గోండు నృత్యం
– ఇది గోండు తెగ ప్రదర్శించే కళారూపం.
– ఈ నృత్యం ఆదిలాబాద్ జిల్లా కేస్లాపూర్‌లోని భీమ్‌దేవ్ ఆలయం గోండు తెగకు సంబంధించినది.
– ఇక్కడ గోండు తెగ వారు 15 రోజులపాటు జాతరను జరుపుకుంటారు. ఇందులో
పాల్గొనడానికి అధిక సంఖ్యలో వాయిద్యకారులు, గాయకులు, నృత్యకారులు హాజరై
భక్తి గీతాలను పాడుతూ వివిధ రకాల నృత్యప్రదర్శనలు చేస్తారు. ఈ ఉత్సవాల్లో
పెండ్లి కూతుళ్లు ప్రధాన పాత్ర పోషిస్తారు.
పులి నృత్యం
– తెలుగు ప్రాంతాల్లో ప్రతి పల్లెలో ఈ నృత్యాన్ని ప్రదర్శిస్తారు. పులి
నృత్యాన్ని ముఖ్యంగా దసరా, పీర్లు, సంక్రాంతి పండుగల సందర్భాల్లో
ప్రదర్శిస్తారు.
– పులివేషం జంతునృత్యాలకు అనుకరణం. ఈ కళారూపాన్ని ఎక్కువగా పల్లె ప్రజలు
ప్రచారంలోకి తీసుకువచ్చారు. పులివేషధారులు గ్రామంలోని ఇంటిఇంటికి తిగిరి
యాచిస్తుంటారు. పిల్లలు భయపడేంత సహజంగా పులివేషం వేస్తారు.
గుస్సాడీ నృత్యం
– ఆదిలాబాద్ జిల్లాలోని రాజగోండులు ఈ నృత్యాన్ని ప్రదర్శిస్తారు. వీరు సమూహాలుగా చేరి నృత్యాన్ని ప్రదర్శిస్తారు. ఈ సమూహాలను దండారి సమూహాలు అంటారు. ఇందులోని చిన్నచిన్న సమూహాలను గుస్సాడీ అంటారు. వీరు నెమలి ఈకలు పొదిగిన, జింక కొమ్ములున్న తలపాగా, కృత్రిమ మీసాలు, గడ్డాలు, మేక చర్మాన్ని ధరిస్తారు. ఇందులోని వాయిద్యాలు డప్పు, తుడుము, పిప్రి, కొలికమ్ము. నృత్యం అయిపోయిన తర్వాత వీరి కాళ్లు కడిగి గౌరవాన్ని వ్యక్తం చేయడం ఈ నృత్యం ప్రత్యేకత.
ఉరముల నృత్యం
– ఉరము అనేది ఒక చర్మ వాయిద్యం. ఈ ప్రదర్శనలో రమణీయమైన నృత్యాన్ని ప్రదర్శిస్తారు. కాబట్టి ఉరమల నృత్యం అంటారు. ఈ నృత్యానికి కనీసం ఇద్దరు వ్యక్తులు ఉండాలి. గరిష్ఠంగా ఎంత మందైనా ఉండవచ్చు. సాధారణంగా దీనిలో ఐదుగురు సభ్యులు పాల్గొంటారు. ఆకాశంలో ఉరుము శబ్దం ఎలా ఉంటుందో ఉరము అనే చర్మవాయిద్యాన్ని వాయిస్తే ఆ విధమైన శబ్దం వస్తుంది.
గరగ నృత్యం
– గరగ అంటే కమండలం, మట్టి కుండ లేదా ముంత అనే అర్థం వస్తుంది. ద్రౌపది పాండవులను పెండ్లి చేసుకున్న తర్వాత ఆనందంతో తన చేతిలో ఉన్న చెంబును తలపై పెట్టుకొని నాట్యం చేసిందని ఆ చెంబు ఎంతో పవిత్రమైనదని దాన్నే ఇప్పుడు గరగగా పిలుస్తుందని జీఎస్ మోహన్ తన జానపద విజ్ఞానాధ్యయనంలో పేర్కొన్నాడు. ఈ గరగ నృత్యాన్ని తెలంగాణలో బోనాలు, దేవీనవరాత్రుల్లోను, గ్రామదేవతల జాతరలో ప్రదర్శిస్తారు.
సిద్ధి నృత్యం
– సిద్ధిల పూర్వీకులు ఆఫ్రికా నుంచి వలస వచ్చారు.
– వీరు పండుగ, శుభకార్యాల సమయాల్లో నృత్యాలు చేస్తుంటారు. పురాతనమైన దేశీయ వేషాన్ని ధరించి వివిధ కత్తులు ధరించి నృత్యం చేస్తారు.
