ఎక‌న‌మిక్ స‌ర్వే అంటే ఏంటి?

 ఇంత‌కీ ఎక‌న‌మిక్ స‌ర్వే అంటే ఏంటి?

        ఎకనామిక్ సర్వే అనేది భారత ఆర్థిక వ్యవస్థ అభివృద్ధిని సమీక్షించే ప్రధాన వార్షిక పత్రం. దీన్ని ఆర్థిక మంత్రిత్వ శాఖలోని ఆర్థిక వ్యవహారాల విభాగం (Department of Economic Affairs) విడుదల చేస్తుంది. 

        దేశ ముఖ్య ఆర్థిక సలహాదారు స‌ర్వేను తయారు చేసి పార్ల‌మెంటులో బడ్జెట్ పెట్ట‌డానికి ఒక రోజు ముందు స‌భ‌లో ప్రవేశపెడ‌తారు. ప్ర‌స్తుతం దేశ ముఖ్య ఆర్థిక స‌ల‌హాదారు కృష్ణమూర్తి సుబ్రమణియన్.

స‌ర్వేలో ఏమేం ఉంటాయి?

          దేశ ఆర్థిక వ్యవస్థపై ప్రభావం చూపే అన్ని అంశాలకు సంబంధించిన గణాంకాలతో ఎకనమిక్ సర్వేను కేంద్ర ఆర్థిక శాఖ రూపొందిస్తుంది. గత ఆర్థిక సంవత్సరానికి సంబంధించి ఆర్థిక వ్యవస్థ అభివృద్ధిని స‌ర్వే సమీక్షిస్తుంది. 

          దేశ వ్యవసాయాభివృద్ధి, పారిశ్రామిక రంగంలో ఉత్పత్తి, ఫారిన్ ఎక్స్‌ఛేంజ్ నిల్వలు, మౌలిక వసతులు, దేశంలో నగదు సరఫరా, ధరల విధానం, ఎగుమతులు, దిగుమతులు, ఇతర ఆర్థికరపమైన అంశాలను ఎకనమిక్ సర్వే విశ్లేషిస్తుంది. అలాగే బడ్జెట్ సమగ్ర స్వ‌రూపాన్ని అందిస్తుంది. 

          ఆర్థిక వ్యవస్థలోని వివిధ రంగాలపై ప్రభుత్వం చేసే ఖర్చులను విశ్లేషించుకోవడానికి ఎకనమిక్ సర్వే ఉపయోగపడుతుంది.

ఎక‌న‌మిక్ స‌ర్వే అవ‌స‌ర‌మేంటి?

         గ‌త ఆర్థిక సంవ‌త్స‌రం ఏమేం అభివృద్ధి సాధించామో వివ‌రించేందుకు ఆర్థిక సర్వే ఉప‌యోగ‌ప‌డుతుంది. కేంద్ర ప్రభుత్వ విధాన కార్యక్రమాలను, అభివృద్ధి కార్యక్రమాల పనితీరును తెలియ‌జేస్తుంది. 

         వచ్చే ఆర్థిక సంవత్సరానికి భారత జీడీపీ వృద్ధిని అంచనా వేస్తుంది మరియు ఆర్థిక వృద్ధిని పెంచే చర్యలను సూచిస్తుంది.

 

ఎన్నో ఏళ్ల ఆనవాయితీ..!
          బడ్జెట్‌ కన్నా ముందురోజే ఆర్థిక సర్వేను పార్లమెంట్‌లో ప్రవేశపెట్టడం ఎన్నో ఏళ్లుగా ఆనవాయితీగా వస్తోంది. మొట్టమొదటిసారిగా ఈ ఆర్థిక సర్వేను 1950-51 ఆర్థిక సంవత్సరంలో పార్లమెంటులో ప్రవేశపెట్టారు. 1964 వరకు సాధారణ బడ్జెట్‌తోనే కలిపి ప్రవేశపెట్టేవారు. కానీ, 1964 నుంచి దీన్ని బడ్జెట్‌ కన్నా ముందురోజే ప్రత్యేకంగా ప్రవేశపెడుతున్నారు. కేంద్ర బడ్జెట్‌లో కేటాయింపుల ప్రతిపాదనలను తేలికగా అర్థం చేసుకోవడం కోసమే ఆర్థిక సర్వేను ప్రత్యేకంగా విడుదల చేస్తున్నారు. 

        రెండు విభాగాల్లో ప్రవేశపెట్టే ఈ సర్వేలో.. తొలి విభాగంలో భారత ఆర్థిక వ్యవస్థ ఎదుర్కొంటున్న సవాళ్లను ప్రముఖంగా ప్రస్తావించగా, రెండో విభాగంలో మాత్రం గత ఏడాదికి సంబంధించిన దేశ ఆర్థిక పనితీరును సవివరంగా పొందుపరుస్తారు.