తెలంగాణ నైసర్గిక స్వరూపం

        తెలంగాణ రాష్ట్రం దక్కన్ పీఠభూమిలో భాగం. పురాతన గోండ్వానా ప్రాంతం నుంచి విడిపోయిన ఈ ప్రాంతాన్ని తెలంగాణ పీఠభూమిగా అభివర్ణిస్తాం.

  • రాష్ట్రంలోని 31 జిల్లాలు దక్కన్ పీఠభూమిలో భాగంగా ఉన్నాయి.
  • భౌమశిలావిన్యాసం ఆధారంగా రాష్ట్రంలోని భూభాగం 80 శాతం వరకు కఠిన శిలలైన గ్రానైట్స్, నీస్, సిష్ట్, బసాల్ట్ శిలలతో కూడి ఉన్నది. మిగిలిన ప్రాంతం గోండ్వానా శిలలు, నవీన ఒండ్రుమట్టితో నిర్మితమై ఉంది.
  • హైదరాబాద్, రంగారెడ్డి, వికారాబాద్, మేడ్చల్ జిల్లాలు-గ్రానైట్ శిలలతో ఏర్పడిన టర్స్, బౌల్డర్స్ తదితర ఆకారాలతో ఏర్పడిన కొండలు, గుట్టలు విస్తరించి ఉన్నాయి.
  • వికారాబాద్, జోగుళాంబ గద్వాల జిల్లాల మధ్య ప్రాంతం- బసాల్ట్ లావాతో ఏర్పడిన కొత్త మైదానాలు
  • నిజామాబాద్, కామారెడ్డి, మెదక్, సంగారెడ్డి జిల్లాలు – నీస్, గ్రానైట్ శిలలతో కూడి ఉన్నాయి.
  • జగిత్యాల, మంచిర్యాల, పెద్దపల్లి, జయశంకర్ భూపాలపల్లి, ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలు – గోదావరి నది లోయలో భాగంగా ఉండటం వల్ల పురాతన గోండ్వానా శిలలతో బొగ్గు నిక్షేపాలు ఏర్పడి ఉన్నాయి.
  • గోండ్వానా శిలల్లో ప్రధాన ఖనిజం – బొగ్గు
  • రాష్ట్రంలో నేలబొగ్గును వెలికితీసే సంస్థ – సింగరేణి కాలరీస్ కంపెనీ లిమిటెడ్ (ఎస్‌సీసీఎల్). దీన్ని 1921లో సింగరేణిలో స్థాపించారు. దీని ప్రధాన కార్యాలయం – కొత్తగూడెం

        భారతదేశ జియాలజికల్ సర్వే ప్రకారం తెలంగాణకు చెందిన శిలలను నాలుగు విభాగాలుగా విభజించారు.అవి…

1. ఆర్కియన్ శిలలు
2. వింధ్య శిలలు
3. గోండ్వానా శిలలు
4. ద్రవిడియన్ శిలలు

  • ఇవేకాక ద్వీపకల్ప నైసిస్ అనే క్లిష్టమైన శిలలు కూడా తెలంగాణలో ఉన్నాయి.

         సముద్ర మట్టం ఎత్తును ఆధారంగా చేసుకుని తెలంగాణ ను మూడు ప్రాంతాలుగా విభజించవచ్చు. అవి…

1. సముద్ర మట్టం నుంచి 300 మీటర్ల కంటే తక్కువ ఎత్తు ఉన్న ప్రాంతం
-ఈ ప్రాంతం ప్రధానంగా నల్లగొండ జిల్లా, గోదావరి నదికి ఇరువైపులా వ్యాపించి ఉన్న ఖమ్మం (భద్రాద్రి కొత్తగూడెం), వరంగల్ (జయశంకర్ భూపాలజిల్లా), కరీంనగర్ (పెద్దపల్లి), ఆదిలాబాద్ (నిర్మల్), మంచిర్యాల జిల్లాల్లో వ్యాపించి ఉంది.
-ఈ ప్రాంతాలు వ్యవసాయానికి అనుకూలంగా ఉంటాయి.

2. సముద్ర మట్టం కంటే 300 నుంచి 600 మీటర్ల ఎత్తు గల ప్రాంతం
-ఇది రాష్ట్ర పశ్చిమభాగంలోని రంగారెడ్డి, వికారాబాద్, మహబూబ్‌నగర్, వనపర్తి, జోగుళాంబ గద్వాల, నిజామాబాద్, కామారెడ్డి, వరంగల్ జిల్లాల్లో వ్యాపించి ఉంది.
-దక్షిణాన గల కృష్ణ, తుంగభద్ర లోయలు 300 మీటర్ల నుంచి 450 మీటర్ల ఎత్తు వరకు ఉన్నాయి.
-ఈ ప్రాంతాలు ఎక్కువగా నీటి వనరులతో కూడిన సరస్సులతో ఉండి వ్యవసాయానికి అనుకూలంగా ఉంటాయి.

