ఇతడు ఏడవ అసఫ్ జా బిరుదుతో నైజాం పదవిని అలంకరించాడు. ఇతను పురాతన హైదరాబాద్ రాజ్యాన్ని ఆధునికంగా తీర్చిదిద్దాడు. ప్రస్తుత హైదరాబాద్ అభివృద్ధికి ప్రధాన కూడలిని నిర్మించాడు.
- మొదటి, రెండో ప్రపంచ యుద్ధంలో బ్రిటిష్ వారికి సహకరించినందుకు బ్రిటిష్ వారు ఇతనికి మహా ఘనత వహించిన ప్రభువు (His Exatted Highness) అనే బిరుదును ఇచ్చారు.
- హైదరాబాద్ పాలకుడిగా నేను పరిపాలన ముంగిట్లో ఉన్నాను. అన్ని రకాలుగా నేను మా దివంగత తండ్రిలా ప్రజోపయోగ పాలకుడిగా మెలగాలన్నదే నా ఆకాంక్ష అని 1911, అక్టోబర్ 17న ఇచ్చిన అధికారిక విందు సమావేశంలో ఉస్మాన్ అలీఖాన్ ప్రకటించాడు.
- ఈ సమావేశానికి అప్పటి వైస్రాయ్ లార్డ్ హార్డింజ్ కూడా హాజరయ్యాడు.
- ఇతను పదవి చేపట్టిన కొద్దికాలంలోనే కానూన్ ఇన్సిదాదె మఖన్నిసాన్ పేరిట ఒక ఆర్డినెన్స్ జారీ చేశాడు.
- తామరతంపరగా పెరిగిపోతున్న నిస్వార్థ హిజ్రాల శ్రేణుల్లోనికి కొత్తవారిని ఆకర్షించడాన్ని కట్టడి చేయడానికి ఈ ఆర్డినెన్స్ జారీ చేశాడు.
- తన రాజ్యంలో దేవదాసీ వ్యవస్థను ఉస్మాన్ అలీఖాన్ నిషేధించాడు.
- సంపన్నుల దురలవాట్లపై దృష్టి సారించి కోడిపందాలు, ఎడ్ల పోటీలపై కొరడా ఝులిపించాడు.
- కోర్టు గదుల్లో పొగతాగడం న్యాయవ్యవస్థ గౌరవానికి భంగకరమని భావించి, పొగతాగడాన్ని నిషేధించాడు. కేసుల విచారణ, వాదనల సందర్భంగా ప్లీడర్లు, ఉన్నతాధికారులు సక్రమంగా తలపాగా, దస్తార్ ధరించాలని ఆదేశించాడు.
- మీర్ ఉస్మాన్ అలీఖాన్ తన పుట్టినరోజు నాడు కానుకలు, నగదు సమర్పించడాన్ని నిషేధిస్తూ ఫర్మానా జారీచేశాడు.
నిరంకుశుడు, పిసినారిగా ముద్ర
- ఉస్మాన్ అలీఖాన్ 1914లో దివానును విధుల నుంచి తొలగించి, పాలనా యంత్రాంగాన్ని పూర్తిగా తన చెప్పు చేతల్లోకి తీసుకున్నాడు.
- ప్రపంచ యుద్ధాలు ఏడో నిజాంకు సంతృప్తితోపాటు కలవరాన్ని కలిగించాయి. యుద్ధం తర్వాత బ్రిటిష్ వారి నుంచి బిరుదులు, సత్కారాలు పొందడం సంతృప్తినిచ్చింది. అదే సమయంలో బ్రిటిష్ వారి యుద్ధ ఖర్చుల్లోకి తన డబ్బు చాలా హరించుకుపోవడం కలవరం కలిగించింది.
- యుద్ధంలో ఎవరూ ఊహించని రీతిలో బ్రిటిష్ వారికి ఆర్థికంగా బాసటగా నిలిచాడు. ఈ ధోరణి అతని ఆలోచనల్లో చాలా మార్పు తీసుకువచ్చింది. డబ్బును మంచినీళ్లలా ఖర్చు పెట్టే నిజాం, ఆచితూచి ఖర్చు పెట్టే పరిస్థితికి వచ్చాడు.
