బడ్జెట్ రికార్డులు

          ఇప్పుడు బడ్జెట్ లెక్కలన్నీ వేలు, లక్షల కోట్లలోనే.. మరి స్వాతంత్య్రం వచ్చిన తర్వాత ప్రవేశపెట్టిన బడ్జెట్ లెక్కేంటి? అప్పుడు మన ఆదాయం ఎంత? రక్షణ శాఖ బడ్జెట్ ఎంత? ఆ వివరాలు తెలుసుకుందామా..

(అంకెలు రూ.కోట్లలో)
మంత్రి: ఆర్కే షణ్ముగం చెట్టి,
తేదీ: 1947, నవంబర్ 26
రెవెన్యూ అంచనా: 171.15
రెవెన్యూ వ్యయం: 197.39
రెవెన్యూ లోటు: 26.24
రక్షణశాఖకు: 92.74
ఆదాయపు పన్ను ద్వారా ఆదాయం: 119
కస్టమ్స్ ఆదాయం: 50.5
ఫారెక్స్ నిల్వలు: 1,547

  • గణతంత్ర భారత దేశంలో మొట్టమొదటి బడ్జెట్‌ను జాన్ మతాయ్ 1950 ఫిబ్రవరి 28న సభలో ప్రవేశపెట్టారు.
  • స్వతంత్ర భారతావనిలో తొలిసారిగా బడ్జెట్‌ను ప్రవేశపెట్టిన మంత్రి ఆర్‌కే షణ్ముగంశెట్టి. 1947-49 మధ్య బడ్జెట్‌లు ప్రవేశపెట్టిన ఆయన నెహ్రూతో విభేదాల కారణంగా పదవి నుంచి వైదొలిగారు.
  • 1951-52లో రిజర్వు బ్యాంకు గవర్నర్ సీడీ దేశ్‌ముఖ్ తాత్కాలిక బడ్జెట్‌ను ప్రవేశపెట్టారు.
  • ప్రధానమంత్రిగా కొనసాగుతూ పార్లమెంటులో బడ్జెట్‌ను ప్రవేశపెట్టిన తొలి వ్యక్తి జవహర్‌లాల్ నెహ్రూ. 1958-59లో ఆర్థికశాఖను కూడా పర్యవేక్షించిన ఆయన ఈ రికార్డు సాధించారు. ఆ తర్వాత ఇదే బాటలో ఇందిరాగాంధీ 1970లో, రాజీవ్ 1987లో ప్రధానులుగా బడ్జెట్‌ను ప్రవేశపెట్టారు.
  • కేంద్ర ఆర్థిక మంత్రిగా బడ్జెట్‌లు ప్రవేశపెట్టి అనంతర కాలంలో రాష్ట్రపతి పదవిని అధిష్టించినవారు ఇద్దరున్నారు. 1980-82 మధ్య ఆర్థిక మంత్రిగా పనిచేసిన ఆర్.వెంకట్రామన్, 1974-75లో కేంద్ర ఆర్థిక శాఖ సహాయ మంత్రిగా, ఆ తర్వాత 1982-84 మధ్య, 2009-12 మధ్య ఆర్థిక మంత్రిగా పనిచేసిన ప్రణబ్ ముఖర్జీ రాష్ట్రపతి పదవిని చేపట్టారు.
  • 1991-92లో అరుదైన ఘటన చోటుచేసుకుంది. ఆ ఏడాది తుది, తాత్కాలిక బడ్జెట్లను రెండు పార్టీలకు చెందిన, వేర్వేరు ఆర్థిక మంత్రులు ప్రవేశపెట్టడం గమనార్హం. తాత్కాలిక బడ్జెట్‌ను బీజేపీ నేత యశ్వంత్‌సిన్హా, తుది బడ్జెట్‌ను మన్మోహన్‌సింగ్ ప్రవేశపెట్టారు.
  • అతి తక్కువకాలం కేంద్ర ఆర్థిక మంత్రిగా పనిచేసిన రికార్డు బీజేపీ నేత జశ్వంత్‌సింగ్ పేరిట ఉంది. ఆయన కేవలం 13 రోజుల పాటే కొనసాగారు.

