బడ్జెట్ - సందేహాలు

 ఏప్రిల్ 1 లోపు బడ్జెట్ ఆమోదం పొందకపోతే ఏమవుతుంది?

        అన్ని సమస్యల్లాగే దీనికి కూడా ‘ఓటాన్ అకౌంట్’ అనే ఆల్‌టైమ్ పరిష్కారం ఒకటుంది. రాజ్యాంగంలో 116వ అధి కరణ ప్రకారం లోక్‌సభలో ఈ విషయంపై ఓటాన్ అకౌంట్ నిర్వహిస్తారు. దీని ఆధారంగా బడ్జెట్ ప్రతిపాదనలు ఆమోదం పొందే వరకు రెండు నెలల కాలవ్యవధి ఉన్న తాత్కాలిక బడ్జెట్‌ను కేంద్ర అవసరాల కోసం తయారుచేస్తారు.

 

ఆర్థిక మంత్రి ఇచ్చే బడ్జెట్ ప్రసంగాన్ని ఎలా అర్థం చేసుకోవాలి?
         లోక్‌సభలో ఆర్థికమంత్రి ఈ సంవత్సరానికి సంబంధించిన బడ్జెట్‌ను ప్రసంగిస్తారు. ఆ ఉపన్యాసం రెండు భాగాలుగా ఉంటుంది. ఇతర ప్రతినిధులు ఎవరూ అంతరాయం కలిగించకపోతే ఆర్థిక మంత్రి చెప్పాలనుకున్న విషయాన్ని చెప్పి ప్రసంగాన్ని ముగిస్తారు. అదెలాగూ సాధ్యం కాదు కాబట్టి ప్రసంగాన్ని రెండు భాగాలుగా విడగొట్టి అర్థం చేసుకోవడం అవసరం.

మొదటి భాగం

  • అన్ని రంగాల్లో ఉన్న ఆదాయ వ్యయాలను గురించి సంక్షిప్తంగా వివరిస్తారు.
  • కొత్త పథకాలు, ప్రాధాన్యాలు, అభివృద్ధి చేయాల్సిన రంగాలు, అమలు చేయాల్సిన పనుల గురించి చెబుతారు.
  • వీటిని వివరించే ముందు అవసరమైన చోట గతేడాది బడ్జెట్ లెక్కలను కూడా ప్రస్తావిస్తారు.

రెండవ భాగం

  • ఇందులో అన్నీ పన్నులకు సంబంధించిన అంశాలే ఉంటాయి.
  • కొత్త పన్నులు, పన్నుల ద్వారా వచ్చిన ఆదాయం, పన్ను తగ్గింపు, పెంపుల అమలు వంటి వివరాలన్నీ ఉంటాయి.
  • ప్రతి అంశాన్నీ చదివేముందు దానికి మద్దతిచ్చే చట్టాన్ని పేర్కొంటారు. అలాగే దానికి సంబంధించిన న్యాయపరమైన అంశాలనూ ప్రస్తావిస్తారు.

 

ఆర్థిక రంగం, స్టాక్ మార్కెట్లపై బడ్జెట్ ఎలాంటి ప్రభావం చూపిస్తుంది?
         బడ్జెట్, ఆర్థికరంగం, స్టాక్ మార్కెట్లు.. వీటన్నింటికీ ధనమే మూలం. బడ్జెట్ పూర్తిగా ద్రవ్యానికి సంబంధించిన విషయం. కాబట్టి దీని ప్రభావం మిగతా వాటిపై కచ్చితంగా ఉంటుంది. ఆ ప్రభావం ఎలాంటిదనే విషయం మాత్రం ఆర్థికమంత్రి మీద ఆధారపడి ఉంటుంది. 

        వివిధ రంగాలకు కేటాయించిన మొత్తం ఆధారంగా ఈ ప్రభావాన్ని నిర్ణయించవచ్చు. అభివృద్ధికి పెద్దపీట వేస్తే ఆర్థికాభివృద్ధి, స్టాక్ మార్కెట్లు పుంజుకుంటాయి. అలా కాకుండా ఆకాశమంత అప్పుల చిట్టాను చూపిస్తే రెండూ ఢమాల్‌న కుప్పకూలిపోతాయి.

