ఛత్రపతి సాహూమహరాజ్ (1874-1922)

 


  • శివాజీ మునిమనుమడిగా ప్రసిద్ధి చెందిన సాహూ కొల్హాపూర్ సంస్థానాన్ని కొత్త పుంతలు తొక్కించాడు.
  • సాహూ స్వయంగా తన రాజ్యంలోని గ్రామాలను సందర్శించి అక్కడి పరిస్థితులను క్షుణ్ణంగా పరిశీలించి, ఏ భేషజాలు లేకుండా దళితులు, పేద రైతుల ఇండ్లకు వెళ్లి వారితో మాట్లాడి సమస్యలు తెలుసుకునేవాడు.
  • ఇలా వారి వాడల్లోకి వెళ్లిన తొలి మరాఠా రాజు సాహూమహరాజ్. అందుకే అతనిపై ప్రజలందరికీ ఆరాధన భావం ఉండేది.
  • అప్పట్లో సనాతన ధర్మం పేరుతో బ్రాహ్మణులు దేశంలోని బ్రాహ్మణేతరుల దరికి విద్యను చేరనివ్వలేదు. ఇలాంటి సమయంలో ఛత్రపతి సాహూ బ్రాహ్మణేతరుల దగ్గరికి విద్యాబుద్ధులు తీసుకెళ్లడం కోసం దక్కన్ ఎడ్యుకేషన్ సొసైటీని స్థాపించి, తానే అధ్యక్షుడిగా వ్యవహరించాడు.
  • సామాన్య జనానికి తమకున్న అధికారాలు, కర్తవ్యాలపై కనీస జ్ఞానం కలిగించాలంటే ప్రాథమిక విద్య ఒక్కటే మార్గమని నమ్మి విద్యావ్యాప్తికి అత్యంత ప్రాముఖ్యం ఇచ్చేవాడు.
  • సాహూమహరాజ్ ఒకరోజు పంచగంగ స్నానమాచరించడం కోసం వెళ్లగా మంత్రోచ్ఛారణ కోసం వచ్చిన బ్రాహ్మణ పండితుడు స్నానమాచరించకుండానే మంత్రపఠనం చేశాడు.
  • ఎందుకంటే ఛత్రపతి సాహూ కున్చీకాపు (శూద్రుడు) కాబట్టి. శూద్రులకు మంత్రపఠనం చేసేటప్పుడు స్నానం చేయాల్సిన అవసరం లేదని వాదించాడు.
  • ఈ విషయంలో సాహూ తన రాజ్యంలోని దళిత, బలహీనవర్గాల పరిస్థితులపై ఎంతో ఆవేదన చెందాడు.
  • దళిత, బలహీనవర్గాల వారికి శిక్షణ ఇచ్చి రాజ్య శాసన వ్యవహారాల్లో ఉన్నత పదవులు ఇవ్వడం మొదలుపెట్టాడు.
  • దళిత, బలహీనవర్గాల పిల్లల విద్య కోసం మొదట తన రాజమహల్లోనూ, కొల్హాపూర్‌లోనూ హాస్టళ్లను ఏర్పాటు చేశాడు.
  • బహుజన సమాజ వసతి గృహాల కోసం ఆర్థికసాయం చేశాడు.
  • సాహూ మహరాజ్ 1902, జూలై 26న ప్రభుత్వ గెజిట్‌లో విప్లవాత్మక ప్రకటన జారీ చేశాడు. ప్రభుత్వ ఉద్యోగాల్లో బడుగు, బలహీన వర్గాల్లో విద్యాధికులకు 50 శాతం ఉద్యోగాలు కేటాయించి భర్తీ చేయాలని నిర్ణయించాడు. సాహూజీ చేసిన ఈ ప్రకటన భారతదేశంలో విప్లవాత్మక మార్పులు తెచ్చింది.
  • తన రాజ్యంలో ప్రజల ఆర్థిక స్థితులు మెరుగవ్వాలని, పనిచేసే వారికి పని దొరకాలని శ్రీ సాహూ స్పిన్నింగ్ అండ్ వీవింగ్ మిల్లును 1906, సెప్టెంబర్ 27న కొల్హాపూర్‌లో స్థాపించాడు.
  • సాహూజీ ఆర్థిక సహకారం మూలంగానే బీఆర్ అంబేద్కర్ మూక్ నాయక్ అనే ప్రత్యేక సంచికను వెలువరించాడు. ఈ విధంగా తన సంస్థానంలో శూద్ర, అతి శూద్రుల విద్య కోసం పరితపించి, రైతుల పరిస్థితుల అభివృద్ధి కోసం చర్యలు తీసుకుని, సంస్థానంలో వితంతు పునర్వివాహ చట్టం తెచ్చిన ఛత్రపతి సాహూమహరాజ్ 1922, మే 6న మృతిచెందాడు.