నోబెల్‌ ప్రైజ్‌ 2021

            ప్రపంచంలోనే అత్యంత ప్రతిష్ఠాత్మకమైన బహుమతి నోబెల్‌ ప్రైజ్‌. ప్రపంచ మానవాళికి ఉపయోగపడే పరిశోధనల్లో సఫలీకృతులైనవారినే ఈ బహుమతి వరిస్తుంది. భౌతిక, రసాయన, వైద్య, ఆర్థిక, శాంతి, సాహిత్యం వంటివాటిలో చేసిన కృషికిగాను ఆల్ఫ్రెడ్‌ బెర్న్‌హార్డ్‌ నోబెల్‌ పేరుమీద ఈ ప్రైజ్‌ను అందిస్తున్నారు. ప్రతి ఏటా నోబెల్‌ వర్ధంతి అయిన డిసెంబర్‌ 10న వీటిని ప్రదానం చేస్తారు. ఈ సందర్భంగా ఈ ఏడాది నోబెల్‌కు ఎంపికైన వారి గురించి మరొకసారి ప్రత్యేకంగా తెలుసుకుందాం.

  • ఆల్ఫ్రెడ్‌ బెర్న్‌హార్డ్‌ నోబెల్‌ 1833, అక్టోబర్‌ 21న స్వీడన్‌లోని స్టాక్‌హోంలో జన్మించాడు. ఇతని తల్లిదండ్రులు ఇమ్మాన్యుయేల్‌ నోబెల్‌, ఆండ్రియేట్‌ అహ్ల్‌సెల్‌ నోబెల్‌. 17 ఏండ్ల వయస్సులోనే ఐదు భాషలు మాట్లాడేవాడు. ఇతడు ప్రముఖ ఆవిష్కర్త, వ్యాపారవేత్త.
  • ఈయన మొత్తం 355 పరిశోధనలపై పేటెంట్లను కలిగి ఉన్నాడు. అందులో ‘డైనమైట్‌’ ప్రతిష్ఠాత్మకమైనది.
  • నోబెల్‌ 1896, డిసెంబర్‌ 10న ఇటలీలోని సాన్‌రెమోలో మరణించాడు. తన మరణానంతరం తన సంపద నుంచి వచ్చిన ఆదాయంతో భౌతికశాస్త్రం, రసాయశాస్త్రం, వైద్యశాస్త్రం, సాహిత్యం, శాంతిరంగాల్లో మానవాళికి ఉపయోగపడే పరిశోధనలు చేసినవారిని గుర్తించి పురస్కారాలు ఇవ్వాలని వీలునామా రాశాడు.
  • 1901లో మొదటిసారిగా నోబెల్‌ బహుమతులు ఇవ్వడం ప్రారంభించారు. ప్రతి ఏడాది అక్టోబర్‌లో విజేతలను ప్రకటిస్తారు. ఆ తర్వాత నోబెల్‌ మరణించిన రోజు డిసెంబర్‌ 10న ఈ బహుమతులను అందజేస్తారు. విజేతలకు నోబెల్‌ డిప్లొమా, ఒక పతకం, తొమ్మిది మిలియన్ల స్వీడిష్‌ క్రోనార్లు ఇస్తారు.
  • నోబెల్‌ బహుమతులు స్టాక్‌హోంలో ప్రదాన చేస్తారు. నోబెల్‌ శాంతి బహుమతి మాత్రం నార్వేలోని ఓస్లోలో అందజేస్తారు.
  • ఇద్దరు లేదా ముగ్గురు విజేతలున్నట్లయితే వారికి ప్రైజ్‌మనీని సమానంగా పంచుతారు. ఏ సందర్భంలోనైనా బహుమతి మొత్తాన్ని ముగ్గురు కంటే ఎక్కువమందికి ఇవ్వరు.

