పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు 31.01.2022 ప్రారంభమయ్యాయి. ఈ సందర్భంగా పార్లమెంటు సెంట్రల్ హాల్లో ఉభయ సభలను ఉద్దేశించి రాష్ట్రపతి ప్రసంగించారు. మన దేశానికి స్వాతంత్ర్యం వచ్చి 75 ఏళ్లు అయిన సందర్భంగా తొలుత ఆయన స్వాతంత్ర్య సమరయోధులకు నివాళి అర్పించారు. దేశ ప్రజలకు స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు.
రాష్ట్రపతి ప్రసంగంలోని హైలైట్స్
- కరోనా మహమ్మారిపై భారత పోరాటం స్ఫూర్తిదాయకం. ఈ పోరాటంలో భాగస్వాములైన ఫ్రంట్‌లైన్ కార్యకర్తలు, ఆరోగ్య సిబ్బంది, దేశ పౌరులకు అభినందనలు.
- దేశంలో వ్యాక్సినేషన్ విజయవంతంగా కొనసాగుతోంది. ఏడాదిలోపే 150కోట్లకు పైగా డోసులను పంపిణీ చేశాం. భారత వ్యాక్సిన్లు కోట్ల మంది ప్రాణాలను కాపాడాయి. అర్హులైన 90శాతం కంటే ఎక్కువ మంది మొదటి డోసు తీసుకున్నారు.
- భారత్ లోనే మూడు వ్యాక్సిన్లు తయారవుతున్నాయి. వ్యాక్సిన్ల ఉత్పత్తిలో భారత్ రెండో స్థానంలో ఉంది.
- ఇప్పటి వరకు 8 వ్యాక్సిన్లకు అత్యవసర వినియోగ అనుమతి ఉంది.
- ఫార్మా రంగాన్ని విస్తరించేందుకు భారత ప్రభుత్వం కృషి చేస్తోంది.
- ప్రభుత్వ సున్నిత విధానాలతో సామాన్యులకు సులభంగా వైద్య సేవలు అందుతున్నాయి. 8 వేలకు పైగా జన ఔషధి కేంద్రాల ద్వారా అందుబాటు ధరలకే ఔషధాలు ప్రజలకు చేరుతున్నాయి. ఆయుష్మాన్ భారత్ కార్డులు పేదలకు చికిత్సలో సాయం చేశాయి.
- ఏ వ్యక్తీ ఆకలితో అలమటించకూడదనేది ప్రభుత్వ ప్రధాన లక్ష్యం. అందుకే ప్రపంచంలోనే అతిపెద్ద ఆహార పంపిణీ పథకాన్ని ప్రభుత్వం నిర్వహిస్తోంది.
- పేద ప్రజల సంక్షేమం కోసం ఎన్నో పథకాలు తీసుకొచ్చింది. 23 కోట్ల మంది కార్మికులకు ఈ-శ్రమ్ పోర్టల్‌తో అనుసంధానించింది. 2 కోట్ల మంది పేదలకు పక్కా ఇళ్లు కట్టించింది. 6 కోట్ల ఇళ్లకు తాగునీరు అందిస్తోంది.
- గ్రామీణ ఆర్థిక వ్యవస్థను నడిపించడంలో మహిళల పాత్ర మరింత విస్తృతమైంది. 2021-22లో 28లక్షల స్వయం సహాయక సంఘాలకు రూ.65వేల కోట్ల సాయం అందించారు. ప్రధానమంత్రి స్వనిధి యోజనతో వీధి వ్యాపారులకు ప్రయోజనం చేకూరింది. ఇప్పటివరకు 28లక్షల మంది వీధి వ్యాపారులు ప్రయోజనం పొందారు.
- 7 మెగా టెక్స్‌టైల్ పార్కులతో భారీగా ఉద్యోగ అవకాశాలు సృష్టించగలిగింది. ఎంఎస్‌ఎంఈలకు చేయూత కోసం రూ. 3లక్షల కోట్ల రుణాలు అందించింది.
- ఆత్మ నిర్భర్ భారత్ సంకల్పానికి రూపం తీసుకొచ్చేందుకు దేశీయ విద్యావిధానంలో ప్రభుత్వం అనేక మార్పులు తీసుకొచ్చింది. జాతీయ విద్యా విధానంలో భాగంగా ఈ ఏడాది 10 రాష్ట్రాల్లోని 19 ఇంజినీరింగ్ కళాశాలల్లో 6 స్థానిక భాషల్లో బోధన చేపట్టనున్నారు.