 

సగటు మనిషిపై బడ్జెట్ ప్రభావం ఎలా ఉంటుంది?
          అవసరమైన వనరులను వాడుకున్నందుకు ప్రతి ఒక్కరూ పన్ను కట్టాల్సిందే. పన్ను ఎంత కట్టాలి అని నిర్ణయించేది బడ్జెట్టే. కాబట్టి సామాన్యులపై బడ్జెట్ ప్రభావం ఉంటుంది. పన్నులు ఎక్కువ ఉంటే ఆర్థికభారం పెరిగినట్లు, లేదంటే తగ్గినట్లు. ఉన్న పన్నుల్లో ఏ ఒక్క పన్ను పెంచినా దాని ప్రభావం సామాన్యుడిపై కచ్చితంగా ఉంటుంది.

 

ప్రతి ఏడాది బడ్జెట్ ప్రవేశ పెట్టడం అవసరమా?
         అవసరమే, రాజ్యాంగంలో 112వ అధికరణ ప్రకారం ఒక ఆర్థిక సంవత్సరం (ఏప్రిల్ 1 నుంచి మార్చి 31)లో ప్రభుత్వం చేసిన ఖర్చు, వచ్చిన ఆదాయం లెక్కలను పార్లమెంట్ ముందు ఉంచాలి. దీన్ని ‘యాన్యువల్ ఫైనాన్షియల్ స్టేట్‌మెంట్’ అంటారు. ఇది రాజ్యాంగంలో బడ్జెట్‌కు మూలరూపం.

 

ఇతర దేశాల్లో కూడా ఇలాగే బడ్జెట్ ప్రవేశపెడతారా?
         ఆర్థిక వ్యవస్థ సంక్షోభం లేకుండా సాగాలంటే బడ్జెట్ అవసరం. అన్ని దేశాలకు బడ్జెట్ తప్పనిసరి. కాకపోతే వారి రాజ్యాంగాలను అనుసరించి ప్రాధాన్యం ఉంటుంది. మనలాగే యూకే, హాంగ్‌కాంగ్, ఐర్లాండ్ దేశాలు బడ్జెట్ ఆమోదం కోసం ఒక సమయాన్ని అనుసరిస్తాయి. కానీ, అమెరికాలో విడిగా బడ్జెట్ డే అంటూ ఒకటి ఉండదు. అవసరమైనపుడు వారి కాంగ్రెస్ కార్యనిర్వాహక శాఖే ఖర్చులు, ఆదాయం లెక్కలు చూసుకుంటుంది.

 

పేదల బడ్జెట్‌గా పేరొందింది ఏది?
       1986లో ఆర్థిక మంత్రిగా వీపీసింగ్ ప్రవేశపెట్టిన బడ్జెట్‌ను ‘పేదల బడ్జెట్’గా పేర్కొంటారు. ఈ బడ్జెట్‌లో రైల్వేపోర్టర్లకు, రిక్షా కార్మికులకు సబ్సిడీలతో కూడిన రుణాలను ప్రకటించారు. చిన్న తరహా పరిశ్రమల కోసం ప్రత్యేక బ్యాంకులను ఏర్పాటుచేశారు. మున్సిపల్ పారిశుధ్య కార్మికుల కోసం ప్రమాద బీమా పథకం ప్రవేశపెట్టారు.

 

బడ్జెట్‌ను ప్రవేశపెట్టే సంప్రదాయం ఎప్పుడు మొదలైంది?
          ప్రతి ఏటా బడ్జెట్‌ను ఫిబ్రవరి నెలాఖరున సాయంత్రం 5 గంటలకు ప్రవేశపెట్టడం ఆనవాయితీగా వస్తోంది. కానీ 2000 యూనియన్ బడ్జెట్ నుంచి మాత్రం ఉదయం 11 గంటలకు ప్రవేశపెట్టే నూతన సంప్రదాయాన్ని యశ్వంత్ సిన్హా ప్రవేశపెట్టారు.

