పన్నులు

పన్ను లక్షణాలు

  • ప్రజల ఇష్టాయిష్టాలతో సంబంధం ఉండదు.
  • పన్ను చెల్లింపులో ప్రత్యక్ష ప్రతిఫలం ఉండదు.
  • ఇందులో త్యాగం ఇమిడి ఉంటుంది.
  • ప్రజల ప్రయోజనాల కోసమే పన్నులను విధిస్తారు.
  • పన్నులు నిర్బంధ చెల్లింపులు

 

ప్రత్యక్ష పన్నులు (డెరైక్ట్ ట్యాక్సెస్):
        వ్యక్తులు, సంస్థలపై విధించే పన్నులను ప్రత్యక్ష పన్నులంటారు. అంటే, పన్ను తొలి, తుది భారాన్ని ఒకే వ్యక్తి/ సంస్థ భరిస్తే అది ప్రత్యక్ష పన్ను. ఈ పన్ను భారాన్ని ఇతరులకు బదిలీచేసే అవకాశం ఉండదు. ఆదాయపు పన్ను, ఆస్తి పన్ను, వృత్తి పన్ను, సంపద పన్ను, కార్పొరేట్ ట్యాక్స్, గిఫ్ట్ ట్యాక్స్, స్టాంప్ డ్యూటీ, ఎస్టేట్ డ్యూటీ, క్యాపిటల్ గెయిన్స్ ట్యాక్స్, వ్యయంపై పన్ను... ఇవన్నీ ప్రత్యక్ష పన్నులు.

 

ఆదాయపు పన్ను
         ఒక వ్యక్తి తన లేదా హిందూ అవిభక్త కుటుంబంలోని కర్త తన ఆదాయంపై చెల్లించే పన్ను. ఆదాయాన్ని బట్టి ఈ చెల్లించే పన్ను మారుతుంటుంది.

 

కార్పొరేట్ ట్యాక్స్
          ప్రభుత్వానికి అత్యధికంగా ఆదాయం వచ్చే వాటిల్లో ఇదే ప్రధానమైనది. కంపెనీలు ఆర్జించిన లాభాలపై చెల్లించే పన్నును కార్పొరేట్ ట్యాక్స్‌గా పరిగణిస్తారు.

 

మినిమమ్ ఆల్టర్‌నేట్ ట్యాక్స్
          కొన్ని కంపెనీలు లాభాలను ఆర్జించినా పన్ను చెల్లించనవసరం ఉండదు. అటువంటి కంపెనీలు వాటి లాభాల్లో కనీసం చెల్లించాల్సిన పన్నుని మినమమ్ ఆల్టర్‌నేట్ ట్యాక్స్ (మ్యాట్)గా పేర్కొంటారు.

 

లావాదేవీలపై పన్ను
          స్టాక్ ఎక్స్ఛేంజ్‌ల ద్వారా షేర్లు, మ్యూచువల్ ఫండ్ యూనిట్ల క్రయవిక్రయాలు వంటి లావాదేవీలపై చెల్లించే పన్నుని సెక్యూరిటీ ట్రాన్సాక్షన్ ట్యాక్స్‌గా పేర్కొంటారు.

 

క్యాపిటల్ గెయిన్ ట్యాక్స్
          షేర్లు, స్థిరాస్తి, వ్యాపారం వంటి విక్రయాలు చేసినప్పుడు పొందే లాభాలపై చెల్లించే పన్నును క్యాపిటల్ గెయిన్ ట్యాక్స్ అంటారు.

 

గిఫ్ట్ ట్యాక్స్
         1958లో ప్రవేశపెట్టారు. మొదట్లో బహుమతి దాతపై ఈ పన్ను విధించే వారు. 1990-91 నుంచి బహుమతి గ్రహీతల నుంచి వసూలు చేస్తున్నారు.

 

డివిడెండ్ డిస్ట్రిబ్యూషన్ ట్యాక్స్
          ఇన్వెస్టర్లు అందుకునే డివిడెండ్‌పై ఎటువంటి పన్ను చెల్లించనవసరం లేదు కానీ.. ఇచ్చే కంపెనీ డివిడెండ్ మొత్తంపై ప్రభుత్వానికి పన్ను చెల్లించాలి.

 

వెల్త్ ట్యాక్స్ (సంపద పన్ను)
         ఒక వ్యక్తి, హెచ్‌యూఎఫ్ లేదా సంస్థ వ్యక్తిగత ఆస్తి విలువ రూ.30 లక్షలు దాటితే, ఆ మొత్తం మీద ఒక శాతం పన్ను చెల్లించాలి.

