ఫిబ్రవరి 14న ఉదయం 5.59కి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం, శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలో శ్రీహరికోటలోని సతీస్ ధవన్ స్పేస్ సెంటర్ లోని మొదటి ప్రయోగ వేదిక నుంచి పీఎస్‌ఎల్‌వీ సీ–52 ప్రయోగం జరిగింది. పీఎస్‌ఎల్‌వీ సీ–52 ప్రయోగం ద్వారా ఆర్‌ఐశాట్–1, ఐఎన్‌ఎస్–2టీడీ, ఇన్‌స్పైర్ శాట్–1తో పాటు మరో రెండు చిన్న ఉపగ్రహాలను నింగిలోకి పంపారు. 2022 ఏడాదిలో ఇస్రో నిర్వహించిన తొలి ప్రయోగం ఇదే.
ఈవోఎస్-04జీవితకాలం పదేళ్లు. బరువు 1710 కిలోలు. వ్యవసాయం, అటవీ, తోటల పెంపకం, వరద మ్యాపింగ్, నేల తేమ, హైడ్రాలజీవంటి అనువర్తనాల కోసం అన్ని వాతావరణ పరిస్థితుల్లోనూ నాణ్యమైన చిత్రాలను అందించడానికి రూపొందించారు. సీబ్యాండ్‌లో భూపరిశీలన వివరాలను సేకరిస్తుంది. ఇది రిసోర్స్‌శాట్, కార్టోశాట్ సిరీస్, ఆర్‌ఐశాట్-2బీ సిరీస్‌ల నుంచి డేటాను సేకరించి అనుసంధానిస్తుంది.
ఐఎన్‌ఎస్-2టీడీ
జీవితకాలం 6 నెలలు. భారతదేశం-భూటాన్ ఉమ్మడి ఉపగ్రహానికి (ఐఎన్‌ఎస్-2బీ) పూర్వగామి. థర్మల్ ఇమేజింగ్ కెమెరాను పేలోడ్‌గా కలిగి ఉంది. భూఉపరితల ఉష్ణోగ్రత, చిత్తడి నేలలు, సరస్సుల నీటి ఉపరితల ఉష్ణోగ్రత, వృక్ష సంపద (పంటలు, అడవులు), ఉష్ణ జడత్వం (పగలు, రాత్రి) అంచనా వేస్తుంది.
ఇన్‌స్పైర్‌శాట్-1
యూనివర్సిటీ ఆఫ్ కొలరాడోతో కలిసి ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ (ఐఐఎస్‌టీ) అభివృద్ధి చేసిన ఉపగ్రహం. జీవితకాలం ఏడాది. దీనికి ఎన్‌టీయూ సింగపూర్, ఎన్‌సీయూ తైవాన్ సహకరించాయి. ఇందులో రెండు శాస్త్రీయ పెలోడ్‌లు ఉన్నాయి. అయనోస్పియర్ డైనమిక్స్, సూర్యుని కక్ష్య తాపన ప్రక్రియపై ఇవి అవగాహన పెంచుతాయి.
ఇన్‌స్పైర్‌శాట్-1 రూపకర్తల్లో తెలుగు విద్యార్థులు: ఇన్‌స్పైర్ శాట్-1 ఉపగ్రహం రూపకల్పనలో కీలకపాత్ర పోషించిన ఆరుగురు విద్యార్థుల్లో తెలుగు రాష్ట్రాలకు చెందిన ధ్రువ అనంత దత్తా, అమన్ నవీన్ ఉన్నారు. తిరువనంతపురంలోని ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ స్పేస్ టెక్నాలజీ (ఐఐఎస్‌టీ)లో వీరు బీటెక్ చివరి సంవత్సరం చదువుతున్నారు. సహచర విద్యార్థులతో కలిసి శ్రీహరికోటలో ఫిబ్రవరి 6, 7, 8 తేదీల్లో రాకెట్‌పై వారు ఉపగ్రహాన్ని అమర్చారు. విశ్వవిద్యాలయాల కన్సార్షియం ఈ ఉపగ్రహాన్ని తీర్చిదిద్దింది. తిరువనంతపురంలోని ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ స్పేస్ టెక్నాలజీ (ఐఐఎస్‌టీ) ప్రొఫెసర్ ప్రియదర్శన్ నేతృత్వంలో మన విద్యార్థులు భాగస్వాములయ్యారు.
అనంత్ టెక్నాలజీస్ భాగస్వామ్యం:
పీఎస్‌ఎల్‌వీ-సి52 రూపకల్పనలో హైదరాబాద్‌కు చెందిన అనంత్ టెక్నాలజీస్ క్రియాశీల పాత్ర పోషించింది. ఇస్రోకు చెందిన విక్రమ్ సారాభాయ్ స్పేస్ సెంటర్ (వీఎస్‌ఎస్‌సీ)తో ఈ సంస్థకున్న ఒప్పందం ప్రకారం పీఎస్‌ఎల్‌వీ-సి52 వేర్వేరు దశలను సమీకృతం (ఇంటిగ్రేషన్) చేయడంతోపాటు టెస్టింగ్, క్వాలిఫయింగ్ బాధ్యతలను నిర్వర్తించింది.