వైద్యశాస్త్రం

  • అమెరికాకు చెందిన డేవిడ్‌ జూలియస్‌, ఆర్డెమ్‌ పటపౌటియన్‌లకు సంయుక్తంగా నోబెల్‌ మెడిసిన్‌ లభించింది.
  • మనుషులకు రంగు, రుచి, వాసన, స్పర్శ, ధ్వని, వేడి, చల్లదనం వంటి అనుభూతులు, వాటిలోని తేడాలు ఎలా తెలుస్తున్నాయి? కండ్లు, చెవులు, ముక్కు, నోరు, చర్మం వంటి పంచేంద్రియాల ద్వారా మెదడుకు ఆయా సంకేతాలు ఎలా చేరుతున్నాయి? వంటి ఈ రహస్యాలను విడివిడిగా ఛేదించినందుకు వీరిని నోబెల్‌ వరించింది.
  • ఉష్ణోగ్రత, పీడనాన్ని గ్రహించడానికి నరాలు ఎలా ప్రేరేపితమవుతాయనే దానికి వీరు సమాధానాన్ని కనుగొన్నారు.
  • మిరపకాయలో ఉండే కాప్సాయిసిన్‌ అనే క్రియాశీల రసాయనంపై ప్రయోగాలు నిర్వహించారు. మనిషి శరీరంలో కాప్సాయిసిన్‌ అనే పదార్థానికి స్పందించే ప్రత్యేక రకం జన్యు (టీర్‌పీవీ1) కణం ఉన్నట్లు వీరు కనుగొన్నారు.
  • వీరి పరిశోధనల వల్ల నొప్పి నివారణ, గుండె సంబంధిత చికిత్సల తీరును మార్చివేసే అవకాశం ఉంది.
  • డేవిడ్‌ జూలియస్‌ న్యూయార్క్‌లో జన్మించారు. శాన్‌ఫ్రాన్సిస్కోలోని యూనివర్సిటీ ఆఫ్‌ కాలిఫోర్నియాలో ప్రొఫెసర్‌గా పనిచేస్తున్నారు.
  • ఆర్డెమ్‌ పటపౌటియన్‌ లెబనాన్‌లో జన్మించారు. కాలిఫోర్నియాలోని స్క్రిప్స్‌ రిసెర్చ్‌ సెంటర్‌లో ప్రొఫెసర్‌గా పనిచేస్తున్నారు.
  • ఫిజియాలజీ లేదా వైద్యశాస్త్రంలో ఇచ్చే నోబెల్‌ ప్రైజ్‌ ఇప్పటివరకు 112 సార్లు ఇవ్వగా 224 మంది అందుకున్నారు. వైద్యశాస్త్రంలో మొదటి నోబెల్‌ 1901లో ఎమిల్‌ అడాల్ఫ్‌ వాన్‌ బెహ్రింగ్‌కు లభించింది.

కెమిస్ట్రీ

  • బెంజమిన్‌ లిస్ట్‌, డేవిడ్‌ మెక్‌మిలన్‌లకు సంయుక్తంగా కెమిస్ట్రీలో నోబెల్‌ లభించింది.
  • పరమాణువుల అమరికను సరికొత్త మార్గంలో అభివృద్ధిపరిచే ‘అసిమెట్రిక్‌ ఆర్గానోకెటాలసిస్‌’ అనే విధానాన్ని ఆవిష్కరించినందుకు వీరికి ఈ అవార్డు దక్కింది.
  • బెంజమిన్‌ లిస్ట్‌ ఫ్రాంక్‌ఫర్ట్‌ (జర్మనీ)లో జన్మించారు. మాక్స్‌ ప్లాంక్‌ ఇన్‌స్టిట్యూట్‌లో ప్రొఫెసర్‌గా పనిచేస్తున్నారు.
  • డేవిడ్‌ మెక్‌మిలన్‌ బెల్‌షిల్‌ (యూకే)లో జన్మించారు. ప్రిన్స్‌టన్‌ యూనివర్సిటీలో ప్రొఫెసర్‌గా పనిచేస్తున్నారు.
  • పరమాణువులను వినియోగించి ఎలాంటి దుష్ప్రభావాలు లేకుండానే కావాల్సిన ఫలితాన్ని సాధించే విధానాన్ని వారు పనిచేస్తున్న ఆయా యూనివర్సిటీల్లో కనుగొన్నారు.
  • కెమిస్ట్రీలో ఇప్పటివరకు 113 సార్లు నోబెల్‌ ఇవ్వగా 188 మంది అందుకున్నారు. కెమిస్ట్రీలో మొదటి నోబెల్‌ జాకోబస్‌ హెన్నికస్‌ వాన్‌ టీ హాఫ్‌కు లభించింది.

