ఇబ్రహీం కులీ కుతుబ్‌షా వంశపాలన 1550లో ఆరంభమైంది. వీరి వంశపాలనలో
ఇబ్రహీం కులీ కుమారుడైన మహ్మద్‌కులీ (1580-1612) పాలనలో హైదరాబాద్ నగరానికి
శంకుస్థాపన జరిగి, అభివృద్ధి చెందింది.
మొగలుల కాలంలో దక్కన్ సుభాకు 1713లో గవర్నర్‌గా వచ్చిన మీర్ కమురుద్దీన్
(అసఫ్‌జా నిజాం ఉల్ ముల్క్) 1724లో స్వతంత్రంగా హైదరాబాద్ రాజ్యాన్ని
స్థాపించాడు.
నిజాం రాజ్య ఆర్థికస్థితి
1724 నుంచి 1948, సెప్టెంబర్ 17 వరకు నిజాం రాజుల పాలనలో ఉన్న
హైదరాబాద్ రాజ్యం ఆర్థికంగా వెలుగొందింది. బ్రిటిష్ వారికి కప్పం
చెల్లిస్తూ రుణాలను కూడా ఇవ్వడమే కాకుండా, ఆర్థిక మిగులు ఉన్న రాష్ట్రంగా
హైదరాబాద్ ఉండేది. 1948-49లో జేఎన్ చౌదరి ఆధ్వర్యంలో మిలిటరీ ప్రభుత్వం,
1949 నుంచి 1952 వరకు కేఎం వెల్లోడి ప్రభుత్వం, 1956 వరకు హైదరాబాద్ స్టేట్
పౌరప్రభుత్వం కొనసాగాయి. అప్పటివరకు తెలంగాణ ప్రాంతం ఆర్థిక పరిపుష్టి
కలిగిన రాష్ట్రంగా ఉండేది.
ద్రవ్యపరమైన, ఆర్థిక స్థిరత్వ విషయాల్లో హైదరాబాద్ రాష్ట్రం
అందలమెక్కింది. చార్మినార్ వీధుల్లో వజ్రాలను రాసులుగా పోసి
విక్రయించేవారని నానుడి ఉంది.
నిజాం రాజ్య జనాభా వివరాలు
- నిజాం రాజ్యం 82,689 చ.కి.మీ. విస్తీర్ణంలో ఉండేది.
- తెలంగాణ భూభాగం – 50 శాతం
- మరఠ్వాడ ప్రాంతం – 28 శాతం
- కన్నడ ప్రాంతం – 22 శాతం
- పై నాలుగు డివిజన్లను 14 జిల్లాలుగా విభజించి పాలించారు. అవి.. ఆదిలాబాద్, ఔరంగాబాద్, పర్బని, బీదర్, గుల్బర్గా, హైదరాబాద్, కరీంనగర్, మహబూబ్‌నగర్, నాందేడ్, నిజామాబాద్, ఉస్మానాబాద్, రాయచూర్, వరంగల్, మెదక్, నల్లగొండ.
- ఈ మొత్తం జిల్లాలను మళ్లీ 2 లేదా 3 తాలుకాలుగా, తాలూకాలను గ్రామాలుగా విభజించారు.
- ఆ విధంగా అప్పట్లో 23,360 గ్రామాలు ఉండేవి.
- ఇలా నిజాం రాజ్యం సగానికిపైగా తెలంగాణ ప్రాంతంతో వైభవంగా వెలుగొందింది. రాజ్యంలో 50 శాతం ప్రజలు తెలుగు, 25 శాతం మరాఠీ, 11 శాతం కన్నడ, 12 శాతం ఉర్దూ, కొద్దిమంది అరబ్బీ, పార్సీ, గిరిజన భాషలను మాట్లాడేవారు ఉన్నారు.
- మొత్తం జనాభాలో 82 శాతం హిందువులు, 12 శాతం ముస్లింలు, 6 శాతం ఇతర మతాల వారు ఉండేవారు. అయితే, మెజారిటీ ప్రజలు హిందువులుగా ఉన్నా ముస్లిం రాజుల పాలనలో ఉంది కాబట్టి రెండు మతాలు సరిసమానంగా రాజ్యాన్ని శాసించేవి.
ఇతర భాషలు మిగిలినవారు
- – విశాలమైన విస్తీర్ణం, సహజ వనరులు, అధిక జనాభా, వివిధ రకాల నైతిక, పాలనాపరమైన అంశాలతో కొన్ని రాష్ర్టాల సమూహాల కంటే ఎక్కువ విస్తీర్ణంతో The Dominions of his Exalted Highness అనే అధికారిక పేరుతో బ్రిటిష్ ఇండియాలో అత్యంత పెద్ద రాజ్యంగా ఉండేది.
- సొంత కరెన్సీ వ్యవస్థ, పోస్టల్ స్టాంపులు, ప్రత్యేక రైల్వే వ్యవస్థ, ఆర్థిక వనరులతో హైదరాబాద్ సుసంపన్న రాష్ట్రంగా ఉండేది.
- 1881 అధికారిక లెక్కల ప్రకారం నిజాం రాజ్య జనాభా 9.8 మిలియన్లు, 1951 నాటికి అది 18.7 మిలియన్లకు చేరింది.
- జనాభా వృద్ధి రేటు దేశంలో కంటే నిజాం రాజ్యంలో ఎక్కువ.