3. సముద్ర మట్టం నుంచి 600 మీటర్ల పైన ఎత్తుగల ప్రాంతం
-ఈ ప్రాంతం ప్రధానంగా పశ్చిమ, దక్షిణ ఆగ్నేయ, నైరుతి ప్రాంతాల్లో విస్తరించి ఉంది.
-ముఖ్యంగా హైదరాబాద్, రంగారెడ్డి, సంగారెడ్డి జిల్లా నైరుతి, ఆగ్నేయ ప్రాంతం, మహబూబ్‌నగర్ ఉత్తరప్రాంతంలో వ్యాపించి ఉన్నాయి.
-ఈ ప్రాంతపు వాలు తూర్పు దిశగా వాలి ఉంటుంది. దీంతో ఈ ప్రాంతంలోని కృష్ణ, గోదావరి, వాటి ఉపనదులు తూర్పు వైపు ప్రవహిస్తాయి. లేదా వాయవ్యం నుంచి ఆగ్నేయానికి వాలుగా ఉంటుంది.
 

        తెలంగాణ ప్రాంత నిర్మాణం, స్వరూపాన్ని బట్టి మూడు ప్రాంతాలుగా విభజించవచ్చు.అవి..

1. తెలంగాణ పీఠభూమి
2. గోదావరి బేసిన్ ప్రాంతం
3. కృష్ణ పర్వతపాద ప్రాంతం

తెలంగాణ పీఠభూమి

  • ఈ పీఠభూమిని తెలంగాణలో అతిపెద్ద పీఠభూమి ప్రాంతంగా పిలుస్తారు.
  • దీని సరాసరి ఎత్తు సముద్ర మట్టానికి 500 నుంచి 600 మీటర్ల మధ్యలో ఉంటుంది.
  • దీని విస్తీర్ణం 59,903 చ.కి.మీ.గా వ్యాపించి ఉంది.
  • ఈ పీఠభూమి ఆదిలాబాద్, నిజామాబాద్, మెదక్, హైదరాబాద్, మహబూబ్‌నగర్, కరీంనగర్, వరంగల్, ఖమ్మం, నల్లగొండ జిల్లాల్లో వ్యాపించి ఉంది. వీటితోపాటు కొత్త జిల్లాలైన నిర్మల్, కామారెడ్డి, సంగారెడ్డి, కుమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లాలో విస్తరించి ఉన్నాయి.
  • ఈ పీఠభూమి ప్రాంతమంతా చిన్న కొండలు, గుట్టలు, ఎత్తుపల్లాల స్థలాకృతిని కలిగి తూర్పు దిశకు వాలి ఉంటుంది.
  • ఈ గుట్టలను వివిధ జిల్లాల్లో వివిధ పేర్లతో పిలుస్తారు.

 

గోదావరి బేసిన్ ప్రాంతం

  • గోదావరి బేసిన్‌ను భారతదేశ ద్వీపకల్పం ముఖ్య లక్షణంగా పేర్కొంటారు. కారణం ద్వీపకల్ప ప్రాంతంలో అతిపెద్ద నది గోదావరి ప్రవహించడం. ఈ ప్రాంతాన్ని గోదావరి పరీవాహక ప్రాంతంగా కూడా పిలుస్తారు.
  • ఈ ప్రాంతపు విస్తీర్ణం 37,934 చ.కి.మీ.
  • ఇది నిజామాబాద్, నిర్మల్, జగిత్యాల, మంచిర్యాల, పెద్దపల్లి, జయశంకర్ భూపాలపల్లి, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాల్లో విస్తరించి ఉంది.
  • ఈ ప్రాంతపు ఏటవాలు భాగం వర్షాకాలంలో కోతకు గురై నేల క్రమక్షయమవుతుంది.
  • ఇది కార్బొనిఫెరస్ రాళ్లు, ఆర్కియన్ నీస్ శిలలతో నిర్మితమై ఉంది.