ఫిజిక్స్‌లో

  • సుకురో మనాబె, క్లాస్‌ హాసిల్‌మన్‌, జార్జియో పారిసి అనే ముగ్గురు సైంటిస్టులకు సంయుక్తంగా నోబెల్‌ ఫిజిక్స్‌ లభించింది.
  • ప్రకృతిలో గందరగోళంతో కూడి, యాదృచ్ఛికంగా జరిగే సంక్లిష్ట వ్యవస్థలపై వీరు పరిశోధనలు చేశారు.
  • ఈ పరిశోధనల వల్ల వాతావరణ సంబంధ అంశాలను మెరుగ్గా అర్థం చేసుకోవడానికి, కచ్చితత్వంతో ముందస్తు అంచనాలు వేయడానిక మార్గం సుగమమైంది. సంక్లిష్ట భౌతిక వ్యవస్థల గురించి అవగాహన పెరిగింది.
  • సుకురో మనాబె జపాన్‌లోని షింగులో జన్మించారు. ఈయన అమెరికాలోని ప్రిన్స్‌టన్‌ యూనివర్సిటీలో ఎన్విరాన్‌మెంట్‌ సీనియర్‌ సైంటిస్టుగా ఉన్నారు. గాల్లో కార్బన్‌ డై ఆక్సైడ్‌ స్థాయి పెరిగితే భూ ఉపరితలంపై ఉష్ణోగ్రతలు ఎలా పెరుగుతాయన్నది ప్రయోగాత్మకంగా రుజువు చేశారు.
  • క్లాస్‌ హాసిల్‌మన్‌ జర్మనీలోని హాంబర్గ్‌లో జన్మించారు. హాంబర్గ్‌లోని మాక్స్‌ ప్లాంక్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఫర్‌ మెటీరియాలజీ ప్రొఫెసర్‌గా పనిచేస్తున్నారు. శీతోష్ణస్థితి మారుతున్నప్పటికీ వాతావరణ నమూనాలు ఎందుకు నమ్మశక్యంగా ఉంటున్నాయని ఈయన ఒక నమూనాను రూపొందించారు. దీని ద్వారా ప్రకృతి సిద్ధమైన పోకడలు, మానవ చర్యల వల్ల వాతావరణంపై పడే ముద్ర తాలూకు సంకేతాలను గుర్తించే విధానాలను అభివృద్ధి చేశారు.
  • జార్జియో పారిసి రోమ్‌ (ఇటలీ)లో జన్మించారు. రోమ్‌లోని సాపియోంజా యూనివర్సిటీలో ప్రొఫెసర్‌గా పనిచేస్తున్నారు. ఒక క్రమపద్ధతి లోపించిన పదార్థాలు, యాదృచ్ఛిక ప్రక్రియలకు సంబంధించిన సిద్ధాంతంపై ఆవిష్కరణలు చేశారు. గణిత, జీవ, నాడీ శాస్ర్తాలు, మెషీన్‌ లెర్నింగ్‌ వంటి విభిన్న రంగాల్లో సంక్లిష్ట వ్యవస్థలను అర్థం చేసుకోవడానికి వీలు కల్పించిన ఫిజిక్స్‌, మ్యాథ్స్‌ నమూనాను నిర్మించారు.
  • ఫిజిక్స్‌లో ఇప్పటి వరకు 115 సార్లు ఇవ్వగా 219 మంది అందుకున్నారు. వ్యక్తుల పరంగా 218 మంది. ఎందుకంటే జాన్‌ బార్డీన్‌ 1956, 1972లో రెండుసార్లు ఫిజిక్స్‌లో అందుకున్నారు కాబట్టి. ఫిజిక్స్‌లో మొదటి నోబెల్‌ విల్‌హెమ్‌ రాంట్‌జెన్‌కు లభించింది.