- 1891లో మొత్తం కార్మికుల్లో 10.9 శాతంగా ఉన్న వ్యవసాయ కార్మికులు 1941 నాటికి 41.4 శాతానికి చేరారు. రైతుల వాటా 1891లో 87.2 శాతంగా ఉండి, 1941 నాటికి 47.9 శాతానికి తగ్గింది.
- 1951లో వ్యవసాయ కార్మికుల వాటా 25.2 శాతానికి తగ్గగా రైతుల వాటా 71.4 శాతానికి పెరిగింది.
నిజాం కాలం నాటి భూవిధానాలు
- ఎక్కువ మొత్తం ప్రభుత్వ రెవెన్యూలో ఉండేది. దీన్ని దివానీ అనేవారు. (బ్రిటిష్ కాలంలోని రైత్వారీ విధానంగా ఉండేది)
- మిగిలిన భూములు వివిధ రకాల భూస్వాముల చేతుల్లో ఉండేవి. అవి జాగీర్దార్లు, ఇనామ్‌దార్లు, పైగా, సంస్థానాధీశులు మొదలైనవారి చేతిలో ఉండేవి.
- రాష్ట్ర ఆదాయ, వ్యయాలను, జాగీర్ల కేటాయింపులను దఫ్తర్-ఎ-మాల్, దఫ్తర్-ఎ-దివానీ అనే కార్యాలయాలు పరిశీలించేవి.
- ప్రభుత్వ అధికారిక ఉత్తర, ప్రత్యుత్తరాలు దారుల్ ఇన్షా కార్యాలయం నిర్వహిస్తుండేది.
- ఈ మూడు కార్యాలయాలు కేంద్ర పరిపాలనా వ్యవస్థలో ఉండి, ప్రభుత్వ కార్యక్రమాలను నిర్వహిస్తుండేవి.
- తాలుకా స్థాయిలో మున్సిపల్ కార్యాలయాలు ప్రభుత్వ ప్రత్యక్ష పాలనలో ఉండేవి.
- తాలుకాదారుడు, వారి కింది ఉద్యోగులు వసూలు చేసే శిస్తు రికార్డుల్లో చూపకపోవడంతో ప్రభుత్వ ఖజానాకు నష్టం వచ్చేది.
నిజాం ఆర్థిక వ్యవస్థ ముఖ్యాంశాలు
ఏదైనా ప్రాంత అభివృద్ధికి సహజవనరులు, మానవ వనరులు అత్యంత ముఖ్యం. ముఖ్యంగా తెలంగాణకు మూడు వనరులు సంపూర్ణంగా ఉండి ఆర్థికంగా తెలంగాణను పరిపుష్టి చేశాయి. నిజాం రాజ్యంలో వ్యవసాయం, పరిశ్రమలు అభివృద్ధి చెందాయి. గోదావరి, కృష్ణ, పెన్‌గంగ, ప్రాణహిత, మంజీర, మూసి, డిండి, వైరా, మానేరు, మున్నేరు మొదలైన నదులతోపాటు పెద్ద పెద్ద చెరువులు నిజాం రాజ్యన్ని సస్యశ్యామలం చేసేవి. వీటితోపాటు చెరువులు, కుంటలు, బావులు హైదరాబాద్ స్టేట్ వ్యవసాయాన్ని సుస్థిరం చేశాయి.
నిజాం రాజ్యంలో విస్తరించి ఉన్న చెల్కలు, సారవంతమైన నేలలన్నీ కలిపి పత్తి, చెరుకు, వరి, జొన్న, మక్కజొన్న, మసాలాలు, పొగాకు, పప్పుధాన్యాలు పండించడానికి అనువైన ప్రాంతంగా తీర్చిదిద్దారు.
విస్తారమైన అడవులు, ఖనిజ వనరులు, ముడిసరుకులైన బొగ్గు, ఇనుము, గ్రాఫైట్, మైకా, గ్రానైట్, సున్నపురాయి, క్వార్ట్ మొదలైనవి హైదరాబాద్ స్టేట్‌ను పారిశ్రామికంగా అగ్రగామిగా నిలబెట్టాయి. అంతేకాకుండా దేశంలో అన్ని ప్రాంతాల కంటే ముందుగానే ఎన్నో రకాలైన పరిశ్రమల స్థాపనకు అనువైన ప్రదేశమని గుర్తింపు పొందింది.
పై అంశాలన్నింటిని బేరీజు వేసుకుని హైదరాబాద్ స్టేట్ అన్ని రాష్ర్టాల కంటే వ్యవసాయం, పారిశ్రామికంగా అభివృద్ధి చెందిన ప్రాంతమని అనుకోవచ్చు. అయితే, సాలార్జంగ్‌గా ప్రసిద్ధి చెందిన మీర్ తురబ్ అలీఖాన్ 1853లో ఎన్నో సంస్కరణలు ప్రవేశపెట్టి నిజాం రాజ్య స్వరూపాన్ని మార్చివేశాడు.
కేవలం 24 ఏండ్ల వయస్సులోనే నిజాం రాజ్య ప్రధాని అయిన మీర్ తురబ్ అలీఖాన్ హైదరాబాద్ స్టేట్ అప్పుల్లో ఉండటం చూసి తట్టుకోలేకపోయాడు. ఇంత వైభవమైన రాష్ర్టాన్ని ఎలాగైనా ముందుకు తీసుకెళ్లాలనే ఉద్దేశంతో హైదరాబాద్ స్టేట్‌ను సంస్కరణల బాటపట్టించాడు.