బడ్జెట్ పద్ధతులు

పెర్ఫార్మెన్స్ బడ్జెటింగ్

       ఇందులో ప్రభుత్వ కార్యకలాపాలు, వ్యయాలు పొందుపరుస్తారు. ప్రభుత్వ వ్యయం, పథకాలు, కార్యకలాపాలను ప్రాజెక్టుల పరంగా చూపిస్తారు. వ్యయాల ఆధారంగా అంతర్గత నిర్వహణను మెరుగుపర్చడమే ఈ బడ్జెట్ ముఖ్య స్వభావం. 

       అందుకే ఈ పద్ధతిలో మరింత మెరుగైన నిర్వహణ పద్ధతులు రూపొందించడం, ప్రమాణాలు,యూనిట్ వ్యయాలకు ప్రాధాన్యం ఉంటుంది. మళ్లీ ఇందులో ప్రభుత్వ లక్ష్యాలను బట్టి కొన్ని విధులుగాను, పథకాలు, కార్యకలాపాలుగాను విభజిస్తారు. ఇవన్నీ కొంత నిర్దిష్ట పని ప్రమాణాన్ని సాధించేందుకు నిధులు కేటాయిస్తారు. ఒక్కో మంత్రిత్వ శాఖ కొంత వ్యయంతో కొంత కాల వ్యవధిలో సాధించాల్సిన పనులు బడ్జెట్‌లో చూపిస్తారు. 

       అమలు చేయాలనుకున్న పథకం పరిమాణం, వ్యయం రెండిటికీ ప్రాధాన్యం ఉంటుంది. ఇది వ్యయాలను, ప్రయోజనాలను ఒకేచోట చూపించే కొత్త రకం బడ్జెటింగ్ పద్ధతి. నిధుల కేటాయింపులు, నిర్ణయాలు తీసుకోవడంలో ఈ విధానం ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది.

 

ప్రోగ్రాం బడ్జెటింగ్
        ఈ బడ్జెటింగ్ విధానంలో మొదట లక్ష్యాలను నిర్వచించుకుంటారు. వాటిలో నుంచి కొన్నింటిని ఎంపిక చేసుకుని, వాటిని సాధించే పథకాలను రూపొందిస్తారు. 

         ఇందులో సాధించిన ఫలితాలను కొలిచే పద్ధతులు కూడా ఉంటాయి. ప్రణాళికను ప్రస్తుత సంవత్సరానికే పరిమితం చేయకుండా కొన్నేళ్లకు విస్తరింపచేసి, ప్రణాళిక మొత్తాన్ని కొంత కాల వ్యవధిలో పునఃపరిశీలన చేస్తుంటారు. 

       ఈ పద్ధతిని ఒకే శాఖకు అమలు జరిపితే ప్రోగ్రాం బడ్జెటింగ్ అనీ, అన్ని శాఖలకు అమలుచేస్తే ప్లానింగ్ ప్రోగ్రాం బడ్జెటింగ్ అనీ పిలుస్తారు. రెండు పద్ధతుల వెనుక ఉండే సూత్రం మాత్రం ఒక్కటే. లక్ష్యాలు సాధించే ప్రత్యామ్నాయాలు ఎక్కువ ఉన్నట్లయితే వాటి ఉత్పాదకాలు, ఉత్పత్తుల మధ్య సంబంధాన్ని పరిశీలిస్తారు. 

        గణాంక పద్ధతులు ఉపయోగించి ప్రత్యామ్నాయాలు ఎంపిక చేసి పథకాల పనితీరును అంచనా వేసే ఈ పద్ధతి కొంత మెరుగైనదని చెప్పవచ్చు. 1960 దశకంలో అమెరికా రక్షణశాఖలో ఈ పద్ధతిని ప్రవేశపెట్టారు.

 

ఇంక్రిమెంట్ బడ్జెటింగ్
         బడ్జెటింగ్‌లో వివిధ ఉద్దేశాల కోసం వ్యయాలను పెంచాలా, తగ్గించాలా అనే నిర్ణయాలు ఇందులో ఉంటాయి. కొత్త పథకాలను చేపట్టడం గురించి ఆలోచించకుండా, అమలులో ఉన్న పథకాలకు కేటాయింపులు ఎక్కువ చేయాలా, లేదా అనే విషయాలు ఇందులో నిర్ణయిస్తారు. చాలా పథకాలు ఒకసారి ప్రారంభించాక వాటికి అదనపు కేటాయింపులు అవసరమవుతాయి.

 

జీరోబేస్డ్ బడ్జెటింగ్
        ఇటీవలి అన్ని దేశాల్లో ప్రభుత్వ వ్యయపరిమాణం బాగా పెరిగినందువల్ల.. ప్రభుత్వ వ్యయ ఉత్పాదకతను పెంచి, అనుత్పాదక వ్యయాలను తగ్గించాల్సిన అవసరం ఏర్పడింది. అందువల్ల కొత్త బడ్జెటింగ్ పద్ధతులు రూపొందించుకోవాల్సిన అవసరం ఉత్పన్నమైంది. ఆ కారణంగానే జీరో బేస్ బడ్జెటింగ్ ఏర్పడింది. ఇందులో ప్రతి మేజర్ బడ్జెట్ కేటాయింపు ప్రతిపాదనకు వివరంగా మొదటి నుంచి వివరణ ఇవ్వాల్సి ఉంటుంది. అంటే అదనపు కేటాయింపుల బదులుగా యూనిట్‌లోని ద్రవ్య అవసరాలను మొత్తంగా పరిగణలోకి తీసుకుంటారు.

 

తొలిభారం (ఇంపాక్ట్): ప్రభుత్వం పన్ను విధించినపుడు దాన్ని మొదటగా చెల్లించిన వ్యక్తి భరించే భారమే తొలి భారం. తుదిభారం (ఇన్సిడెన్స్): చిట్టచివరిగా పన్ను భరించే వారిపై పడే భారం.

ఉదా: వినోదపు పన్ను తొలి భారాన్ని థియేటర్ యజమాని, తుది భారాన్ని ప్రేక్షకులు భరిస్తారు.