ఐక్యరాజ్యసమితి అభివృద్ధి కార్యక్రమం (యూఎన్‌డీపీ) 2020, డిసెంబర్ 15న విడుదల చేసిన ‘‘ప్రపంచ మానవాభివృద్ధి సూచీ-2020’’లో భారత్‌కు 131వ స్థానం లభించింది.
189 దేశాలతో రూపొందించిన ఈ సూచీలో నార్వే అగ్రస్థానంలో నిలిచింది. నార్వే తర్వాతి స్థానాల్లో వరుసగా ఐర్లాండ్, స్విట్జర్లాండ్, హాంకాంగ్, ఐస్‌లాండ్ ఉన్నాయి.
అట్టడుగున 189 స్థానంలో నైగర్ ఉంది. గత మూడు దశాబ్దాలుగా ఐక్యరాజ్యసమితి ఈ మానవాభివృద్ధి సూచీ నివేదికలను ఏటా విడుదల చేస్తోంది. ప్రతి దేశమూ తమ పనితీరు సమీక్షించుకుని సవరించుకుంటాయని దాని ఆశ.
ఆయా దేశాల్లో ఆరోగ్యం, విద్య, జీవన ప్రమాణాలను విశ్లేషించడం ద్వారా ఈ సూచీని రూపొందిస్తారు. భారత్ 2018 మానవాభివృద్ధి సూచీలో 130వ స్థానంలో, 2019 సూచీలో 129వ స్థానంలో ఉంది.
2020 ప్రపంచ మానవాభివృద్ధి సూచీ-ముఖ్యాంశాలు
- సూచీలో భారత్ కంటే కాస్త మెరుగ్గా భూటాన్ 129వ స్థానంలో నిలిచింది. బంగ్లాదేశ్ (133), నేపాల్ (142), పాకిస్తాన్ (154) మన దేశం కంటే వెనకంజలో ఉన్నాయి.
- 2019లో భారత్‌లో సగటు ఆయుర్దాయం 69.7 ఏళ్లుగా ఉంది. ఈ విలువ బంగ్లాదేశ్‌లో 72.6 ఏళ్లు, పాకిస్తాన్‌లో 67.3 ఏళ్లు, నేపాల్‌లో 70.8 ఏళ్లు, భూటాన్‌లో 71.8 ఏళ్లుగా ఉంది.
- పదివేల జనాభాకు సగటున మయన్మార్‌లో పది బెడ్లు వుంటే, భారత్‌లో అయిదు మాత్రమే వున్నాయి. బంగ్లాదేశ్‌లో అవి 8 అయితే, పాకిస్తాన్‌లో 6.
- పదివేల జనాభాకు మన దేశంలో సగటున 8.6 వైద్యులుంటే పాకిస్తాన్‌లో ఆ సంఖ్య 9.8.
2020 ప్రపంచ మానవాభివృద్ధి సూచీ(హెచ్‌డీఐ)
| ర్యాంకు | దేశం | హెచ్‌డీఐ విలువ (2019 సం॥) |
| 1 | నార్వే | 0.957 |
| 2 | ఐర్లాండ్ | 0.955 |
| 2 | స్విట్జర్లాండ్ | 0.955 |
| 4 | హాంకాంగ్ | 0.949 |
| 4 | ఐస్‌లాండ్ | 0.949 |
| 6 | జర్మనీ | 0.947 |
| 7 | స్వీడన్ | 0.945 |
| 8 | నెదర్లాండ్స్ | 0.944 |
| 8 | ఆస్ట్రేలియా | 0.944 |
| 10 | డెన్మార్క్ | 0.940 |
| 17 | అమెరికా | 0.926 |
| 72 | శ్రీలంక | 0.782 |
| 114 | దక్షిణాఫ్రికా | 0.709 |
| 129 | భూటాన్ | 0.654 |
| 131 | భారత్ | 0.645 |
| 133 | బంగ్లాదేశ్ | 0.632 |
| 142 | నేపాల్ | 0.602 |
| 154 | పాకిస్తాన్ | 0.557 |
| 185 | బురుండి | 0.433 |
| 185 | సౌత్ సుడాన్ | 0.433 |
| 187 | చాద్ | 0.398 |
| 188 | సెంట్రల్ ఆఫ్రికన్ రిపబ్లిక్ | 0.397 |
| 189 | నైగర్ | 0.394 |