వన్యప్రాణి సంరక్షణ చట్టం 1972 (The Wild Life Protection Act 1972)

         దేశంలోని వన్యప్రాణులు అంతరించిపోకుండా కాపాడేందుకు 1972లో వన్యప్రాణుల సంరక్షణ చట్టాన్ని రూపొందించారు. కొన్ని వన్యమృగాలను వేటాడటాన్ని ఈ చట్టం పూర్తిగా నిషేధించింది. దీని ద్వారా రాష్ట్ట్ర్రప్రభుత్వాలు పర్యావరణం/ భౌగోళిక స్వరూపం/ ప్రకృతి/ జంతుశాస్త్రపరంగా తగినంత ప్రాధాన్యం ఉన్న ప్రాంతాలను గుర్తిస్తాయి. అక్కడ వన్యప్రాణుల రక్షణ, పునరుత్పాదన, వృద్ధి కోసం జాతీయ ఉద్యానవనాలు, వన్యప్రాణుల సంరక్షణ స్థలాలను (Sanctuaries) ఏర్పాటు చేస్తాయి. 

లక్ష్యాలు:

1. వన్యప్రాణుల సంరక్షణ. 

2. వన్యప్రాణుల వేట, వాటి వ్యాపారాన్ని అరికట్టడం.

3. జాతీయ ఉద్యానవనాలను, పరిరక్షణ ప్రాంతాలను నియంత్రిచడం, నిర్వహించడం.

         వన్యప్రాణి సంరక్షణ చట్టం 1972ను 2002లో సవరించారు. పర్యావరణ భద్రత కోసం వన్యమృగాలు, పక్షులు, మొక్కలను సంరక్షించడం దీని ఉద్దేశం. ఈ చట్టం ద్వారా ప్రధానమంత్రి అధ్యక్షతన జాతీయ మండలిని ఏర్పాటు చేస్తారు.

విధులు:

  • వన్యప్రాణుల అభివృద్ధికి అవసరమైన విధానాలను రూపొందించడంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు సలహాలు ఇవ్వడం.
  • దేశంలో వన్యప్రాణుల సంరక్షణను సమీక్షించి, వాటి పురోగతికి అవసరమైన చర్యలు సూచించడం.
  • వన్యప్రాణులకు చెందిన ఆయా ప్రాజెక్టులు, కార్యకలాపాలను పర్యావరణపరంగా మూల్యాంకనం చేయడం.
  • కనీసం రెండేళ్లకోసారి దేశంలోని వన్యప్రాణుల స్థితిపై నివేదికలు రూపొందించి, ప్రచురించడం.
  • రాష్ట్రాల్లో ముఖ్యమంత్రుల అధ్యక్షతన రాష్ట్రమండళ్లను ఏర్పాటు చేసేందుకు ఈ చట్టం వీలు కల్పిస్తుంది.  అవి వన్యప్రాణుల సంరక్షణ విధులను నిర్వహిస్తాయి.
  • 2006లో వన్యప్రాణి సంరక్షణ చట్టం- 1972ను మరోసారి సవరించారు. పులుల రిజర్వ్‌ హాట్‌స్పాట్లలో టాస్క్‌ఫోర్స్‌ల ఏర్పాటుకు, వన్యప్రాణుల వేట/ వ్యాపారం చేసేవారి ఆస్తుల స్వాధీనానికి ఇది వీలు కల్పిస్తుంది.