కొండరెడ్ల మామిడి కొత్త
– ఖమ్మం జిల్లాలోని గిరిజన రైతులు (కొండరెడ్లు, బైసన్‌రెడ్లు) మామిడి పంట చేతికి వచ్చే సమయానికి ముత్యాలమ్మ, కొండదేవత వంటి దేవతలను పూజిస్తూ ఈ నృత్యం చేస్తారు. గుస్సాడీ నృత్యంలోని కళాకారులు వేషాలు వేయగా ఈ నృత్యంలో ఎలాంటి వేషాలు వేయరు.
మయూరి నృత్యం
– ఖమ్మం ఏజెన్సీ ప్రాంతాల్లో నివసించే తెగలు తలకు కొమ్ములను ధరించి వాయిద్య పరికరాలను వాయిస్తూ చేసే నృత్యాన్ని మయూరి నృత్యం అంటారు.
లంబాడీ నృత్యం
– వరినాట్లు, కోతలు, ఇంకా ఇతర వ్యవసాయ పనుల్లో ఉండే బంజారాలు చేసే నృత్యాన్నే లంబాడీ నృత్యం అంటారు. తెలంగాణలో పెండ్లిళ్లు, తీజ్, హోలీ ఉత్సవాల సందర్భంగా ఈ నృత్యాన్ని లంబాడీలు ప్రదర్శిస్తారు.
జోగు వారి నృత్యం
– శవాలను శ్మశాన వాటికలకు తీసుకెళ్లే సమయంలో ఒక ప్రత్యేక పద్ధతిలో చేసే నృత్యాన్ని జోగువారి నృత్యం అంటారు.
వీర నాట్యం
– మహబూబాబాద్ జిల్లాలోని కొరవి, కొత్తకొండ ప్రాంతాల్లో ఉన్న వీరభద్ర ఆలయాల్లో ఈ నృత్యం చేస్తారు.
– ఒక చేతితో కత్తి, మరొక చేతిలో డోలును ధరించి వీరణమనే పెద్ద డప్పు వంటి
చర్మవాయిద్యం మోగుతుండగా భక్తులు ఈ నృత్యాన్ని ప్రదర్శిస్తారు.
– సాధారణంగా శివాలయంలో జరిగే దూపదీప నైవేద్యం సందర్భంగా ఆలయం ముందు వీధుల మధ్యలో వీరనాట్య కార్యక్రమాలు జరుగుతాయి.
డప్పు నాట్యం
– జంతువుల తోలుతో తయారు చేసిన వాయిద్య పరికరమైన డప్పులను కొడుతుంటే వచ్చే శబ్దం ఆధారంగా నాట్యం చేయడాన్ని డప్పు నాట్యం అంటారు.
కోలాటం
– రామప్ప దేవాలయంపై కోలాటానికి సంబంధించిన కుడ్య చిత్రాలు ఉన్నాయి.
– కోలాటం జట్టులో 20 నుంచి 40 మంది ఆటగాళ్లు ఉంటారు. ప్రతి ఆటగాడి చేతిలో
రెండు కోలలు ఉంటాయి. ఈ కోలలను రంగు దారాలతో కాని గంటలతో కాని అలంకరిస్తారు.
కోయ నృత్యం
– కోయలు పండుగలు, పెండ్లి ఉత్సవాల్లో ఎద్దుకొమ్ము నృత్యాన్ని ప్రదర్శిస్తారు.
– పురుషులు ఎద్దు కొమ్ములను తలపై ధరించి రంగు రంగు దస్తులను ధరిస్తారు. ఈ
నృత్యంలో సుమారుగా 30 నుంచి 40 మంది పాల్గొంటారు. ఈ నృత్యాన్ని ప్రధానంగా
వరంగల్, ఖమ్మం, తూర్పు, పశ్చిమ గోదావరి జిల్లాలలోని షెడ్యూల్డ్ ప్రాంతాల్లో
ఉండే కోయలు ప్రదర్శిస్తారు.
కుర్రు నృత్యం
– పండుగలు, పెండ్లిళ్లు, పంటలు కోసే సమయంలో ఈ నృత్యాన్ని
ప్రదర్శిస్తారు. ఈ నృత్య ప్రదర్శనలో 20 నుంచి 30 మంది పురుషులు మాత్రమే
పాల్గొంటారు.
– ముగ్గురు వేణువు, ముగ్గురు డ్రమ్స్‌లను మోగిస్తుండగా ఆ శబ్దాలకు అనుగుణంగా నృత్య ప్రదర్శన చేస్తారు.
– కోయలు ఈ నృత్యాన్ని ప్రముఖంగా చేస్తారు.
థింసా నృత్యం
– థింసా నృత్యాన్ని రాజ్‌గోండులు చేస్తారు.
– పండుగలు, పెండ్లిల్లో ఈ నృత్యాన్ని మహిళలు, పురుషులు ఎవరికి వారే విడిగా
సంగీతానికి అనుగుణంగా చేస్తారు. ఈ నృత్యంలో ఉపయోగించే సంగీత పరికరాలు
– పెప్రె, థోలు, కాళికోం