ఆర్థిక శాస్త్రం

  • అమెరికాకు చెందిన డేవిడ్‌ కార్డ్‌, జోషువా యాంగ్రిస్ట్‌, గైడో ఇంబెన్స్‌లకు సంయుక్తంగా ఆర్థిక శాస్త్రంలో నోబెల్‌ లభించింది.
  • డేవిడ్‌ కార్డ్‌ కెనడాలో జన్మించి అమెరికాలో స్థిరపడ్డారు. ప్రస్తుతం కాలిఫోర్నియా యూనివర్సిటీలో ప్రొఫెసర్‌గా పనిచేస్తున్నారు.
  • కార్డ్‌ 1980వ దశకంలో అలెన్‌ క్రూగర్‌తో కలిసి కనీస వేతనాలపై 1990 నుంచి పరిశోధనలు నిర్వహించారు. కనీస వేతనాన్ని పెంచినప్పుడు, పెంచకముందు పరిస్థితులను అధ్యయనం చేశారు.
  • కనీస వేతనాలను పెంచడం వల్ల ఇతరులకు ఉద్యోగ అవకాశాలు తగ్గిపోతాయనే ఆందోళన అవసరం లేదని నిరూపించారు. వలస కార్మికుల వల్ల స్వదేశంలోని వ్యక్తుల ఆదాయం వృద్ధిచెందడంతో పాటు పలు ప్రయోజనాలు కలుగుతాయని పేర్కొన్నారు.
  • కొలంబలో జన్మించిన జోషువా యాంగ్రిస్ట్‌ మసాచుసెట్స్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ టెక్నాలజీలో ప్రొఫెసర్‌గా పనిచేస్తున్నారు.
  • నెదర్లాండ్స్‌లో జన్మించి అమెరికాలో స్థిరపడిన గైడో ఇంబెన్స్‌ స్టాన్‌ఫోర్డ్‌ యూనివర్సిటీ ప్రొఫెసర్‌గా పనిచేస్తున్నారు.
  • వీరు వేర్వేరుగా వ్యక్తులపై సుదీర్ఘ విద్య చూపే ప్రభావాన్ని విశ్లేషించారు. ఒక గ్రూపులోని వ్యక్తుల చదువును ఏడాది పాటు పొడిగించినప్పుడు వారందరిపై పడే ప్రభావం ఒకే విధంగా ఉండదని, దీనిపై ఒక నిశ్చితాభిప్రాయానికి రాలేమని అనుకునేవారు.
  • 1990లో ఇదే అంశంపై సహజ పరిశోధనలను కొనసాగించిన వీరు విధాన ప్రక్రియలో ఎదురవుతున్న సమస్యను పరిష్కరించారు.
  • ఆర్థిక నోబెల్‌ను ఇప్పటివరకు 53 సార్లు ఇవ్వగా 89 మంది అందుకున్నారు. 1969లో ప్రారంభించిన ఈ ప్రైజ్‌ను మొదటిసారిగా రగ్నార్‌ ఫ్రిష్‌, జాన్‌ టింబర్జెన్‌లు అందుకున్నారు.