  • 2016 నుంచి వస్తు, సేవల పన్ను (జీఎస్‌టీ)ను అమల్లోకి తెచ్చేందుకు కేంద్రం యత్నిస్తోంది. జీఎస్‌టీ అమల్లోకి వస్తే సెంట్రల్ సేల్స్ ట్యాక్స్, సర్వీస్ ట్యాక్స్, స్టాంప్ డ్యూటీలు జీఎస్‌టీలో విలీనమవుతాయి.)
  • మన దేశంలో వ్యాట్‌ను అమలు చేసిన తొలిరాష్ట్రం హర్యానా. 2003 ఏప్రిల్ 1 నుంచి అక్కడ వ్యాట్ అమల్లో ఉంది. చివరగా, ఉత్తర్‌ప్రదేశ్ 2008 జనవరి 1 నుంచి అమలు చేసింది. దీంతో అన్ని రాష్ట్రాలూ వ్యాట్ పరిధిలోకి వచ్చాయి.

 

డాలర్‌తో రూపాయి విలువ ఎలా నిర్ణయిస్తారు?
        వ్యాపార సంబంధమైన లావాదేవీలు చర్చకు వచ్చినప్పుడు కచ్చితంగా వచ్చే ప్రస్తావన డాలర్. బిజినెస్‌కు సంబంధించిన లాభాలు, నష్టాలు వేటినైనా డాలర్‌తోనే పోలుస్తారు. డాలర్‌తో రూపాయి విలువ మారకాన్ని ఏ అంశాలు ప్రభావితం చేస్తాయో తెలుసుకుందాం..!

 

అంతర్జాతీయ ఆర్థిక పరిస్థితులు
        ప్రస్తుతం అంతర్జాతీయ మార్కెట్లలో వస్తున్న నష్టాలు పెట్టుబడిదారులను ఆందోళనకు గురిచేస్తున్నాయి. దీంతో పెట్టుబడిదారులు భద్రత ఉన్న దేశాల్లో తమ పెట్టుబడులను పెట్టేందుకు ఆసక్తి చూపడంతో డాలర్ విలువ పెరుగుదల కనపడుతోంది.

 

ఆర్థిక విధానం
        ప్రభుత్వం అమలు చేసే ఆర్థిక విధానాలు, ప్రభుత్వ రుణం, ప్రభుత్వ పన్నుల విధానంలో పాటిస్తున్న నియమాలు దేశీయ ఆర్థిక వ్యవస్థపై ప్రభావం చూపిస్తాయి. విదేశీ పెట్టుబడులపై ప్రభుత్వ విధానాలు కూడా రూపాయి విలువను ప్రభావితం చేస్తాయి.

 

అంతర్జాతీయ వాణిజ్యం
         దేశీయంగా ఎగుమతులు తక్కువ స్థాయిలో ఉండటం, దిగుమతులు ఎక్కువ స్థాయిలో ఉండటం వల్ల మనం చెల్లించాల్సిన మొత్తం ద్వారా డాలర్ డిమాండ్ పెరుగుతుంది. భారతదేశంలో అమలవుతోన్న పన్నుల విధానం, వాణిజ్య ప్రభావమూ దీనిపై ఉంటుంది.

 

స్పెక్యులేషన్
        దేశీయ మార్కెట్లలో పెట్టుబడుల ప్రవాహం కూడా రూపాయి మారకం విలువపై ప్రభావం చూపిస్తుంది.

 

వడ్డీరేటు విధానం
         ప్రభుత్వ ఆర్థిక విధానాలు మార్కెట్లలో పెట్టుబడులు పెంచే విధంగా, విదేశీ మారకాన్ని స్వాగతించేలా ఉంటే విదేశీ మారకం దేశంలోకి ప్రవహించడం ద్వారా రూపాయి విలువలో పెరుగుదల అవకాశం ఉంటుంది.

 

ఉన్నత సంస్థల ప్రభావం
       దేశంలో ఉన్నత స్థాయి ప్రభుత్వ సంస్థ తీసుకునే విధానాలు కూడా దేశీయ కరెన్సీపై ప్రభావితం చూపిస్తాయి. మన దేశంలో ఉన్నత స్థాయి సంస్థ రిజర్వు బ్యాంకు తీసుకునే విధానాలు రూపాయి మారకం విలువలో పెరుగుదల, తరుగుదలకు దోహదపడే అవకాశాలున్నాయి.