 

మరికొన్ని విశేషాలు

  • పరీక్ష పేపర్లే కాదు.. బడ్జెట్ కూడా లీకయింది. కానీ అది 1950లో. అప్పట్లో బడ్జెట్ పత్రాలను రాష్ట్రపతిభవన్‌లో ముద్రించేవారు. ఆ తర్వాత మింటో రోడ్‌లోకి మార్చారు. 1980 నుంచి ఢిల్లీలోని నార్త్ బ్లాక్‌లో బడ్జెట్ పత్రాల్ని ముద్రిస్తున్నారు. ఇందుకోసం అక్కడ ప్రత్యేకంగా ప్రింటింగ్ ప్రెస్‌ను ఏర్పాటు చేశారు.
  • మోరార్జీ దేశాయ్ అత్యధికంగా పది సార్లు బడ్జెట్‌ను ప్రవేశపెట్టిన ఘనత సంపాదించుకున్నారు.
  • దేశంలో బడ్జెట్ ప్రవేశపెట్టిన ఏకైక మహిళా ఆర్థిక మంత్రిగా ఇందిరా గాంధీ రికార్డు సృష్టించారు.
  • ప్రాచీన ఈజిప్టులో(క్రీ.పూ.3000 నుంచి క్రీ.పూ.2800 మధ్య) తొలిసారిగా పన్నుల విధానాన్ని అమలు చేసినట్లు చారిత్రక ఆధారాల ద్వారా తెలుస్తోంది. రాజు ఏడాదికి రెండుసార్లు రాజ్యంలో పర్యటించి, పన్నుల ఆదాయాన్ని సేకరించారు. భారత్‌లో తొలిసారిగా పన్నుల విధానాన్ని(జిజియా) ముస్లిం పాలకులు 11వ శతాబ్దంలో ప్రవేశపెట్టారు.
  • 1404లో తొలిసారిగా ఇంగ్లండ్‌లో ఆదాయపు పన్ను విధించారు. అప్పట్లో దీనిపై ప్రజల నుంచి తీవ్ర వ్యతిరేకత వచ్చింది.
  • శృంగార శుల్కం: జర్మనీ సర్కారు 2004 జనవరి నుంచి ఈ పన్నును అమలులోకి తెచ్చింది. దీని ప్రకారం ఫుల్‌టైమ్ సెక్స్‌వర్కర్లు స్థానిక పట్టణ సంస్థకు ప్రతినెలా 150 యూరోలు, పార్ట్ టైమర్లయితే వారి ‘పని’దినాలకు ఆరు యూరోల చొప్పున చెల్లించాలి.
  • ‘రూప్యక్’ అనే సంస్కృత పదం నుంచి మన ‘రూపీ’ వచ్చింది. ఆ పదానికి ‘వెండి నాణెం’ అని అర్థం. అంగరంగ వైభవంగా విలసిల్లిన మగధ సామ్రాజ్య కాలం నుంచి ఈ వెండి నాణాలు చెలామణీలో ఉండేవి. తర్వాత ‘రుపియా’ పేరుతోనే 1486-1545 సంవత్సరాల మధ్య అప్పటి పాలకుడు షేర్‌షా సూరి వెండి నాణాలను ప్రవేశపెట్టారు. అప్పటి నుంచి మన రూపాయికి ఆ పేరే కొనసాగుతూ వచ్చింది.
  • మన కరెన్సీ చూడడానికి కాగితంలా ఉన్నా సాంకేతికంగా అది కాగితం కాదు.. అలా కనిపించే ఒక రకమైన వస్త్రం. పత్తి, లినెన్ పోగులతో తయారు చేసే ఈ ప్రత్యేక వస్త్రాన్ని... అత్యంత ఒత్తిడికి గురిచేసి, ప్రింట్ చేస్తారు. దాంతో కాగితంలా కనిపిస్తుంది. సాధారణంగా ఏ కాగిత మైనా.. నీటిలో తడిస్తే ఎక్కడికక్కడ చిరిగిపోయి, ముద్దగా అవుతుంది. అదే నోట్ల తయారీకి వాడేది వస్త్రం కాబట్టే తడిసినా, చివరికి వాషింగ్ మెషీన్‌లో పడినా.. ముద్దగా అవడం జరగదు.

2014-15లో అత్యధికంగా పన్నులు కట్టిప 10 కంపెనీలు
          రూ.10 వేల పన్ను కట్టాలంటేనే మనం బాబోయ్ అంటాం..! ఆ మొత్తాన్ని మిగిల్చుకోవడానికి నానా తంటాలు పడుతుంటాం. మరి కోట్లు కోట్లు ట్యాక్స్ కట్టాల్సి వస్తే..? అవును మన దేశంలో కొన్ని కంపెనీలు వేల కోట్లలోనే పన్నులు చెల్లిస్తుంటాయి. 2013-14 ఆర్థిక సంవత్సరంలో అత్యధిక పన్నులు కట్టిన టాప్-10 కంపెనీలను ఓసారి చూస్తే...

