భారతదేశంలో ఉన్న వివిధ యుద్ధ విమానాలు

 

         జూలై 29, 2020న రఫెల్ యుద్ద విమానాలు భారతదేశంలో అడుగెట్టాయి . రఫేల్‌ రాకతో వాయుసేన పోరాట సామర్థ్యం మరింత పెరిగింది. భారత్‌తో కయ్యానికి కాలు దువ్వితే భారీ మూల్యం చెల్లించుకోక తప్పదని శత్రు దేశాలకు గట్టి హెచ్చరిక వెళ్లినట్లయింది. ముఖ్యంగా చైనా, పాక్‌లకు..! ప్రత్యర్థులపై పిడుగుల వానను కురిపిస్తూ.. సుదూర లక్ష్యాలను సైతం అత్యంత కచ్చితత్వంతో ఛేదించగల సత్తా ‘రఫేల్‌’ సొంతం. అయితే- వాయుసేన శక్తి సామర్థ్యాలను పెంచడమే లక్ష్యంగా.. రఫేల్‌ కంటే ముందు కూడా విదేశాల నుంచి పలు రకాల యుద్ధ విమానాలను భారత్‌ సముపార్జించుకుంది. వాటిలో ముఖ్యమైనవి..

 

 సుఖోయ్‌-30 ఎంకేఐ 

          రష్యా నుంచి సముపార్జించుకున్న ఈ యుద్ధ విమానాలు 2002లో భారత అమ్ముల పొదిలో చేరాయి. గాల్లో నుంచి గాల్లోకి, గాల్లో నుంచి భూ ఉపరితలంపైకి దాడి చేయగలవు. వీటిలో రెండు ఇంజిన్లు, రెండు సీట్లు ఉంటాయి. 8 వేల కిలోల ఆయుధ సామగ్రిని మోసుకెళ్లగలవు. గరిష్ఠంగా గంటకు 2,500 కిలోమీటర్ల వేగంతో ప్రయాణిస్తాయి.


మిరాజ్‌-2000

        వాయుసేన వద్ద ఉన్న భీకర యుద్ధ విమానాల్లో ఇదొకటి. ఫ్రాన్స్‌కు చెందిన దసో ఏవియేషన్‌ దీన్ని అభివృద్ధి చేసింది. 1985లో తొలిసారి భారత అమ్ముల పొదిలో చేరింది. ఇది సింగిల్‌ సీటర్‌, సింగిల్‌ ఇంజిన్‌ విమానం. గరిష్ఠంగా గంటకు 2,495 కిలోమీటర్ల వేగాన్ని అందుకోగలదు. ఇందులో రెండు 30 ఎంఎం ఫిరంగులు ఉంటాయి. క్షిపణులనూ మోసుకెళ్లగలదు.


మిగ్‌-27

           సోవియట్‌ యూనియన్‌కు చెందిన మికొయాన్‌-గురెవిచ్‌ డిజైన్‌ బ్యూరో దీనికి రూపకల్పన చేసింది. లైసెన్స్‌ ఒప్పందం ప్రకారం.. హిందుస్థాన్‌ ఏరోనాటిక్స్‌ లిమిటెడ్‌ (హెచ్‌ఏఎల్‌) ఉత్పత్తి చేసింది. ఇది సింగిల్‌ సీటర్‌, సింగిల్‌ ఇంజిన్‌ విమానం. వ్యూహాత్మక దాడుల్లో కీలకంగా పనిచేస్తుంది. గంటకు 1,700 కిలోమీటర్ల గరిష్ఠ వేగంతో దూసుకెళ్లగలదు. నాలుగు వేల కిలోల ఆయుధ సామగ్రిని మోసుకెళ్లగలదు.

 

మిగ్‌-29

          అమెరికాకు చెందిన ఎఫ్‌-15, ఎఫ్‌-16 వంటి ఎఫ్‌-సిరీస్‌ విమానాలకు దీటుగా వీటిని మికొయాన్‌-గురెవిచ్‌ డిజైన్‌ బ్యూరో ఉత్పత్తి చేసింది. భారత వైమానిక దళంలో ఈ యుద్ధ విమానాల సేవలు 1985లో ప్రారంభమయ్యాయి. సుఖోయ్‌ 30 ఎంకేఐ విమానాల తర్వాత రెండో వరుస రక్షణగా వీటిని ఉపయోగిస్తున్నారు. వీటిలో ఒక సీటు, రెండు ఇంజిన్లు ఉంటాయి. గంటకు 2,445 కిలోమీటర్ల గరిష్ఠ వేగంతో ప్రయాణించగలవు. ఈ యుద్ధ విమానాల్లో 30 ఎంఎం ఫిరంగి ఉంటుంది. క్షిపణులనూ తీసుకెళ్లగలదు.


 

జాగ్వార్‌

          బ్రిటిష్‌ రాయల్‌ ఎయిర్‌ ఫోర్స్‌, ఫ్రెంచ్‌ ఎయిర్‌ ఫోర్స్‌ సంయుక్తంగా దీన్ని అభివృద్ధి చేశాయి. గంటకు 1,350 కిలోమీటర్ల గరిష్ఠ వేగాన్ని అందుకోగలదు. సింగిల్‌ సీటర్‌ విమానం. రెండు ఇంజిన్లుంటాయి. శత్రువుల భూభాగాల్లోకి చొచ్చుకెళ్లి దాడులు చేయగలదు. ఇందులో రెండు 30 ఎంఎం తుపాకులుంటాయి. 4,750 కిలోల వరకు బాంబులు, ఇంధనాన్ని మోసుకెళ్లడం దీని ప్రత్యేకత.

