు
         సాధారణంగా ప్రభుత్వం తన ఆదాయాన్ని మించి వ్యయం చేస్తుంది. ఇలా అదనంగా కావల్సిన మొత్తాన్ని రుణాల ద్వారా సమీకరిస్తుంది. ఆదాయం కంటే చేసిన అధిక వ్యయాలనే ద్రవ్యలోటు (ఫిస్కల్ డెఫిసిట్)గా వ్యవహరిస్తారు.

 

రెవిన్యూ లోటు
        ప్రభుత్వం తన రెవిన్యూ ఆదాయం కంటే అధికంగా రెవిన్యూ వ్యయాలను చేసినప్పుడు ఏర్పడే లోటును రెవిన్యూ లోటుగా పరిగణిస్తారు. సాధారణంగా ఈ రెవిన్యూలోటు సున్నాగా ఉండాలి. అలా ఉం టే ప్రభుత్వం చేసిన రెవిన్యూ వ్యయం కేవలం వినియోగానికి కాకుండా ఒక సంపదను సృష్టించినట్లు లెక్క.

 

జీడీపీలో లోటు శాతం
        
ద్రవ్యలోటు ఎంత ఉందన్నది శాతాల్లో లెక్కిస్తారు. దేశ స్థూల జాతీయోత్పత్తిలో ఈ లోటు శాతం ఎంత ఉందన్నది కీలకం. ఉదాహరణకు ప్రస్తుతం మన ద్రవ్యలోటు జీడీపీలో 5.1 శాతంగా ఉంటుందని ఎకనామిక్ సర్వే అంచనా వేసింది.

 

ట్రెజ‌రీ బిల్స్
          ఒక సంవత్సరం లోపు కాలపరిమితి ఉన్న బాండ్లను ట్రెజరీ బిల్స్‌గా పేర్కొంటారు. వసూళ్ళు, చెల్లింపుల్లో వచ్చే తేడాలను సర్దుబాటు చేసుకోవడానికి ట్రెజరీ బిల్స్‌ను ఆశ్రయిస్తారు. ఈ బాండ్స్ కాలపరిమితి ఒక సంవత్సరం కంటే ఎక్కువగా ఉంటే వాటిని డెట్ సెక్యూరిటీస్‌గా పేర్కొంటారు.

 

వేస్ అండ్ మీన్స్ అడ్వాన్స్
          రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాలు స్వల్పకాలిక చెల్లింపుల్లో తేడా వచ్చినప్పుడు ఆర్‌బీఐ సహకారాన్ని తీసుకుంటాయి. ఇలా ఆర్‌బీఐ నుంచి ప్రభుత్వాలు తీసుకునే స్వల్ప కాలిక రుణాలను వేస్ అండ్ మీన్స్ అడ్వాన్సెస్‌గా వ్యవహరిస్తారు.

 

ప్రణాళికా వ్యయం:
        ప్రభుత్వం ఆదాయ వనరులను, ఆస్తులను సృష్టించుకునేందుకు చేసే వ్యయం ఇది. రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల ప్రణాళికలకు చేసే కేటాయింపులు ఈ ఖాతాలో ఉంటాయి.

 

ప్రణాళికేతర వ్యయం
          ప్రభుత్వ ఉద్యోగుల జీతభత్యాల చెల్లింపులు, రక్షణ, పోలీసు వ్యవస్థల నిర్వహణ, ఎన్నికల నిర్వహణ, కళలు, క్రీడలు, కుటుంబ సంక్షేమం, సమాచార ప్రసార, పర్యాటక రంగాలు, విదేశీ వ్యవహారాలు, కార్మిక సంక్షేమం, వ్యవసాయ రంగాలకు వెచ్చించే నిధులు, వడ్డీలు, రుణ చెల్లింపులు ప్రణాళికేతర ఖాతాలోకి వస్తాయి. రాష్ట్ర ప్రభుత్వాలకు ఇచ్చే ప్రణాళికేతర గ్రాంటులు కూడా ఈ ఖాతాలోనే ఉంటాయి.

 

సంచిత నిధి
          అన్ని రకాల వసూళ్లు, ఆదాయాలు, రుణాల ద్వారా వచ్చిన సొమ్ము ఈ నిధి కింద జమ అవుతుంది. ఈ నిధి నుంచి ఖర్చు చేయడానికి పార్లమెంటు అనుమతి తప్పనిసరిగా తీసుకోవాలి. ఇందులో రెండు పద్దులుంటాయి.
1. రెవెన్యూ వసూళ్లు-రెవెన్యూ వ్యయం. |
2. మూలధన వసూళ్లు-మూలధన వ్యయం.

 

ప్రభుత్వ ఖాతా
           సంచిత నిధిలో జమయ్యే వసూళ్లు మినహా ప్రభుత్వం వద్దకు వచ్చే ఇతర అన్ని రకాల నిధులు ఈ ఖాతాలో జమ అవుతాయి. పార్లమెంటు అనుమతి లేకుండానే ఈ ఖాతాలోని నిధులను ఉపయోగించుకోవచ్చు. రిజర్వ్ బ్యాంకు నుంచి, పీఎఫ్ (భవిష్య నిధి) నుంచి తీసుకునే రుణాలను ఈ ఖాతా కింద ఖర్చు చేస్తారు. ఈ సొమ్మును మళ్లీ చెల్లించాల్సి ఉంటుంది.