సాహిత్యం

  • అబ్దుల్‌ రజాక్‌ గుర్నాకు సాహిత్యంలో నోబెల్‌ లభించింది. నిలువ నీడ కోల్పోయి పరాయి దేశాన్ని ఆశ్రయించే శరణార్థుల వ్యధ, వలస పాలన మిగిల్చిన చేదు జ్ఞాపకాలను రచించినందుకు గాను నోబెల్‌ దక్కింది.
  • గుర్నా ఆఫ్రికా ఖండంలోని టాంజానియాకు దగ్గరలో హిందూ మహాసముద్రంలో ఉన్న జాంజిబార్‌ దీవిలో జన్మించారు.
  • 1968లో బ్రిటన్‌కు వలసవెళ్లి అక్కడే విద్యనభ్యసించి కెంట్‌ యూనివర్సిటీలో ఇంగ్లిష్‌, వలస రాజ్యాల సాహిత్య విభాగం ప్రొఫెసర్‌గా పనిచేశారు.
  • గుర్నా పది నవలలు, చిన్న కథలను రాశారు. ఆయన రచనల్లో ఎక్కువగా శరణార్థుల వ్యథలే కనిపిస్తాయి.
  • ఇప్పటివరకు సాహిత్యంలో నోబెల్‌ 114 సార్లు ఇవ్వగా 118 మంది అందుకున్నారు. మొదటి సాహిత్య నోబెల్‌ను సలీ ప్రుధోమ్‌ అందుకున్నారు.

శాంతి

  • జర్నలిస్టులు మరియా రెసా, దిమిత్రి మురటోవ్‌లకు నోబెల్‌ శాంతి బహుమతి లభించింది.
  • మరియా రెసా ఫిలిప్పీన్స్‌కు చెందినవారు. 1963, అక్టోబర్‌ 2న మనీలాలో జన్మించారు. ఈమె సీఎన్‌ఎన్‌లో 20 ఏండ్ల పాటు ఇన్వెస్టిగేటివ్‌ రిపోర్టర్‌గా పనిచేశారు.
  • ఈమె 2012లో ‘రాప్లర్‌’ పేరుతో డిజిటిల్‌ మీడియాను ప్రారంభించారు. ఫిలిప్పీన్స్‌ అధికారిక ఒత్తిళ్లను ఎదుర్కొంటూ ఎన్నో కథనాలను ధైర్యంగా ప్రచురించారు.
  • అధ్యక్షుడు రోడ్రిగో డుటెర్తె తెచ్చిన వివాదాస్పద ‘యాంటీ డ్రగ్‌’ కార్యక్రమంపై ఆమె విమర్శనాత్మక కథనాలు రాశారు. డ్రగ్‌ మాఫియా సభ్యులుగా పేర్కొంటూ వేల మందిని అంతమొందించిన తీరును వెలుగులోకి తెచ్చారు.
  • దిమిత్రి మురటోవ్‌ రష్యాకు చెందినవారు. ఈయన 1961, అక్టోబర్‌ 30న సమరాలో జన్మించారు. 1993లో రష్యాలో ప్రారంభమైన దినపత్రిక ‘నోవాయా గెజెటా’ వ్యవస్థాపకుల్లో ఈయన ఒకరు.
  • రష్యా ప్రభుత్వ అవినీతిని బయటపెట్టడంలో, మానవ హక్కుల ఉల్లంఘనలపై నిలదీయడంలో ఆయనకు మంచి పేరుంది. రష్యాలో పేరుకుపోయిన అవినీతి, విధానపరమైన హింస, చట్ట వ్యతిరేక అరెస్టులు, ఎన్నికల్లో మోసాలు వంటి ఎన్నో సంచలనాత్మక కథనాలను ప్రచురించారు.
  • శాంతి నోబెల్‌ను ఇప్పటివరకు 102 సార్లు ప్రకటించగా 137 మంది అందుకున్నారు. మొదటి శాంతి నోబెల్‌ను హెన్రీ డునాంట్‌, ఫ్రెడరిక్‌ పాసీ అందుకున్నారు.

