శీతోష్ణస్థితి (Climate)
- ఒక ప్రాంతంలో గడిచిన 30 ఏండ్లకు సంబంధించిన వాతావరణ పరిస్థితులను తెలపడాన్ని శీతోష్ణస్థితి అంటారు.
- శీతోష్ణస్థితిని ఉష్ణోగత్ర వ్యత్యాసం, వర్షపాత వ్యత్యాసం, పీడన వ్యత్యాసం మొదలైన అంశాలు ప్రభావితం చేస్తాయి. ‘
వాతావరణం
- అనేక వాయువుల మిశ్రమాన్ని వాతావరణం అంటారు. దీన్ని ఉష్ణోగ్రత, వర్షపాతం, పీడనం, తేమ మొదలైన అంశాలు ప్రభావితం చేస్తాయి.
- శీతోష్ణస్థితిని గురించి అధ్యయనం చేసే శాస్ర్తాన్ని క్లైమటాలటీ అని, వాతావరణం గురించి అధ్యయనం చేసే శాస్ర్తాన్ని మెటీరియాలజీ అంటారు.
- మన దేశం మీదుగా 23 1/2Oల ఉత్తర అక్షాంశం అయిన కర్కటకరేఖ వెళ్తున్నది. అందువల్ల ఉత్తరభారతదేశం సమశీతోష్ణ మండలంలో, దక్షిణ భారతదేశం ఉష్ణమండలంలో ఉన్నది.
- కర్కాటక రేఖ (ఆయన రేఖ) భారతదేశాన్ని శీతోష్ణస్థితి పరంగా ప్రభావితం చేస్తున్నది. దేశం మొత్తం ఉష్ణమండల ఆయనరేఖా రుతుపవన శీతోష్ణస్థితి ఉంటుంది.
- తెలంగాణ ఉష్ణమండలంలో భాగంగా ఉండి, ఉత్తర తెలంగాణ ప్రాంతంలో ఉపార్ధ్ర శీతోష్ణస్థితి, దక్షిణ తెలంగాణలో అర్ధ్రశుష్క శీతోష్ణస్థితిని కలిగి ఉంది.
- తెలంగాణ శీతోష్ణస్థితి- ఉష్ణమండల ఆర్ధ్రశుష్క శీతోష్ణస్థితిని కలిగి ఉంది.
- ఇక్కడ సముద్ర ప్రభావంలేని పీఠభూమి ప్రాంతంలో ఉండటంతో వేసవిలో అధిక ఉష్ణం, శీతాకాలంలో అధిక చలి ఉంటుంది.
భారత వాతావరణ పరిశోధన సంస్థ పుణె అభిప్రాయం ప్రకారం తెలంగాణలో కాలాలు (శీతోష్ణస్థితులు) 4 రకాలుగా విభజించారు.
1) శీతాకాలం (Winter Season)
2) వేసవి కాలం (Summer Season)
3) నైరుతి రుతుపవన కాలం (South-west monsoon)
4) ఈశాన్య లేదా తిరోగమన నైరుతి రుతుపవన కాలం (North-east monsoon)
శీతాకాలం
- ఈ కాలం సాధారణం డిసెంబర్ నుంచి జనవరి వరకు ఉంటుంది.
- రాష్ట్రంలో చలితీవ్రత జనవరిలో ఎక్కువగా ఉంటుంది.
- ఉత్తర తెలంగాణ ప్రాంతంలో చలి ఎక్కువగా ఉంటుంది. ఇక్క శీతల గాలుల వల్ల ఉష్ణోగ్రతలు తక్కువగా నమోదవుతాయి. రాత్రి సమయంలో మంచు కురుస్తుంది.
- ఆసిఫాబాద్ జిల్లాలో అత్యల్ప ఉష్ణోగ్రత 3OC కెరామెరి (సిర్పూర్ కాగజ్‌నగర్)లో రికార్డయ్యింది.
గమనిక:
1. దేశంలో శీతాకాలం రావడానికి కారణం మధ్యదరా సముద్రం నుంచి వీచే పశ్చిమకల్లోలాలు.
2. దేశంలో అత్యల్ప ఉష్ణోగ్రత నమోదైన ప్రాంతం- కార్గిల్, ద్రాస్ సెక్టార్ (-40OC) జమ్ముకశ్మీర్
3. ప్రపంచంలో అత్యల్ప ఉష్ణోగ్రత అంటార్కిటికా ఖండంలోని జవోస్టాక్ (-88.3OC)లో నమోదయ్యింది.
4. దేశంలో అత్యల్ప ఉష్ణోగ్రత జవరిలో నమోదవుతుంది.
వేసవికాలం
- దేశంలో, తెలంగాణలో వేసవికాలం సంభవించడానికి ప్రధానకారణం సూర్యుడు ఉత్తరాయణంలోకి ప్రవేశించడం. ఇది డిసెంబర్ 23 నుంచి జూన్ 21 వరకు ఉంటుంది.
- అత్యధిక ఉష్ణోగ్రత మే నెలలో (దేశంలో, రాష్ట్రంలో) నమోదవుతుంది.