- ఉస్మాన్ అలీఖాన్ పిసినారితనం గురించి అనేక కథలు ప్రచారంలోకి వచ్చాయి. వాటిలో కల్పితాలేవో.. వాస్తవాలేవో నిర్ధారించి చెప్పడం కష్టం.
- వీటిలోని కొన్ని నమ్మశక్యం కానివి ఉన్నాయి. ఉదాహరణకు ధరలను చూసి మామిడి పండ్లను తానే కొనుగోలు చేసేవాడు.
- లాండ్రీ బిల్లులను ఆదా చేయడం కోసం పాత తెల్లటి సూట్‌ను మాత్రమే ధరించేవాడు. ఆ సూటును శుభ్రం చేసేంత వరకు స్నానాల గదిలో కాలక్షేపం చేసేవాడు. ఇంతకంటే అసంబద్ధమైనదేదైనా ఉంటుందా?
- అయితే ఏండ్లు గడిచే కొద్ది నిజాం ఖజానా అసాధారణ స్థాయిలో పుంజుకుంది. దాంతోపాటే ఉస్మాన్ అలీఖాన్ పిసినారితనం పెరిగింది.
- త్వరలోనే ప్రపంచంలోకెల్లా అత్యంత సంపన్నుల్లో ఒకరిగా నిలిచాడు.
నిజాం తన సంపదను ఎలా పెంచుకోగలిగాడు
- మీర్ ఉస్మాన్ అలీఖాన్ వజ్రాల వ్యాపారం చేసేవాడు. అప్పటి ప్రపంచ వజ్రాల మార్కెట్‌లో 70 శాతం పైన వజ్రాలను ఇతనే సరఫరా చేసేవాడు.
- అందువల్లనే ఇతని ఆస్తి వేల కోట్లలోకి ఎగబాకింది. 1937, ఫిబ్రవరి 22న టైమ్ మ్యాగజైన్ ప్రచురించిన అత్యంత ధనికుల జాబితాలో మీర్ ఉస్మాన్ అలీఖాన్ అత్యంత ధనికుడిగా చోటు సంపాదించాడు.
- ఇతను అత్యంత విలాసవంతమైన జీవితాన్ని గడిపాడు. కోట్ల విలువ చేసే జాకబ్ డైమండ్‌ను పేపర్ వెయిట్‌గా ఉపయోగించాడు.
మీర్ ఉస్మాన్ అలీఖాన్ అభివృద్ధి కార్యక్రమాలు
- వ్యవసాయరంగం: సాగు, తాగునీటి అవసరాల కోసం ఉస్మాన్‌సాగర్, నిజాంసాగర్, హిమాయత్‌సాగర్, అలీసాగర్ చెరువులను తవ్వించాడు. తుంగభద్ర, నిజాంసాగర్ ప్రాజెక్టులు ఇతనికాలంలో ప్రారంభమయ్యాయి.
- పరిశ్రమల అభివృద్ధి: ఇతను పరిశ్రమల ఏర్పాటును పెద్ద ఎత్తున ప్రోత్సహించాడు.
ఇతని కాలంలో ఏర్పాటు చేసిన పరిశ్రమలు..
- దక్కన్ బటన్ ఫ్యాక్టరీ- 1916,
- సింగరేణి కాలరీస్ -1920
- కెమికల్ ల్యాబొరేటరీ – 1921
- దక్కన్ గ్లాస్ ఫ్యాక్టరీ – 1927
- డీబీఆర్ మిల్స్ – 1929
- వజీర్ సుల్తాన్ టొబాకో ఫ్యాక్టరీ – 1930
- ఆజంజాహీ మిల్స్ – 1934
- నిజాం షుగర్ ఫ్యాక్టరీ – 1937
- సిర్పూర్ పేపర్ మిల్ – 1939
- గోల్కొండ సిగరెట్ ఫ్యాక్టరీ – 1941
- హైదరాబాద్ ఆల్విన్ మెటల్స్ -1942
- ప్రాగా టూల్స్ – 1943
- హైదరాబాద్ ఆస్బెస్టాస్ – 1946
- హైదరాబాద్ ల్యామినేషన్ ప్రొడక్ట్స్ – 1947
- హైదరాబాద్ సంస్థానంలో మరఠ్వాడా, తెలంగాణ, బీదర్, గుల్బర్గాల్లో పెద్ద ఎత్తున రహదారులను నిర్మించాడు. హైదరాబాద్ పట్టణాన్ని అన్ని ప్రముఖ పట్టణాలతో కలిపే విధంగా ఈ రహదారులు నిర్మించబడ్డాయి.