భారత నోబెల్‌ గ్రహీతలు


భారతీయులు గాని, భారత సంతతికి చెందినవారు గాని, భారత పౌరసత్వం స్వీకరించినవారు గాని నోబెల్‌ బహుమతిని అందుకున్నవారు.
1) రవీంద్రనాథ్‌ ఠాగూర్‌
         పశ్చిమ బెంగాల్‌కు చెందిన ఠాగూర్‌ 1913లో సాహిత్యంలో నోబెల్‌ను అందుకున్నారు. నోబెల్‌ను అందుకున్న మొదటి భారతీయుడు ఠాగూర్‌. బ్రిటన్‌ పరిపాలనలో భారతదేశం ఉన్నప్పుడు ఠాగూర్‌కు ఈ బహుమతి లభించింది. ఇతను రచించిన గీతాంజలి (సాంగ్‌ ఆఫ్‌ రింగ్స్‌)కి ఈ బహుమతి దక్కింది.
2) సీవీ రామన్‌
        తమిళనాడుకు చెందిన సీవీ రామన్‌ ఫిజిక్స్‌లో 1930లో నోబెల్‌ను అందుకున్నారు. కాంతి ప్రయాణంలో ఒక అణువు వద్ద పోటాన్లు ఎంతగా పరివ్యాప్తమవుతాయన్న దానిని బట్టి ఆయా పదార్థాల ధర్మాలను గ్రహించవచ్చని ప్రతిపాదించారు. వీటిని రామన్‌ ఎఫెక్ట్‌గా పిలుస్తారు. ఇతను భారత్‌ నుంచి నోబెల్‌ అందుకున్న రెండో వ్యక్తి. రామన్‌ ఎఫెక్ట్‌ను ప్రతిపాదించిన రోజు ఫిబ్రవరి 28ని భారతదేశంలో నేషనల్‌ సైన్స్‌ డేగా నిర్వహిస్తున్నారు.
3) హర్‌గోబింద్‌ ఖొరానా
         ఖొరానా 1922, జనవరి 9న కోల్‌కతాలో జన్మించారు. అమెరికా వెళ్లి స్థిరపడ్డారు. జన్యువుల ఆవిష్కారమే అమోఘమనుకుంటే ఆ జన్యువుల్లో జీవ సంకేతాలు ఏ క్రమంలో ఎలా ఉంటున్నాయో విశ్లేషించి చూపడం, కీలకమైన ప్రొటీన్‌ సమ్మేళనాలు వాటి పాత్ర ఏమిటో గుర్తించినందుకు వైద్యశాస్త్రంలో 1968లో నోబెల్‌ లభించింది.
4) మదర్‌ థెరిసా
         అల్బేనియా (మాసిడోనియా)లో పుట్టి భారత్‌లో స్థిరపడింది. పేదలు, రోగులకు సేవచేయడానికి తన జీవితాన్ని అంకితం చేసింది. మిషనరీస్‌ ఆఫ్‌ చారిటీ ఏర్పాటు చేసి మానవాళికి సేవ చేసినందుకు 1979లో ఆమెకు నోబెల్‌ శాంతి బహుమతి లభించింది.
5) సుబ్రమణియం చంద్రశేఖర్‌
          1910, అక్టోబర్‌ 19న అవిభాజ్య భారత్‌లోని లాహోర్‌ (ప్రస్తుతం పాకిస్థాన్‌)లో జన్మించారు. అమెరికా వెళ్లి స్థిరపడ్డారు. ఇతను సీవీ రామన్‌ సోదరుడి కుమారుడు. నక్షత్రాల పుట్టుక, పరిణామాలపై సరికొత్త కాంతిని ప్రసరింపజేసినందుకు ఫిజిక్స్‌ నోబెల్‌ బహుమతి 1983లో లభించింది. ఇతను ‘చంద్రశేఖర్‌ లిమిట్‌’ పేరుతో ఒక సిద్ధాంతాన్ని ప్రతిపాదించారు.
