నోబెల్ బహుమతి అందుకున్న భారతీయులు

 

రవీంద్రనాథ్ ఠాగూర్ (1913, సాహిత్యం)

జన్మలో, మృత్యువులో, ఈ లోకంలో, ఇతర లోకాల్లో ఎక్కడెక్కడ నువ్వు నన్ను తిప్పినా.. నా అనంత పథచారిణి నువ్వే (గీతాంజలి) అంటూ సున్నిత భావపరంపరతో, కవితాత్మకంగా ఆర్థ్రమైన, ప్రేమాస్పదమైన అజరామర భక్తిని చిలకరించినందుకు రవీంద్రనాథ్ ఠాగూర్‌ను నోబెల్ పురస్కారం వరించింది. ఈ అత్యున్నత బహుమతి అందుకున్న తొలి భారతీయుడు ఠాగూర్. 


సీవీ రామన్ (1930, భౌతికశాస్త్రం)

కీలకమైన కాంతి ధర్మాన్ని ఒడిసిపట్టినందుకు సీవీ రామన్ నోబెల్ అందుకున్నారు. కాంతి ప్రయాణంలో ఒక అణువు వద్ద ఫోటాన్‌లు ఎంతగా పరివ్యాప్తమవుతాయన్న దాన్నిబట్టి ఆయా పదార్థాల ధర్మాలను గ్రహించవచ్చన్న రామన్ ప్రతిపాదన భౌతికశాస్త్రంలో కొత్త ద్వారాలు తెరుస్తూ రామన్ ఎఫెక్ట్ పేరు మీద చిరస్థాయిగా నిలిచిపోయింది. ఆధునిక లేజర్ల నుంచి రేడియేషన్ వినియోగం వరకు ఎన్నింటికో ఇదే భూమిక అయ్యింది. సైన్స్ రంగంలో నోబెల్ సాధించిన తొలి శ్వేతజాతీయేతరడు సీవీ రామన్. 


హరగోవింద ఖొరానా (1968, వైద్యరంగం)

జన్యువుల ఆవిష్కారమే అమోఘం అనుకుంటే, ఆ జన్యువుల్లో జీవ సంకేతాలు ఏ క్రమంలో ఎలా ఉంటున్నాయో విశ్లేషించి చూపడం, కీలకమైన ప్రొటీన్ సమ్మేళనాలు వాటి పాత్ర ఏమిటో గుర్తించడం ద్వారా హరగోవింద ఖొరానా వైద్యరంగంలో నోబెల్ అందుకున్నారు. జీవులన్నింటిలో జన్యుపరమైన జీవభాష మూడు మూడు న్యూక్లియోటైడ్‌ల సమ్మేళనంగా ఉంటుందని నిరూపించడం ద్వారా కృత్రిమ జన్యువుల రూపకల్పనకు, జన్యు పరిశోధనల విస్తరణకు తెరతీశారు. ఈయన 2011 నవంబర్ 11న మరణించారు. 


మదర్‌థెరిసా (1979, శాంతి బహుమతి)

అల్బేనియాలో జన్మించి భారతగడ్డను తన సేవాకేంద్రంగా ఎంచుకున్న మానవాళి మాతృమూర్తి మదర్‌థెరిసా. పేదలు, రోగులకు ప్రేమాస్పద సేవలందించడం ద్వారా ప్రపంచ శాంతిని ప్రోది చేశారని నోబెల్ కమిటీ ఆమెను ప్రస్తుతించింది. ప్రపంచవ్యాప్తంగా సొసైటీ ఆఫ్ మిషనరీస్ ఏర్పాటు చేయడం ద్వారా ఆమె ప్రకృతి వైపరీత్యాల్లో మానవాళి పునరావాసానికి అసమానమైన సేవ చేశారు. వ్యసన పీడితుల నుంచి ఎయిడ్స్ బాధితుల వరకు సకల మానవాళికి తోడు నిలిచారు. 