- ఇతనికాలంలో ప్రముఖ నిర్మాణాలు: టౌన్‌హాల్ (1913), హైకోర్టు (1919), సాలార్జంగ్ మ్యూజియం (1918). ఇందులోని వస్తువులను మూడో సాలార్జంగ్ సేకరించాడు. ఉస్మానియా హాస్పిటల్ (1920- 25). ఉస్మాన్ అలీఖాన్ 25 ఏండ్ల పరిపాలన సందర్భంగా 1936లో జూబ్లీహాల్ నిర్మించారు. సెంట్రల్ లైబ్రెరీ, లేక్‌వ్యూ గెస్ట్ హౌస్, రాజ్‌భవన్, కింగ్‌కోఠి ప్యాలెస్, నిజామియా అబ్జర్వేటరీ ఇతనికాలంలో ప్రసిద్ధి చెందిన నిర్మాణాలు.
విద్యారంగంలో అభివృద్ధి
- మీర్ ఉస్మాన్ అలీఖాన్ తన మొత్తం బడ్జెట్‌లో 11 శాతాన్ని విద్యాభివృద్ధికి వినియోగించాడు.
- సెకండరీ విద్యాబోర్డును 1936లో స్థాపించారు.
- అనేక వృత్తి విద్యాకోర్సులను హైదరాబాద్‌లో ప్రవేశపెట్టాడు. అయితే ఈ విద్య ఉర్దూ మాధ్యమంలో కల్పించబడింది.
- ఇతనికాలంలో మీర్ అక్బర్‌అలీ నాయకత్వంలోని విద్యా సదస్సు సూచన మేరకే 1918లో ఉస్మానియా విశ్వవిద్యాలయం ఏర్పాటు చేశారు.
- ఉస్మానియా విశ్వవిద్యాలయంలో మొదటి భవంతి అయిన ఆర్ట్స్ కళాశాల 1919, ఆగస్టు 28న ప్రారంభమైంది.
- ఈ ఆర్ట్స్ కళాశాలను నిర్మించింది నవాబ్ అలీజంగ్. తెలంగాణ ప్రభుత్వం ఇతని జయంతి (జూలై 11న)ని రాష్ట్ర ఇంజినీర్స్ డేగా నిర్వహిస్తున్నది.
- ఈ ఆర్ట్స్ కళాశాల మొదటి ప్రిన్సిపాల్- రోజ్ మసూద్
ఇతర సంస్కరణలు
- మీర్ ఉస్మాన్ అలీఖాన్ రాజకీయ సంస్కరణల కోసం అరవముదం అయ్యంగార్ కమిటీని ఏర్పాటు చేశాడు.
- ఆంధ్రమహాసభ ఈ కమిటీ నివేదికను తిరస్కరించడం వల్ల సంస్కరణలు అమలులోకి రాలేదు.
- ఇతను 1914లో పురావస్తుశాఖను ఏర్పాటు చేసి ఎల్లోరా, అజంతా, వేయి స్తంభాల గుడి, రామప్ప దేవాలయం వంటి చారిత్రక ప్రదేశాల పరిరక్షణకు చర్యలు తీసుకున్నాడు.
- ఇతనికాలంలో పీర్లు, బోనాలను అధికారికంగా నిర్వహించేవాళ్లు.