 

కృష్ణ పర్వతపాద ప్రాంతం

  • కృష్ణానది మహబూబ్‌నగర్, వనపర్తి, జోగుళాంబ గద్వాల, నాగర్‌కర్నూలు, నల్లగొండ, సూర్యాపేట జిల్లాల్లో వ్యాపించి ఉంది.
  • ఈ నది ప్రాంతం తెలంగాణలో సుమారుగా 14,240 చ.కి.మీ. విస్తరించి ఉంది. రాష్ట్రంలో ఇది చిన్న ప్రాంతం (పై మూడింటిలో)
  • ఈ ప్రాంతంలోని భూభాగం ఎత్తు పల్లాలుగా ఉంది.
  • భూగర్భశాస్త్రపరంగా ఇది ఆర్కియన్ రాళ్లు, ప్రీకామ్‌బ్రియన్ శిలలతో నిర్మితమైంది.
  • ఈ ప్రాంతం ప్రధానంగా ఒక బహిర్గతమైన శిలా ఉపరితలం.
  • తెలంగాణ సముద్ర మట్టానికి సగటున 500 మీటర్ల నుంచి 600 మీటర్ల ఎత్తులో ఉంది.
  • హైదరాబాద్ – 600 మీటర్ల ఎత్తులో
  • కృష్ణ- తుంగభద్ర నదీ లోయల మధ్య – 300- 450 మీటర్ల ఎత్తులో
  • భీమ- గోదావరి నదుల మధ్య – 730 మీటర్ల ఎత్తులో (హైదరాబాద్, వరంగల్, ఖమ్మం మధ్య ప్రాంతం)
  • మెదక్, మహబూబ్‌నగర్ జిల్లాల మధ్య ఈ పీఠభూమి – 600 – 900 మీటర్ల ఎత్తులో విస్తరించి ఉంది.
  • దక్కన్ పీఠభూమి వాయవ్య దిశ నుంచి ఆగ్నేయ దిశకు వాలుగా ఉండడంతో గోదావరి, కృష్ణ మొదలైన నదులన్నీ తూర్పుగా ప్రవహించి బంగాళాఖాతంలో కలుస్తున్నాయి.

 

       కొండలు/ గుట్టలు వివిధ జిల్లాల్లో వాటికి గల పేర్లు జిల్లా పేరు – కొండలు/ గుట్టలు

1. ఆదిలాబాద్ – బోథ్ పంక్తులు, ఉట్నూర్ పంక్తులు (సత్నాల గుట్టలు)
2. నిర్మల్ – నిర్మల్ గుట్టలు, ఖానాపూర్ గుట్టలు
3. కుమ్రంభీం ఆసిఫాబాద్ – సిర్పూరు కొండలు
4. మంచిర్యాల – గోతి కొండలు
5. కరీంనగర్ – రాఖీ కొండలు
6. రాజన్న సిరిసిల్ల – రాఖీ కొండలు
7. జగిత్యాల, పెద్దపల్లి – రామగిరి కొండలు
8. నిజామాబాద్ – సిర్నాపల్లి శ్రేణులు
9. కామారెడ్డి – రాతిగుట్టలు
10. జయశంకర్ భూపాలపల్లి – పాండవుల గుట్టలు
11. వరంగల్ (అర్బన్) – హన్మకొండలు
12. వరంగల్ (రూరల్) – హసన్‌పర్తి గుట్టలు
13. మహబూబ్‌నగర్ – కందికల్ గుట్టలు
14. ఖమ్మం – రాజు గుట్టలు, యల్లండ్లపాడు గుట్టలు
15. భద్రాద్రి కొత్తగూడెం – పాపికొండలు
-గోదావరి నది పాపికొండలను చీల్చుతూ ప్రవహిస్తున్నది (తెగలు- కోయలు, కొండరెడ్డి, లంబాడలు)
16. నల్లగొండ – నల్లమల కొండలు, నాగార్జున కొండలు, నంది కొండలు, దేవరకొండలు
-నందికొండ వద్ద – నాగార్జున సాగర్ ప్రాజెక్టు ఉంది
-నాగార్జునకొండ – బౌద్ధారామ వస్తువులతో మ్యూజియం ఉంది
17. యాదాద్రి భువనగిరి – యాదాద్రి గుట్టలు, భువనగిరి కొండలు, సురేంద్రపురి కొండలు
18. వికారాబాద్ – అనంతగిరి కొండలు
-అనంతగిరి కొండలు – మూసీనది జన్మస్థలం ( వికారాబాద్ – శివారెడ్డిపేట), వనమూలికలకు ప్రసిద్ధి, కొండల్లో అనంత పద్మనాభస్వామి ఆలయం ఉంది
19. మేడ్చల్ – కీసరగుట్టలు
20. హైదరాబాద్ – గోల్కొండ, రాచకొండలు
రాచకొండలు – రాచకొండ పంక్తులు (దక్షిణ, తూర్పు దిశలో దేవరకొండ (నల్లగొండ)ల వరకు
-పశ్చిమ దిశలో – వికారాబాద్ జిల్లా అనంతగిరి కొండల వరకు
-దక్షిణ దిశలో – రంగారెడ్డి జిల్లా షాబాద్ కొండల వరకు విస్తరించి ఉన్నాయి
21. రంగారెడ్డి (శంషాబాద్) – షాబాద్ కొండలు (డిండినది జన్మస్థలం)
22. మెదక్ – బూజు గుట్టలు
23. సంగారెడ్డి – బూజు గుట్టలు
24. సిద్దిపేట – లక్ష్మిదేవుపల్లి కొండలు
25. మహబూబ్‌నగర్ – షాబాద్ కొండలు
26. నాగర్‌కర్నూలు – అమ్రాబాద్ కొండలు, నల్లమల కొండలు (తెగ- చెంచులు)
-నల్లమల కొండలు – కృష్ణ- పెన్నా నదుల మధ్య విస్తరించాయి.