6) అమర్త్యసేన్‌
            1933, నవంబర్‌ 3న పశ్చిమ బెంగాల్‌లో జన్మించారు. సంప్రదాయ అర్థశాస్త్రం విస్మరిస్తూ వచ్చిన జన సంక్షేమ ఆర్థిక శాస్త్రంంపై చేసిన కృషికి గాను ఎకనామిక్స్‌లో నోబెల్‌ బహుమతి 1998లో లభించింది. ఆర్థిక సంస్కరణలకు ముందు విద్య, వైద్యం, ఆహార లభ్యత వంటివి సంస్కరించినప్పుడే నిజమైన పురోభివృద్ధి సాధ్యమని నొక్కి చెప్పారు.
7) వెంకటరామన్‌ రామకృష్ణన్‌
            1952లో తమిళనాడులోని చిదంబరంలో జన్మించారు. ఈయన జీవరసాయన శాస్త్రజ్ఞుడు. ఈయనకు కెమిస్ట్రీలో నోబెల్‌ 2009లో లభించింది. మానవ శరీరం యావత్తు కణ నిర్మితం. ప్రతి కణంలోనూ కేంద్రకం, అందులో మన శారీరక గమనాన్ని నిర్దేశించే సంకేతం డీఎన్‌ఏపై విశేష కృషి చేశారు. ఆర్‌ఎన్‌ఏ స్ట్రక్చరల్‌ రైబోజోమ్‌పై పరిశోధనలు చేశారు.
8) కైలాష్‌ సత్యార్థి
          ఇతను 1954, జనవరి 11న మధ్యప్రదేశ్‌లోని విదిశలో జన్మించారు. ‘బచ్‌పన్‌ బచావో ఆందోళన్‌’ సంస్థను స్థాపించి బాల కార్మిక వ్యవస్థకు వ్యతిరేకంగా పోరాడారు. పిల్లల హక్కులను పొందడానికి కృషిచేశారు. దాదాపు లక్ష మంది పిల్లలను బాల కార్మికులు, అక్రమ రవాణా, బానిసత్వం నుంచి విముక్తి కలిగించారు. ఇందుకు గాను నోబెల్‌ శాంతి బహుమతిని 2014లో మలాలా యూసఫ్‌జాయ్‌తో కలిసి సంయుక్తంగా అందుకున్నారు.
9) అభిజిత్‌ బెనర్జీ
           కోల్‌కతాలో జన్మించిన ఈయన భారత్‌ నుంచి అమెరికాకు వెళ్లి అక్కడే స్థిరపడ్డారు. ఇతనికి 2019లో ఆర్థిక శాస్త్రంలో మరో ఇద్దరికి కలిపి నోబెల్‌ లభించింది. అభిజిత్‌ బెనర్జీతో పాటు ఆయన భార్య ఎస్తర్‌ డఫ్లో, మైఖేల్‌ క్రెమెర్‌లకు సంయుక్తంగా లభించింది. అంతర్జాతీయంగా పేదరికాన్ని ఎదుర్కొనే అంశంలో పరిష్కారాలు చూపినందుకు వీరికి నోబెల్‌ దక్కింది.

  • 1907లో సాహిత్యంలో నోబెల్‌ను అందుకున్న ప్రముఖ బ్రిటన్‌ రచయిత రుడ్యార్డ్‌ కిప్లింగ్‌ 1865లో ముంబయిలో జన్మించాడు. ఇతని ప్రముఖ రచన ‘ది జంగిల్‌ బుక్‌.
  • మలేరియాపై సికింద్రాబాద్‌లో పరిశోధనలు చేసిన బ్రిటన్‌ పౌరుడు రొనాల్డ్‌ రాస్‌ 1857, మే 13న ఉత్తరాఖండ్‌లోని అల్మోరాలో జన్మించారు. ఈయన వైద్యశాస్త్రంలో 1902లో నోబెల్‌ను అందుకున్నారు.