- ప్రధానమంత్రి గ్రామీణ సడక్ యోజన ద్వారా రోజుకు 100 కి.మీల రహదారుల నిర్మాణం చేపడుతోంది. ఇప్పటివరకు 36,500 కి.మీల రహదారుల నిర్మాణం పూర్తయ్యింది.
- మహిళా సాధికారతకు ప్రభుత్వం అధిక ప్రాధాన్యమిస్తోంది. బేటీ బచావో, బేటీ పడావో కార్యక్రమం మంచి ఫలితాలనిచ్చింది. పాఠశాలలకు వెళ్లే బాలికల సంఖ్య పెరిగింది.
- కుమార్తెలు కూడా కొడుకులతో సమానమే. అందుకే యువతుల కనీస వివాహ వయసు పెంచేందుకు ప్రభుత్వం కృషి చేస్తోంది. ఇందుకోసం బిల్లు కూడా తీసుకొచ్చింది. త్రిపుల్ తలాక్ వ్యవస్థను నిర్మూలించాం.
- జీఎస్‌టీ వసూళ్లు గత కొన్ని నెలలుగా రూ.లక్ష కోట్లకు పైనే ఉంటున్నాయి.
- వ్యవసాయ రంగంలో అనేక సంస్కరణలు తీసుకొచ్చింది. చిన్న, సన్నకారు రైతులు దేశ అభివృద్ధిలో కీలక పాత్ర పోషిస్తున్నారు. దేశంలో ఉన్న రైతుల్లో 80శాతం మంది వీరే. అందుకే వీరి అభివృద్ధిపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టిపెట్టింది. పీఎం కిసాన్ సమ్మాన్ నిధి ద్వారా 11 కోట్లకు పైగా రైతులు ప్రయోజనం పొందుతున్నారు.
- డిజిటల్ ఇండియాకు యూపీఐ విజయవంతమైన ఉదాహరణ. డిజిటల్ చెల్లింపులను అంగీకరిస్తున్నారనేందుకు ఇదే నిదర్శనం.
- దేశ భద్రతకు ప్రభుత్వం పెద్దపీట వేస్తోంది. రక్షణరంగ తయారీలో మేక్ ఇన్ ఇండియాకు అధిక ప్రాధాన్యమిస్తోంది. డ్రోన్ టెక్నాలజీపై ప్రత్యేకంగా దృష్టిపెట్టింది.
- టోక్యో ఒలింపిక్స్‌లో భారత యువశక్తి సామర్థ్యం చూశాం. అత్యుత్తమ ప్రదర్శనతో భారత్ 7 పతకాలు సాధించింది. టోక్యో పారాలింపిక్స్‌లో కూడా 19 పతకాలు సాధించి రికార్డు సృష్టించింది.
- జల్ జీవన్ మిషన్ తో గ్రామాలకు తాగునీరు అందుతోంది.
- పద్మ పురస్కారాలను సామాన్యుల వరకు తీసుకెళ్లాం.
- ఈ-శ్రమ పోర్టల్ ద్వారా 23 కోట్ల మంది కార్మికులు కనెక్ట్ అయి ఉన్నారు.
- దేశ వ్యాప్తంగా 2 కోట్ల మంది పేదలకు పక్కా గృహాలను నిర్మించాం.
- దేశంలోని 6 కోట్ల నివాసాలకు తాగునీటి కనెక్షన్లు ఇచ్చాం.
- దేశంలో 36,500 కిలోమీటర్ల రహదారులను నిర్మించాం.
- 2070 కల్లా జీరో కార్బన్ ఎమిషన్ ను టార్గెట్ గా పెట్టుకున్నాం.
- జమ్మూలో ఐఐటీ, ఐఐఎం నిర్మిస్తున్నాం.
- ఒకప్పుడు దేశవ్యాప్తంగా 126 నక్సల్స్ ప్రభావిత జిల్లాలు ఉండగా... ఇప్పుడు వాటి సంఖ్య 70కి తగ్గింది.
- జమ్మూలో ఐఐటీ, ఐఐఎం నిర్మిస్తున్నాం.