 

పరోక్ష పన్నులు (ఇన్‌డెరైక్ట్ ట్యాక్సెస్):
         పన్ను తొలి భారం ఒకరిపైన, తుది భారం మరొకరిపైన పడితే, అంటే, పన్ను భారాన్ని బదిలీ చేయడానికి వీలుంటే దాన్ని పరోక్ష పన్ను అంటారు. సెంట్రల్ ఎక్సైజ్ డ్యూటీ, కస్టమ్స్ డ్యూటీ, సెంట్రల్ సర్వీస్ ట్యాక్స్, రాష్ట్రాలు విధించే అమ్మకం పన్ను, స్టేట్ ఎక్సైజ్ డ్యూటీ, వాహనాలపై పన్ను, వినోదపు పన్ను... ఇవన్నీ పరోక్ష పన్నులు.

 

కస్టమ్స్ సుంకం
         వస్తువుల ఎగుమతి, దిగుమతులపై విధించే పన్ను. ఇది ప్రభుత్వం ఆదాయ వనరుగానే కాకుండా దేశీయ పరిశ్రమల రక్షణకు, చెల్లింపుల సమతౌల్యం (దిగుమతులు, ఎగుమతుల విలువల మధ్య అంతరం) లోటును తగ్గించేందుకు దిగుమతి సుంకం విధిస్తారు. ప్రభుత్వ రాబడిని, దేశంలో వస్తు లభ్యతను కల్పించేందుకు ఎగుమతి పన్ను విధిస్తారు.

 

ఎక్సైజ్ సుంకం
        దేశీయంగా ఉత్పత్తి అయ్యే వస్తువులపై ఈ సుంకాన్ని విధిస్తారు.

 

సర్వీస్ ట్యాక్స్
        వివిధ సేవలపై ఈ పన్నును విధిస్తారు. ప్రభుత్వ ప్రధాన ఆదాయ వనరుల్లో సర్వీస్ ట్యాక్స్ ఒకటి.

 

జీఎస్‌టీ
          ప్రస్తుతం ఉన్న పరోక్ష పన్నుల విధానాన్ని సమూలంగా మారుస్తూ ఏకీకృత పన్నుల విధానం ఉండే విధంగా గూడ్స్ అండ్ సర్వీస్ ట్యాక్స్ (జీఎస్‌టీ)ని రూపొందించారు. ఇది ఇంకా అమల్లోకి రావాల్సి ఉంది. జీఎస్‌టీ వస్తే వినియోగదారులపై పరోక్ష పన్నుల భారం తగ్గుతుందని అంచనా. దీనిని ప్రపంచంలో తొలిసారిగా ఫ్రాన్స్‌లో అమలు చేశారు.

 

జీఎస్‌టీ ప్రయోజనాలు
         సరళంగా, పారదర్శకంగా ఉంటుంది.
        కేంద్ర, రాష్ట్రస్థాయిల్లో వివిధ రకాల పన్నులను తగ్గిస్తుంది. వివిధ రకాల వస్తువులపై పన్ను రేటు తగ్గుతుంది. ప్రభుత్వానికి పన్ను రాబడులను పెంచుతుంది.

 

పన్నులు ఎవరు విధిస్తారు?
       
రాష్ట్ర ప్రభుత్వాలూ కొన్ని పన్నులను విధించుకోవచ్చు. వాటి ద్వారా వచ్చే ఆదాయాన్ని ప్రభుత్వ కార్యకలాపాలకు ఖర్చుచేసుకోవచ్చు. అవి అమ్మకం పన్ను (వ్యాట్), రాష్ట్ర ఎక్సైజ్ పన్ను, భూమి శిస్తు, వ్యవసాయ ఆదాయంపై పన్ను, వినోద పన్ను.

         కొన్ని పన్నులను కేంద్రమే విధించి... ఆదాయాన్ని రాష్ట్రాలకు పంచుతుంది. అవి యూనియన్ ఎక్సైజ్ డ్యూటీలు, ఆదాయపు పన్ను. ఆర్థిక సంఘం సిఫార్సుల మేరకు వీటి ఆదాయాన్ని రెండు ప్రభుత్వాలూ పంచుకుంటాయి.

         కొన్ని పన్నులను విధించే అధికారం కేవలం కేంద్ర ప్రభుత్వానికే ఉంటుంది. వీటి ద్వారా వచ్చే రాబడి మాత్రం రాష్ట్రప్రభుత్వాలకే చెందుతుంది. అవి... న్యూస్ పేపర్ల అమ్మకాలపై పన్ను, వ్యవసాయ భూమిని మినహాయించి ఇతర సంపదపై ఉండే ఎస్టేట్ డ్యూటీ, టెర్మినల్ ట్యాక్స్, రైల్వే సరకులు, ప్రయాణ ఛార్జీలపై డ్యూటీలు, అడ్వర్‌టైజ్‌మెంట్‌లపై వచ్చే పన్ను, బహుమతి పన్ను.

         మరికొన్ని పన్నుల్ని కేంద్ర ప్రభుత్వమే విధిస్తుంది. కానీ, వాటి వసూలు బాధ్యత మాత్రం రాష్ట్రాలపై ఉంటుంది. అవి... స్టాంపు డ్యూటీలు, వ్యాట్ డ్రగ్స్, కాస్మోటిక్స్‌పై విధించే పన్నులు.