రాజ్యాంగం.. మహిళల హక్కులు

 

            ప్రస్తుత సమాజంలో మహిళలకు రక్షణ లేకుండా పోతున్నది. ఇంటా.. బయటా నిత్యం ఏదో ఒకచోట వేధింపులు ఎదురవుతూనే ఉన్నాయి. ఈ నేపథ్యంలో భారత రాజ్యాంగంలో అంబేద్కర్ మహిళల రక్షణకోసం రూపొందించిన చట్టాలు, ఐపీసీ సెక్షన్ల గురించి తెలుసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది.

ఏ నేరానికి ఏ శిక్ష..?

- సెక్షన్ 100 : ఆత్మరక్షణ కోసం ఎదుటి వారిపై దాడి చేస్తే తప్పు లేదు. ఆ సమయంలో సదరు వ్యక్తి చనిపోయినా మీకు శిక్ష పడదు.

- 166(బీ) : ఈ సెక్షన్ ప్రకారం బాధితురాలికి ప్రభుత్వ, ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స ఇవ్వకపోతే సిబ్బంది, యాజమాన్యం మీద కేసు వేయవచ్చు.

- 228(ఏ) : లైంగికదాడికి గురైన మహిళ అనుమతి లేకుండా మీడియాలో ఆమె పేరు, ఫొటోలు ప్రచురించరాదు. అలా చేస్తే సదరు సంస్థపై చర్యలు తీసుకోవచ్చు.

- 354 : స్త్రీ శరీరాన్ని లైంగిక ఉద్దేశంతో చూసినా, తాకినా, అవమానపర్చినా, అనుమతి లేకుండా ఫొటో, వీడియో తీసినా ఈ సెక్షన్ కింద ఫిర్యాదు చేయవచ్చు.

- 376 : 18 ఏండ్లలోపు ఉన్న యువతితో సెక్సులో పాల్గొంటే నేరం. ఒకవేళ ఆమె ఇష్ట ప్రకారమే చేసినా సదరు పురుషుడికి ఈ సెక్షన్ కింద ఏడేండ్ల కఠిన కారాగార శిక్ష పడుతుంది.

- 376 : వైద్యం కోసం వచ్చిన మహిళను లైంగికంగా వేధిస్తే ఈ సెక్షన్ ఉపయోగపడుతుంది. దీని ప్రకారం సదరు వ్యక్తి జైలుకు వెళ్లాల్సి వస్తుంది.

- 494 : భార్య ఉండగా మరొకరిని పెండ్లి చేసుకుంటే ఈ సెక్షన్ ప్రకారం సదరు వ్యక్తికి ఏడేండ్ల జైలు శిక్ష పడుతుంది.

- 498(ఏ) : ఓ వివాహితను ఆమె భర్తగానీ, భర్త బంధువులుగానీ శారీరకంగా, మానసికంగా హింసించినా, అందుకు ప్రేరేపించినా, ప్రోత్సహించినా ఈ సెక్షన్ కింద కేసు వేయవచ్చు. కనీసం మూడేండ్ల జైలు శిక్షతోపాటు జరిమానా కట్టాల్సి వస్తుంది.

- 509 : మహిళలతో అవమానంగా మాట్లాడినా, సైగలు చేసినా ఈ చట్టం ప్రకారం శిక్షకు అర్హులు.

- 294 : రోడ్డు మీద నడుస్తుంటే, బస్టాప్లో, ఇంకెక్కడైనా ఒంటరిగా ఉన్నప్పుడు అసభ్యకరంగా పాటలు పాడుతూ ఎవరైనా ఇబ్బంది పెడితే ఈ సెక్షన్ ప్రకారం వారిపై కేసు నమోదు చేయవచ్చు. కనీసం మూడునెలలకు తగ్గకుండా వారికి జైలుశిక్ష పడుతుంది. లేదా జరిమానా కట్టాల్సి ఉంటుంది.

- 354 (డీ) : ఎవరైనా ఉద్దేశ పూర్వకంగా వెక్కిరించినా, అనుకరించినా, వారిపై ఈ సెక్షన్ ప్రకారం ఫిర్యాదు చేయవచ్చు. నిందితులకు 3 నుంచి 5 ఏండ్ల దాకా జైలు శిక్ష పడే అవకాశముంది. మీరు పనిచేసే ప్రదేశాల్లో మీ తోటి ఉద్యోగులుగానీ, మీ బాస్గానీ సెక్స్కోసం ఇబ్బంది పెడితే 2013 వేధింపుల చట్టం ప్రకారం ఫిర్యాదు చేయవచ్చు.

- 499 : ఫొటోలు మార్పింగ్ చేసి ఇబ్బందికరంగా ఇంటర్నెట్లో పెడుతున్న ఘటనలు ఈ మధ్య బాగా వెలుగుచూస్తున్నాయి. ఇలాంటివి మీకు ఎదురైతే ఈ సెక్షన్ ప్రకారం ఫిర్యాదు చేయవచ్చు. నేరం రుజువైతే సదరు వ్యక్తికి రెండేండ్ల జైలు శిక్ష పడుతుంది.

- 354(బీ) : మహిళనుపైనున్న దుస్తులను బలవంతంగా తొలగిస్తే సంబంధిత వ్యక్తికి 3 నుంచి 7 ఏండ్ల దాకా శిక్షపడుతుంది. 13/2013 సవరణ చట్టం ద్వారా ఈ సెక్షన్ అదనంగా చేర్చారు.

- 354(సీ) : మహిళ లేదా విద్యార్థిని అనుమతి లేకుండా ఫొటోలు/వీడియోలు తీసి వాటిని ఇతరులకు పంపించినా మరెలాంటి చర్యలకు పాల్పడినా సంబంధిత వ్యక్తికి ఏడాది నుంచి 3 ఏండ్ల దాకా జైలు శిక్ష పడుతుంది. ఆ వ్యక్తి తిరిగి అదే నేరానికి పాల్పడితే 3 నుంచి 7 ఏండ్ల దాకా శిక్షతోపాటు జరిమానా విధిస్తారు.

- 373 : 18 ఏండ్ల మైనర్ బాలికను కొనుగోలు చేస్తే పదేండ్ల జైలుశిక్షతోపాటు జరిమానా విధిస్తారు.

- 316 : నిండు గర్భవతిని చంపితే సంబంధిత వ్యక్తిపై ప్రాణహరణం కింద నేరం మోపుతారు. ఆమె మరణించడానికి బదులుగా గర్భంలోని శిశువు మతిచెందితే ఈ సెక్షన్ కింద 10 ఏండ్ల దాకా జైలుశిక్ష పడుతుంది.

- 376(బీ): ఒకరికన్నా ఎక్కువ మంది ఓ మహిళపై లైంగికదాడి చేస్తే, ఒక్కొక్కరికీ 20 ఏండ్లకు తగ్గకుండా జీవితఖైదు శిక్ష విధించబడుతుంది. 13/2013 సవరణ చట్టం ద్వారా ఈ సెక్షన్ సవరించారు.

- 366(ఏ) : మైనర్ బాలికను వ్యభిచారానికి ప్రోత్సహించినా, ప్రలోభ పెట్టినా పదేండ్ల జైలు శిక్షతోపాటు జరిమానా విధిస్తారు.

- 366 : స్త్రీలు, బాలికలను బలవంతంగా ఎత్తుకెళ్లి పెండ్లి చేసుకుంటే పదేండ్ల జైలు శిక్షతోపాటు జరిమానా పడుతుంది.