- ఈ కాలంలో సూర్యకిరణాలు నిటారుగా పడి ఎక్కువ వేడిమిని ఇస్తాయి.
- రాష్ట్రంలో తీవ్రవేడి వల్ల వ్యాకోచం చెంది అక్కడ అల్పపీడనం ఏర్పడుతుంది.
- అల్పపీడన ప్రాంతంలో క్యుములోనింబస్ మేఘాలవల్ల ఉరుములు, మెరుపులతో కూడిన ఈదురుగాలులు వీచి వర్షాన్ని ఇస్తాయి. వీటినే సంవహన వర్షాలు అంటారు.
- మే నెల (చివరి వారం)లో నైరుతి రుతుపవనాల రాకతో దేశమంతటా వర్షాలు కురుస్తాయి. వీటినే తొలకరి జల్లులు (ఏరువాక జల్లులు) లేదా మాన్‌సూన్ షవర్స్ అని పిలుస్తారు. ఈ వర్షాలు దేశంలో వివిధ పంటలు (కాఫీ, తేయాకు, జనుము) పెరగడానికి ఉపయోగపడుతాయి.
- రాష్ట్రంలోని ఇతర జిల్లాలతో పోలిస్తే హైదరాబాద్‌లో వేసవి వాతావరణం చలా చల్లగా ఉంటుంది.
- నిజామాబాద్, కామారెడ్డి, నిర్మల్, ఆదిలాబాద్, ఆసిఫాబాద్, మంచిర్యాల, జగిత్యాల, కరీంనగర్, సిరిసిల్ల, మెదక్, సిద్దిపేట జిల్లాలు దక్కన్ పీఠభూమిలో ఉండటంతో అత్యధిక, అత్యల్ప ఉష్ణోగ్రతలు నమోదవుతాయి.
- ఈ కాలంలో రాష్ట్రంలో పగటిపూట వేడిగా ఉండి రాత్రులలో చల్లగా ఉంటుంది. రాత్రి-పగలు ఉష్ణోగ్రతల్లో చాలా వ్యత్యాసం ఉంటుంది. దీనికి కారణం ఖండాంతర్గత శీతోష్ణస్థితి.
- రాష్ట్రంలో అత్యధిక ఉష్ణోగ్రత కొత్తగూడెం (48OC), రామగుండం (46.5OC)లో నమోదవుతుంది.
- గోదావరి పరీవాహక ప్రాంతం వెంబడిగల జిల్లాలైన ఆసిఫాబాద్, మంచిర్యాల, పెద్దపల్లి, జయశంకర్ భూపాలపల్లి, వరంగల్ గ్రామీణ, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాల్లో గోండ్వానా శిలలను కలిగి బొగ్గును కలిగి ఉండటంతో ఓపెన్‌కాస్ట్ గనులు వెలువరించే కార్బన్ డై ఆక్సైడ్ వంటి వాయువులతో గోదావరి నది పరివాహక జిల్లాలు గరిష్ట ఉష్ణోగ్రతలను నమోదు చేస్తాయి.
గమనిక:
1. రాష్ట్ర సగటు అత్యధిక ఉష్ణోగ్రత- 31.5OC
2. దేశ సగటు అత్యధిక ఉష్ణోగ్రత- 35.5OC (నాగ్‌పూర్)
3. దేశంలో గరిష్ఠ ఉష్ణోగ్రత నమోదైన ప్రాంతం- జైసల్మీర్ (బర్మార్ లోయ- రాజస్థాన్- 50OC)
4. ప్రపంచంలో గరిష్ఠ ఉష్ణోగ్రత నమోదైన ప్రాంతం- లిబియాలోని అల్ అజీజియా (సహారా ఎడారి) 58OC
వర్షాకాలం
రాష్ట్రంలో రెండు రకాల రుతుపవనాలు ఉన్నాయి. అవి నైరుతి రుతుపవన కాలం (జూన్-సెప్టెంబర్), ఈశాన్య రుతుపవనకాలం (అక్టోబర్-నవంబర్)
నైరుతి రుతువనకాలం
- నైరుతి రుతుపవనాలు మే చివరణ అరేబియా మలబారు తీరానికి చేరుకుని జూన్ 5 నుంచి తెలంగాణలో నైరుతి రుతుపవనాలుగా మారి వర్షానిస్తాయి.
- ఈ రుతుపవనాల వల్ల రాష్ట్రం 80 శాతం లబ్దిపోందుతున్నది.
- నైరుతి రుతుపవనాల వల్ల జూలై నెలలో అధిక వర్షపాతం సంభవిస్తుంది.
- ఈ రుతుపవన కాలంలో జూన్ నుంచి సెప్టెంబర్ మధ్యకాలంలో సాధారణంగా 713.5 మి.మీ. (2015-16లో), 912 మి.మీ. (2016-17లో) వర్షపాతం నమోదయ్యింది.
- దక్షిణ తెలంగాణలో సెప్టెంబర్ ప్రాంతంలో అధిక వర్షపాతం సంభవిస్తుంది.
