15వ ఆర్థిక సంఘం – తెలంగాణ

               తెలంగాణ రాష్ట్రానికి 15వ ఆర్థిక సంఘం ఐదేండ్ల కాలానికి రూ.1,09,786కోట్లను సిఫారసు చేసింది. స్థానిక సంస్థలకు రూ.13,111కోట్లు ప్రతిపాదించింది. ఎన్నో ప్రాజెక్టులకు సాయం అర్థించినా మిషన్ భగీరథ నిర్వహణకు మాత్రం రూ.2,530కోట్లను సిఫారసు చేసింది. ఇంటింటికి రక్షిత మంచినీటిని అందించే కార్యక్రమం నేపథ్యంలో నిర్వహణకు ఈ నిధులను ప్రతిపాదించినట్లు పేర్కొంది. ఈసారి విద్య, వ్యవసాయం, ఆరోగ్యానికి ప్రత్యేకంగా నిధులను సిఫారసు చేసింది. వివిధ అంశాల పనితీరు ప్రాతిపదికగా వ్యవసాయానికి సిఫారసు చేసిన నిధులను అందించనున్నది. రాజధాని హైదరాబాద్‌కు ఘనవ్యర్థాల నిర్వహణ, వాయుకాలుష్యం నిర్వహణ నేపథ్యంలో ఐదేళ్లకు రూ.1,939కోట్లను సిఫారసు చేసింది.

 

మిలియన్ ఫ్లస్ నగరాల జాబితాలో హైదరాబాద్

సంవత్సరం ఘనవ్యర్థాల నిర్వహణ వాయు నాణ్యత
2021-22 236 118
2022-23 245 122
2023-24 259 129
2024-25 274 137
2025-26 279 140

                 సమీకృత అభివృద్ధి లక్ష్యాల(ఎస్‌డిజి) సాధనలో తెలంగాణ పనితీరు బాగుందని 15వ ఆర్థిక సంఘం ప్రశంసించింది. 2019లో ఎస్‌డిజి ర్యాంకుల్లో తెలంగాణ ఐదో స్థానంలో నిలిచిందని పేర్కొంది. ఫిబ్రవరి 1న పార్లమెంట్‌లో ప్రవేశపెట్టిన 15వ ఆర్థిక సంఘం నివేదిక రాష్ట్రానికి సంబంధించి పలు అంశాలను వెల్లడించింది. 2015-19 మధ్యకాలంలో తెలంగాణ మెరుగైన వృద్ధి రేటుతో ముందుకు సాగిందని వివరించింది. రాష్ట్రంలో వెనుకబడిన 20శాతం మండలాల అభివృద్ధికి కార్యాచరణ రూపొందించాలని సూచించింది. దేశంలోని 35 జిల్లాల అభివృద్ధిపై వామపక్ష తీవ్రవాదం ప్రభావం ఉండగా ఇందులో ఒక జిల్లా తెలంగాణలో ఉందని చెప్పింది.

 

2021-22 ఆర్థిక సంవత్సరం నుంచి ఐదేండ్ల కోసం ప్రతిపాదించిన నిధులు (రూ.కోట్లలో)

అంశం నిధులు
స్థానిక సంస్థలు 13,111
వ్యవసాయం 2,483
న్యాయ వ్యవస్థ 2,362
విపత్తు నిర్వహణ 1,665
ఆరోగ్యం 624
ఉన్నత విద్య 255
రాష్ట్ర ప్రత్యేకం 245
పిఎంజిడీఎస్‌పి 189
గణాంకాలు 46

-రాష్ట్ర ప్రత్యేక నిధుల్లో రూ.2,350కోట్లు మిషన్ భగీరథ నిర్వహణ కోసం కాగా మిగిలిన రూ.12కోట్లు అడ్మినిస్ట్రేటివ్ స్టాఫ్ కాలేజీకి తోడ్పాటు

 

తెలంగాణ జిఎస్‌డిపిలో వివిధ అంశాల వాటాలు శాతాలలో

సంవత్సరం సొంత పన్నులు కేంద్ర పన్నుల వాటా రెవెన్యూ వ్యయం  పెట్టుబడి వ్యయం వడ్డీల చెల్లింపు
2015-16 6.9 3.8 13.1 3.3 1.3
2016-17 7.4 3.7 12.4 5.6 1.3
2017-18 7.5 3.3 11.3 4 1.4
2018-19 7.5 3.1 11.3 3.6 1.5
2019-20 7.4 2.8 11.4 2.3 1.5
2020-21 7.7 2.5 12.5 3.4 1.3

 

రానున్న ఐదేండ్లకు తెలంగాణ అంచనాలు ఇలా (రూ.కోట్లలో)

అంశం 2021-22  2022-23 2023-24 2024-25 2025-26






జిఎస్‌డిపి 10,28,726 11,47,030  12,84,674  14,44,615 16,25,192
సొంత పన్నులు 91,053 10,343 1,18,114  1,35,517  1,55,574
పన్నేతర రాబడి 12,400 13,969 15,813 17,679 20,451
జీఎస్టీ పరిహారం 2,135 2,379 2,573 2,846 4,186
వడ్డీల చెల్లింపు 15,931 17,365 18,927 20,631 22,488
పింఛన్లు 9,617 10,040 10,592 11,175 11,790

 

కాళేశ్వరం విద్యుత్తు బిల్లులను వినియోగ చార్జీల ద్వారా పొందాలి

                కాళేశ్వరం ఎత్తిపోతలకు భారీగా విద్యుత్తు బిల్లు వస్తుందని, నిర్వహణకు అవసరమయ్యే మొత్తాన్ని రాష్ట్ర ప్రభుత్వం వినియోగ చార్జీల ద్వారా పొందాలని 15వ ఆర్థిక సంఘం సూచించింది. కచ్చితమైన ఆదాయ వనరు లేకుంటే ప్రాజెక్టు ఆర్థిక స్థిరత్వం ప్రశ్నార్థకంగా మారుతుందని పేర్కొంది. రాష్ట్ర ప్రభుత్వం 18లక్షల ఎకరాల ఆయకట్టుకు నీటిని అందించడానికి రూ.80వేల కోట్ల అంచనా వ్యయంతో కాళేశ్వరం ప్రాజెక్టును చేపట్టిందని పేర్కొంది. తాగు, సాగునీటి పథకాలకు రాష్ట్ర ప్రభుత్వ రుణాలు తీసుకుందని, రికవరీకి అవకాశం లేకుండా ఈ రుణాలకు అవసరమైన వడ్డీలను బడ్జెట్ నుంచి చెల్లించాల్సి వస్తుందని, ఇది ద్రవ్యలోటుకు దారి తీసే అవకాశం ఉందని తెలిపింది. ఈ పరిస్థితి రాకుండా చర్యలు తీసుకోవాలంది. 2016-17లో ఆడిట్ పరిశీలనలోకి వచ్చిన అంశాలను ఉదాహరణగా పేర్కొంది. ఆ సంవత్సరం రెవెన్యూ మిగులును రూ.1,386కోట్లుగా పేర్కొన్నారని, అయితే అకౌంటింగ్ సక్రమంగా చేయకుండా రెవెన్యూ మిగులును రూ.6,778కోట్లు ఎక్కువగా చూపించారని వివరించింది.