సురవరం ప్రతాపరెడ్డి


జననం: 1896 మే 28
స్వస్థలం: ఇటికెలపాడు (మహబూబ్‌నగర్‌)
మరణం: 1953 ఆగస్టు 25



        సురవరం ప్రతాపరెడ్డి తొలితరం వైతాళికుల్లో, బహుముఖ ప్రజ్ఞాశాలుల్లో అగ్రగణ్యుడు. ఈయన సంస్కృతాంధ్ర భాషల్లో ప్రావీణ్యం కలవాడు.

        దేశసేవ, ప్రజల సర్వతోముఖాభివృద్ధి, సంఘసంస్కరణ, మాతృభాషా వికాసం అనే ఉన్నత లక్ష్యాలతో 1926 మే 10న గోల్కొండ పత్రికను స్థాపించాడు.

        నిజాం వ్యతిరేక పోరాటానికి ఈయన గోల్కొండ పత్రికను ఆయుధంగా చేసుకున్నాడు. గాంధీజీ పిలుపు మేరకు ఇతను స్వాతంత్రోద్యమంలో పాల్గొన్నాడు.

       ఈయన గ్రంథాలయోధ్యమానికి చేయూతనిచ్చాడు. ఈయన ప్రోత్సాహంతో క్యాతూరు, సూర్యాపేట, జనగాంలో గ్రంథాలయ సభలు జరిగాయి.

        1942 ఆంధ్ర గ్రంథాలయ మహాసభ, 1943 ఖమ్మంలో జరిగిన మహాసభకు అధ్యక్షత వహించాడు. తెలంగాణలో కవులు పూజ్యం (శూన్యం) అని ఆంధ్ర పండితుడు ముడుంబాయి వెంకట రాఘవాచార్యులు ఎగతాళి చేస్తే దానికి దీటుగా 350 మంది కవుల రచనలతో గోల్కొండ కవుల సంచిక అనే పేరుతో ప్రచురించి తెలంగాణలో కవులు పూజ్యం కాదు పూజ్యాలని పేర్కొన్నాడు.

       1930 మెదక్‌ జిల్లా జోగిపేటలో జరిగిన నిజాం ఆంధ్రమహాసభకు అధ్యక్షత వహించి సభ తెలుగులోనే జరగాలని తీర్మానం చేశాడు. 1951లో ప్రజావాణి పత్రికను ప్రారంభించాడు. కొంతకాలం తర్వాత ఈ పత్రిక ఆగిపోయింది.

        1952లో వనపర్తి కాంగ్రెస్‌ పార్టీ అభ్యర్థిగా పోటీ చేసి శాసనసభకు ఎన్నికయ్యాడు, వివేకవర్ధిని పరిషత్‌ను ఏర్పాటు చేసి తెలుగు భాషా సాహిత్యానికి ఎనలేని కృషి చేశాడు.

సారస్వత పరిషత్‌ స్థాపనకు కృషి చేసి 1943లో స్థాపించి దానికి కొంతకాలం అధ్యక్షుడిగా వ్యవహరించాడు. ఈయన రెండు వేలకు పైగా వ్యాసాలు, గేయాలు, కథానికలు, కథలు, సంపాదకీయాలు గోల్కొండ పత్రికలో ప్రచురించాడు.

రచనలు
1. ఆంధ్రుల సాంఘిక చరిత్ర ( 1952లో కేంద్రసాహిత్య అకాడమీ పురస్కారం పొందిన తొలి తెలుగు గ్రంథంగా నిలిచింది).
2. హైందవ ధర్మవీరులు
3. హిందువుల పండగలు
4. భక్త తుకారాం ( నాటకం)
5. గ్రంథాలయోద్యమం
6. ప్రతాపరెడ్డి కథలు ( నిజాం కాలం నాటి ప్రజా జీవితం)
7. రామాయణ విశేషాలు ( పరిశోధన గ్రంథం)
8. శుద్ధాంత కాంత (నవల)
9. మొగలాయి కథలు
10. సంఘోద్ధరణం (వ్యాసాలు)
11. గ్రామజన దర్పణం
12. చంపకీ భ్రమర విషాదం
13. హరిశర్మోపాఖ్యానం
14. జాగీర్లు
15. నిజాం రాష్ట్రపాలన
16. లిపి సంస్కరణ
కలం పేర్లు:
1. అమృత కలిశి 2. విశ్వామిత్ర
3. సంగ్రహసింహ 4. జంగం బసవయ్య
5. చిత్రగుప్త 6.భావకవి రామ్మూర్తి