- అధిక వర్షపాతం ఆదిలాబాద్ జిల్లాలో, అల్ప వర్షపాతం జోగుళాంబ గద్వాల జిల్లాలో నమోదవుతుంది.
ఈశాన్య రుతుపవన కాలం
- ఈ కాలంలో వర్షపాతం మన రాష్ట్రంలో 20 శాతం పడుతుంది.
- ఈశాన్య రుతుపవన కాలంలో సంభవించే సాధారణ వర్షపాతం- 129.2 మి.మీ. (2015-16 సీజన్‌లో 27.5 మి.మీ.)
- ఈ రుతుపవనాల వల్ల హైదరాబాద్‌లో అధికంగా వర్షపాతం నమోదవుతుంది.
- అతితక్కువ వర్షపాతం కరీంనగర్‌లో సంభవిస్తుంది.
- సాధారణంగా నైరుతి, ఈశాన్య రుతుపవనాల వల్ల సగటు అధిక వర్షపాతం సభవించే జిల్లా హైదరాబాద్, ఆదిలాబాద్ కాగా, అత్యల్ప వర్షపాతం జోగుళాంబ గద్వాల జిల్లాలో నమోదవుతుంది.
- రాష్ట్ర సగటు వర్షపాతం- 906.6 మి.మీ. (దేశంలో 1082 మి.మీ.)
- రాష్ట్రంలో 24 గంటల్లో అత్యధిక వర్షపాతం భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని పూరూరు (58.12 సెం.మీ.)లో నమోదయ్యింది.
- రాష్ట్రంలో అత్యధిక వర్షపాతం కురిసే ప్రాంతం- భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని శబరి-సీలేరు బేసిన్ ప్రాంతం (152 సెం.మీ.)
- తెలంగాణలో వార్షిక వర్షపాతం అస్తిరత ఉత్తర వాయవ్య ప్రాంతంలో తక్కువగా ఉంటుంది.
- పూర్వపు జిల్లాలు నిజామాబాద్, ఆదిలాబాద్, వరంగల్, ఖమ్మం జిల్లాలు ఏడాదికి 1000 మి.మీ.కు పైగా కరీంనగర్, మెదక్, నల్లగొండ జిల్లాలు ఏడాదికి 850-1000 మి.మీ. మధ్య, రంగారెడ్డి, మహబూబ్‌నగర్ జిల్లాల్లో ఏడాదికి 850 మి.మీ. కంటే తక్కువ వర్షపాతం నమోదవుతుంది.
- దేశంలో అత్యధిక వర్షపాతం మేఘాలయాలోని మాసిన్రామ్ (1144 సెం.మీ.) నమోదయ్యింది.
- ప్రపంచంలో అత్యధిక వర్షపాతం పసిఫిక్ మహాసముద్రంలోని హవాయి దీవుల్లో ఉన్న వయోలిలీ శిఖరం (1234 సెం.మీ.) వద్ద నమోదైంది.
గమనిక: దేశంలోకి నైరుతి రుతుపవనాలు ప్రవేశించడానికి కారణం పసిఫిక్ మహాసముద్రం నుంచి వీచే లానినో పవనాలు.
- దేశంలో రుతుపవన వ్యవస్థను ప్రభావితం చేసే అంశాలు.. ఎల్‌నినో, లానినో, దక్షిణ డోలనం, అంతర ఆయనరేఖా అభిసరణ మండలం, వాకర్ సర్య్యులేషన్, అక్టోబర్ హీట్.
- రుతుపవనాన్ని ఇంగ్లిష్‌లో మాన్‌సూన్ అంటారు. ఇది మౌసమ్ అనే అరబిక్ పదం నుంచి వచ్చింది.
- దేశంలో రుతుపవన వ్యవస్థ ఉందని అల్ మసూది తెలిపాడు.
ఎల్‌నినో
- ఇది లాటిన్ భాషా పదం
- ఎల్‌నినో అంటే బాల ఏసుక్రీస్తు
- ఎల్‌నినో అనేది ఉష్ణప్రవాహం.
- ఇది ఉష్ణప్రవాహం కావడంతో పసిఫిక్ మహాసముద్రంలో ప్రారంభమై పెరూ తీరంలోని అల్పపీడన ప్రాంతాన్ని ఆక్రమించడానికి భారత్‌కు రావాల్సిన రుతుపవనాలు దేశంలోకి రాకుండా పెరూను చేరుకుంటాయి. ఫలితంగా పెరూలో అధిక వర్షాలు కురిసి మన దేశంలో కరువులు ఏర్పడతాయి.
లానినో
- లాటిన్ భాషా పదమైన లానినోకి బాలిక అర్థం.
- ఇది శీతల ప్రవాహం.
- ఇది పసిఫిక్ మహాసముద్రంలో ప్రారంభమై పెరూ తీరాన్ని తాకినప్పుడు పెరూ తీరంపై అధిక పీడన గాలులు భారత్‌లోకి ప్రవేశిస్తాయి. దీనివల్ల దేశంలో భారీ వర్షాలు, వరదలు ఏర్పడతాయి.