- మీర్ ఉస్మాన్ అలీఖాన్ ఆదిలాబాద్ గోండుల పోరాటంతో ప్రభావితుడై వారి స్థితిగతులను హైమర్ డార్ఫ్ అనే జర్మనీకి చెందిన మానవ శాస్త్రవేత్తతో అధ్యయనం చేయించాడు.
- గోండుల స్థితిగతుల గురించి హైమన్ డార్ఫ్ తన ట్రైబల్ హైదరాబాద్ అనే పుస్తకంలో వివరించాడు.
- మీర్ ఉస్మాన్ అలీఖాన్ కాలంలో హోమియోపతి కళాశాల, దవాఖాన, ఉస్మానియా జనరల్ హాస్పిటల్, చార్మినార్ యునాని దవాఖాన, నిలోఫర్ చిన్న పిల్లల దవాఖాన, గాంధీ దవాఖాన, ఈఎన్‌టీ హాస్పిటల్, టీబీ హాస్పిటల్, నిజాం ఆర్థోపెడిక్ హాస్పిటల్ ఏర్పాటయ్యాయి.
నిజాం అప్రతిష్ఠతకు కారణాలు
- మహబూబ్ అలీఖాన్ కాలంలో హైదరాబాద్‌లో రాజస్థాన్, గుజరాత్, మరాఠా, కన్నడిగుల పెత్తనం అధికంగా ఉండేది. హైదరాబాద్‌లోని ప్రభుత్వ ఉద్యోగాల్లో బయటి ప్రాంతం వారిని అధికంగా నియమించడమే ఇందుకు ప్రధాన కారణం.
- ఉస్మాన్ అలీఖాన్ పాలనాకాలంలో ప్రధానంగా మరాఠీ, కన్నడిగుల ఆధిపత్యం అధికంగా ఉండేది. వీరు స్థానిక తెలుగువారిపై పెత్తనం చెలాయించేవారు.
- వీరిని కట్టడి చేసే చర్యలు అప్పటి నిజాం ప్రభుత్వం చేపట్టలేదు. దీంతో ప్రజల్లో కొంత వ్యతిరేకత ఏర్పడింది.
- 1921లో నిజాం రాష్ట్ర జన సంఘం ఏర్పడి తెలుగు భాషా వ్యాప్తికి చర్యలు తీసుకోవడంతోపాటు తెలంగాణలోని తెలుగు వారికి అవగాహన కల్పించింది.
- నిజాం ప్రభుత్వం గస్తీ నిషాన్ -53 ద్వారా ప్రజల వాక్, సభ, పత్రికా స్వాతంత్య్రాలను హరించింది.
- 1938లో ఉస్మానియా యూనివర్సిటీలో జరిగిన వందేమాతర ఉద్యమం జాతీయస్థాయిలో నిజాం నిరంకుశతత్వాన్ని బయటపెట్టింది.
- 1940లో బహదూర్ యార్‌జంగ్ రజాకార్ వ్యవస్థను ప్రవేశపెట్టాడు.
- 1946లో ఈ రజకార్లకు ఖాసీం రజ్వీ నాయకుడు కావడంతో తీవ్రస్థాయిలో హిందువులపై దాడులు కొనసాగించాడు.
- 1946-48 మధ్యకాలంలో ఖాసీం రజ్వీ నాయకత్వంలోని రజాకర్ల వ్యవస్థ, మతోన్మాద సంస్థగా మారి అమాయకులైన హిందువులపై ఎన్నో అఘాయిత్యాలు చేసింది.
- ఖాసీం రజ్వీ నాయకత్వంలోని రజాకార్ల వ్యవస్థను నియంత్రించడంలో ఉస్మాన్ అలీఖాన్ పూర్తిగా విఫలమై అప్రతిష్ట పాలయ్యాడు.
- 1948, సెప్టెంబర్ 13- 17 మధ్య జరిగిన ఆపరేషన్ పోలో లేదా పోలీసు చర్య ద్వారా సెప్టెంబర్ 17న హైదరాబాద్ రాజ్యం భారతదేశంలో విలీనమైంది.
- దీంతో అసఫ్‌జాహీల పాలన అంతమైంది.