సంస్థ పన్నుల విలువ (రూ.కోట్లలో)
ఓఎన్జీసీ 10,337
రిలయెన్స్ ఇండస్ట్రీస్ 5,834
ఎస్‌బీఐ 5,282
టీసీఎస్ 5,069
హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ 4,294
ఐటీసీ 3,873
ఐసీఐసీఐ బ్యాంక్ 3,839
ఇన్ఫోసిస్ 3,808
ఎన్‌ఎండీసీ 3,339
టాటా స్టీల్ 3,301

 

ఏ నాణెం ఎక్కడ తయారయింది?
          రూపాయి నాణెం చూసి.. అదెక్కడ తయారైందో చెప్పగలరా? ‘మింట్’లో.. అని చెబుతారా? అది సరే.. ఏ మింట్‌లో తయారైంది అని అడిగితే చెప్పగలరా? మీకీ విషయం తెలుసా? ప్రతి నాణెం అదెక్కడ తయారైందో తెలిపే సూచిక దానిపైనే ఉంటాయి. వాటి సంగతేంటో.. ఇక్కడ తెలుసుకుందాం.

  1. నాణెం ముద్రణా సంవత్సరం కింది భాగంలో ‘డైమండ్’ గుర్తు ఉంటే.. అది ముంబై మింట్‌లో తయారైనట్లు లెక్క.
  2. ముద్రణా సంవత్సరం కింది భాగంలో ఎలాంటి గుర్తు ఉండకుంటే.. అది కచ్చితంగా కోల్‌కతా మింట్ నాణెమే.
  3. ముద్రణా సంవత్సరం కింది భాగంలో ‘చీలిన డైమండ్’ (స్ల్పిట్ డైమండ్) లేదా ‘చుక్క’ (డాట్) లేదా ‘స్టార్’ (నక్షత్రం) ఉందంటే.. అది మన హైదరాబాదీ మింట్ తయారీయే.
  4. ముద్రణా సంవత్సరం కింద ‘గుండ్రని బిందువు’ (రౌండ్ డాట్) ఉంటే.. అది నోయిడా మింట్ నాణెమన్న దానికి సంకేతం.
  5. ఇవేవీగాకుండా నాణెంపై ఇతర చిహ్నాలుంటే అవి విదేశీ మింట్‌లలో తయారైనట్టు లెక్క.

 

బడ్జెట్‌లో హల్వా ఎందుకు?
       పానకంలో పుడకలా... దేశం ఆదాయ వ్యయాల గురించి మాట్లాడుతుంటే మధ్యలో ఈ స్వీటు గొడవవేంటీ అనుకుంటున్నారా? ఇదీ బడ్జెట్‌లో భాగమే! అవును, బడ్జెట్ పత్రాలు సిద్ధమయ్యాక పార్లమెంట్ నార్త్‌బ్లాక్‌లో హల్వా హడావుడి మొదలవుతుంది. బడ్జెట్ రూపకల్పనలోని చివరి అంకమైన ప్రింటింగ్ ఈ మిఠాయితోనే ఆరంభమౌతుంది. పత్రాలన్నీ సిద్ధమయ్యాక... ప్రింటింగ్‌కి పంపించేముందు బడ్జెట్ రూపకల్పనలో భాగస్వామ్యులైన అధికారులందరూ హల్వా వండుకుని తింటారు. మామూలుగా అయితే, మన సంప్రదాయం ప్రకారం ఏపనినైనా పూజ చేసి మొదలుపెడతాం. కానీ, బడ్జెట్ పత్రాల ప్రింటింగ్‌కు ముందు అలాంటివేవీ ఉండవు. హల్వా పంచుకుని తినడమే అసలైన పండగ.

 

1860లో తొలిసారి..
        ఈస్టిండియా కంపెనీ నుంచి అధికార పగ్గాలు బ్రిటిష్ గవర్నమెంటుకు చేతులు మారిన అనంతరం వార్షిక బడ్జెట్‌ను తొలిసారిగా 1860 ఏప్రిల్ 7న ప్రవేశపెట్టింది. బడ్జెట్‌ను సాయంత్రం 5 గంటల సమయంలో వెలువరించడం అనే సంప్రదాయాన్ని 1924లో సర్ బాసిల్ బ్లాకెట్ ప్రారంభించారు. బడ్జెట్ తయారీకి రాత్రంతా పనిచేసిన ఉద్యోగులకు కొంత ఉపశమనం ఇవ్వాలనే ఉద్దేశంతో అప్పట్లో ఆ నిర్ణయం తీసుకున్నారు.

 

బడ్జెట్ చరిత్ర ఎప్పుడు మొదలైంది?
         దేశ ఆర్థిక వ్యవస్థను నిర్దేశించే బడ్జెట్ చరిత్ర సుదీర్ఘమైంది. స్వాతంత్య్రానంతరం దేశ మొదటి ఆర్థిక మంత్రి ఆర్.కె. షణ్ముగం శెట్టి 1947 నవంబర్ 26 సాయంత్రం 5 గంటలకు తొలి బడ్జెట్‌ను ప్రవేశపెట్టారు. స్వతంత్ర భారతదేశ మొదటి బడ్జెట్‌ను కేవలం ఏడున్నర నెలలకు మాత్రమే రూపొందించారు. దీనిని 1947 ఆగస్టు 15 నుంచి 1948 మార్చి 31 వరకు రూపొందించారు.