సుబ్రమణ్యం చంద్రశేఖర్ (1983, భౌతికశాస్త్రం)

నక్షత్రాల పుట్టుక, పరిణామాలపై సరికొత్త కాంతిని ప్రసరింపజేపినందుకు సుబ్రమణ్యం చంద్రశేఖర్‌కు నోబెల్ బహుమతి దక్కింది. సీవీ రామన్ సోదరుడి కుమారుడైన చంద్రశేఖర్.. ఖగోళ భౌతికశాస్త్రంలో చంద్రశేఖర్ లిమిట్ పేరుతో ఓ సిద్ధాంతాన్ని ప్రతిపాదించారు. ఒక నక్షత్రం ఎంత ద్రవ్యరాశిని కోల్పోతే కృష్ణబిలంలో కలిసిపోతుందో ఆ పరిమితిని లెక్కించడం ఆయన సాధించిన ఘనత. నాసా ఒక అబ్జర్వేటరీకి సుబ్రమణ్యం చంద్రశేఖర్ పేరు పెట్టింది. 


అమర్త్యసేన్ (1998, అర్థశాస్త్రం)

సంప్రదాయ అర్థశాస్త్రం తరతరాలుగా విస్మరిస్తూ వచ్చిన జన సంక్షేమం మీదకు అందరి దృష్టి మళ్లేలా చేయడం అమర్త్యసేన్ ఘనత. సామాజిక కార్యాచరణకు వ్యక్తి సంక్షేమమే మౌలికమన్న భావనను తోసిపుచ్చుతూ సామాజిక సంక్షేమాన్ని బలంగా ప్రతిపాదించి.. ఆధునిక కాలంలో అభివృద్ధి దిశను మార్చడం ద్వారా అమర్త్యసేన్ ఐరాస కార్యాచరణను కూడా ప్రభావితం చేయగలిగారు. ఆర్థిక సంస్కరణలకు ముందు విద్య, వైద్యం, ఆహార లభ్యత వంటి వాటిని సంస్కరించినపుడే నిజమైన ఆర్థిక పురోభివృద్ధి సాధ్యమని ప్రభుత్వాలు గుర్తించేలా చెప్పడం అమర్త్యేసేన్ విశిష్టత. 


వెంకట్రామన్ రామకృష్ణన్ (2009, రసాయనశాస్త్రం)

అమెరికాలో స్థిరపడ్డ ప్రవాస భారతీయుడు వెంకట్రామన్ రామకృష్ణన్‌కు రసాయనశాస్త్రంలో నోబెల్ బహుమతి లభించింది. అమెరికా శాస్త్రవేత్త థామస్ ఇ.స్టీజ్, ఇజ్రాయెల్ శాస్త్రవేత్త ఆడా ఇ.యోనాథ్‌లతో కలిసి ఈ బహుమతిని పంచుకున్నారు. కణంలోని రైబోజోమ్ అత్యంత సూక్ష్మస్థాయిలో ఎలా కనిపిస్తుంది? రైబోజోమ్ డీఎన్‌ఏ పోగులను ప్రొటీన్‌లుగా ఎలా మార్చగలుగుతుంది? అనే విషయాలను ఈయన ఆవిష్కరించారు. 


రాజేంద్ర కె.పచౌరీ (2007, శాంతి)

భూతాపంపై ఐపీసీసీ (ఇంటర్ గవర్నమెంటల్ ప్యానెల్ ఆన్ ైక్లెమేట్ ఛేంజ్) నివేదిక తయారు చేయడంలో విశేష కృషి చేసినందుకుగాను పచౌరీకి నోబెల్ బహుమతి లభించింది. రాజేంద్ర కె. పచౌరీ, ఆల్‌గోర్ కలిసి ఈ బహుమతిని స్వీకరించారు. 


కైలాస్ సత్యార్థి (2014, శాంతి)

మధ్యప్రదేశ్ రాష్ర్టానికి చెందిన కైలాష్ సత్యార్థి బచ్‌పన్ బచావో ఆందోళన్ అనే స్వచ్ఛంద సంస్థను స్థాపించి, బాలల హక్కుల కోసం 30 ఏండ్లకుపైగా పోరాడి, వేలమంది బాలలకు వెట్టిచాకిరీ, అక్రమ రవాణా నుంచి విముక్తి కల్పించారు. ఈయన సేవలకు గుర్తింపుగా పాకిస్థాన్‌కు చెందిన మలాలా యూసఫ్‌జాయ్‌తో కలిపి సంయుక్తంగా నోబెల్ శాంతి బహుమతి ప్రదానం చేశారు. మదర్‌థెరిసా తర్వాత మనదేశం తరఫున నోబెల్ శాంతి బహుమతి పొందిన రెండో వ్యక్తి కైలాస్ సత్యార్థి.