 

జిల్లాలు- భౌమశిల విన్యాసం
1. ఆదిలాబాద్ – పశ్చిమభాగంలో మిసోజోయిక్ శిలల నిర్మాణాలు కనిపిస్తాయి. అక్కడక్కడ ఆర్కియన్, ప్రికాంబ్రియన్, పాలిమోజోయిక్ కాలపు శిలలతో నిర్మితమై ఉంది.
2. కుమ్రం భీం ఆసిఫాబాద్ – ఈ ప్రాంతంలోని శిలలు కార్బొనిఫెరస్ కాలంలోని ట్రాయాసిక్, క్రిటాసియస్ శిలలతో నిర్మితమై ఉన్నాయి.
3. మంచిర్యాల – ఈ ప్రాంతంలోని శిలలు కార్బొని ఫెరస్ కాలంలోని ట్రాయాసిక్, క్రిటాసియస్ శిలలతో నిర్మితమై ఉన్నాయి. అక్కడక్కడ ఆర్కియన్, ప్రికాంబ్రియన్, పాలిమోజోయిక్ కాలపు శిలలతో నిర్మితమై ఉన్నాయి. గోదావరి లోయలో గోండ్వానా శిలలు ఏర్పడ్డాయి.
4. నిర్మల్ – ఈ ప్రాంతంలోని శిలలు ఆర్కియన్ శిలలతో నిర్మితమై ఉన్నాయి.
-నిర్మల్, మంచిర్యాల జిల్లాల సరిహద్దు వెంబడి గోదావరి నది ప్రవహిస్తుండటంతో గోండ్వానా శిలల నిర్మాణాలు గోదావరి లోయలో ఏర్పడ్డాయి.
-గోదావరి నది నిజామాబాద్, జగిత్యాల, పెద్దపల్లి, జయశంకర్ భూపాలపల్లి, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాల గుండా ప్రవహిస్తుంది. ఈ పరీవాహక ప్రాంతం వెంట గోండ్వానా శిలల నిర్మాణాలు ఉన్నాయి. ఇక్కడి శిలల్లో దొరికే ప్రధాన ఖనిజం – బొగ్గు
5. నిజామాబాద్ – ఈ ప్రాంతంలోని శిలలు ఆర్కియన్ నీస్ శిలలతో ఏర్పడ్డాయి.
6. కామారెడ్డి – ఈ ప్రాంతంలోని శిలలు ప్లిస్టొసీన్ కాలానికి చెందిన బిళ్లరాయి(లాటరైట్)తో ఏర్పడ్డాయి. (కామారెడ్డి, ఎల్లారెడ్డి, దోమకొండ) నిజామాబాద్ జిల్లాలోని భీమ్‌గల్, సిర్నాపల్లి ప్రాంతాలు. ప్లిస్టోసీన్ కాలానికి చెందిన బిళ్లరాయితో ఏర్పడ్డాయి. వీటినే సిర్నాపల్లి పంక్తులు, రాతి గుట్టలు అంటారు.
7. కరీంనగర్ – ఈ ప్రాంతంలోని శిలలు ఆర్కియన్ నీస్ శిలలతో నిర్మితమయ్యాయి.
8. పెద్దపల్లి – ఈ ప్రాంతంలోని శిలలు ముఖ్యంగా కరీంనగర్, పెద్దపల్లి జిల్లాల తూర్పు భాగంలో ఎగువన కార్బోనిఫెరస్, దిగువన ట్రాయాసిక్, క్రిటాసియస్ కాలానికి చెందిన శిలలు ఉంటాయి.
9. రాజన్న సిరిసిల్ల – ఈ ప్రాంతంలోని శిలలు ఆర్కియన్ నీస్, గ్రానైట్ శిలలతో నిర్మితమయ్యాయి.