 

మిగ్‌-21 బైసన్‌

         మికొయాన్‌-గురెవిచ్‌ డిజైన్‌ బ్యూరో తయారుచేసిన ఈ యుద్ధ విమానాన్ని భారత వైమానిక దళం 1961లో ఎంచుకుంది. సింగిల్‌ సీటర్‌, సింగిల్‌ ఇంజిన్‌ విమానం. భారత వాయుసేనకు ఇది వెన్నెముక వంటిది. గంటకు గరిష్ఠంగా 2,230 కిలోమీటర్ల వేగాన్ని అందుకోగలదు. ఇందులో 23 ఎంఎం ట్విన్‌ బ్యారల్‌ ఫిరంగి ఉంటుంది.


        ఇవి కాకుండా భారదేశ సంస్థ హిందుస్థాన్ ఏరోనాటికల్ సంస్థ తయారుచెసిన 'తేజస్' కూడా ఉంది . తేజస్, భారతదేశం అభివృద్ధి చేసి, తయారు చేసిన యుద్ధ విమానం. డెల్టా వింగ్ కలిగిన ఏక ఇంజను తేజస్, మల్టీరోల్ లైట్ కాంబాట్ యుద్ధ విమానం. దీనిని భారత ఏరోనాటికల్ డెవలప్‌మెంట్ ఏజెన్సీ (ఎడిఎ), హిందూస్తాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ (హెచ్‌ఏఎల్) లు రూపొందించాయి. దీని ప్రధాన వినియోగదారులు భారత వైమానిక దళంభారత నావికాదళాలు. పాతవై, వయసు పైబడుతున్న మిగ్ -21 యుద్ధ విమానాల స్థానాన్ని పూరించేందుకు, 1980 లలో మొదలుపెట్టిన లైట్ కంబాట్ ఎయిర్‌క్రాఫ్ట్ (ఎల్‌సిఎ) కార్యక్రమం నుండి రూపుదిద్దుకున్న విమానమే తేజస్. 2003 లో, ఈ యుద్ధవిమానానికి అధికారికంగా "తేజస్" అని పేరు పెట్టారు.


రఫెల్ గురుంచి టాప్ 10 ఆసక్తికరమైన విషయాలు

1. మొత్తం 36 రాఫెల్ విమానాల కోసం భారత్ ఒప్పందం కుదుర్చుకుంది. ఇందులో భాగంగా తొలి విడతలో ఐదు విమానాలు భారత్ చేరుకున్నాయి. ఇందులో మూడు సింగిల్ సీటర్ జెట్ ఫైటర్లు, రెండు ట్విస్ సీటర్ ఫైటర్ జెట్స్ ఉన్నాయి.

2. రాఫెల్ లో హ్యామర్ మాడ్యులర్ ( Hammer Moduler ) రాకెట్స్ తో పాటు మరెన్నో రకాల ఆయుధాలను అమర్చవచ్చు. 

3. భూమిపై ఉన్న శత్రు స్థావరాలపై ఖచ్చితంగా గురి చూసి నష్టం కలిగించే సామర్థ్యం రాఫెల్ సొంతం.

4. రాఫెల్ లో అమర్చేందుకు కావాల్సిన హ్యామర్లను అందించేందుకు భారత్-ఫ్రాన్స్ మధ్య ఒప్పందం జరిగింది

5. రాఫెల్ ఫైటర్ జెట్స్ లాంగ్ రేంజ్ రాకెట్ ( Long Range Rockets ) అయినా మీటియార ను కూడా తీసుకెళ్లగలదు. శత్రువును గాల్లోనే టార్గెట్ ( Airt- To- Air ) చేసి ఖతం చేస్తుంది. ఇందులో ఉండే మైకా అనే వెపన్ కంటికి కనిపించకుండా టార్గెట్ ను అంతం చేస్తుంది.

6. రాత్రి పగలు అనే తేడాలు లేకుండా.. పల్లపు భూములు, పర్వత ప్రాంతాలు అని భేధాలు లేకుండా రాఫెల్ తన లక్ష్యాన్ని పూర్తి చేస్తుంది. 

7. రాఫెల్ లో అణ్వాయుధాలు కూడా అమర్చ వచ్చు. 

8. రాఫెల్ విమానాలు విరామం లేకుండా 3700 కిలోమీటర్లు ప్రయాణించగలవు. గంటలకు 1389 వేగంతో దూసుకెళ్తాయి. 

9.రాఫెల్ విమానాన్ని నడపడానికి భారత వాయుసేనకు చెందిన కొంత మంది పైలట్లు ఇప్పటికే ప్రత్యేక శిక్షణను అందుకున్నారు.

10. దక్షిణ ఆసియాలో రాఫెల్ ఒక గేమ్ ఛేంజర్ . భారత వాయుసే బలం రాఫెల్ రాకతో మరింతగా పెరగనుంది. ముఖ్యంగా కయ్యానికి కాలు దువ్వే పొరుగు దేశాలు ఇక రాఫెల్ రాకతో తోకముడుస్తాయి.